Sep 28,2023 20:52

భగత్‌సింగ్‌కు నివాళ్లు అర్పిస్తున్న సిపిఎం నాయకులు

కొమరాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. కొమరాడలో సిపిఎం విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ నాయకులు హెచ్‌.రామారావు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసి రెడ్డి వేణు మాట్లాడుతూ బిజెపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు జీవననాడి అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకోడానికి సిపిఎం క్షేత్రస్థాయిలో కార్యాచరణలోకి దిగుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై అనుసరిస్తున్న వైఖరిని అటు పట్టణాల్లోనూ ఇటు గ్రామాల్లోనూ వాడవాడల ప్రజలకు తెలియజేసేందుకు సిద్ధమవుతుందని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకే ఇప్పటికే గట్టిగా నిలబడుతూ, నైతికంగా ఉక్కు కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిపిఎం ఉత్తరాంధ్ర అంతటా బైక్‌ యాత్రలు ఇప్పటికే చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 20న బైక్‌ యాత్ర ప్రారంభమైందని, అక్టోబర్‌ 5న కూర్మన్నపాలెం జంక్షన్‌ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని తక్షణమే ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలిచ్చి ప్లాంట్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్లాంట్‌ నిర్వహణకు రూ.5వేల కోట్లు నిధులు ఇవ్వాలన్నారు. మండలంలోని ప్రధానమైన సమస్య పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణమని, ఇందు కోసం సిపిఎం పోరాడుతుందన్నారు. అలాగే ఏనుగుల సమస్య కూడా పరిష్కరించాలన్నారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు, పోడు భూములకు పట్టాలు అందే వరకూ పోరాడుతుందన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వాకాడ ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, నాయకులు వెంకటేష్‌, సత్యం, రామారావు, కామయ్య, మధు, దాలయ్య, గోపాల్‌, అరుణ తదితరులు పాల్గొన్నారు.
భగత్‌ సింగ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
భగత్‌ సింగ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. కొమరాడలో గురువారం భగత్‌ సింగ్‌ 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో యువత పెద్దఎత్తున తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.