Nov 20,2022 23:31

దీక్షలో కూర్చున్న స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 647వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నాయకులు నందికి తాతారావు, పిట్ట రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం తహతహలాడుతోందని విమర్శించారు. విశాఖ ఉక్కు జోలికి వస్తే కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖ ఉక్కును కొనడానికి ఎవ్వరు వచ్చినా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. పోరాటాలు, ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్‌ పరం కానివ్వబోమన్నారు. కాంట్రాక్టు కార్మికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.