Feb 21,2021 06:44

'రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌' పేరుతో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వాటాల విక్రయంపై బిజెపి నేతల తీరు విచిత్రంగా కనిపిస్తోంది. తెలుగు ప్రజలను పక్కదారి పట్టించే ఉద్దేశంతో ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. తమకు బాగా తెలిసిన డైవర్షన్‌ రాజకీయాలను ఇతరులకు ఆపాదించే ప్రయత్నంలో స్పష్టం అవుతోంది. ఎ.పి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన దానికి అద్దంపడుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంపై ఆయన సూత్రీకరణలు ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ దాని వెనుక ఆ పార్టీ వ్యూహం కనిపిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించలేని స్థితిలో పడినప్పుడు వారిని గందరగోళ పరిచేందుకు సహజంగా బిజెపి వేసే ఎత్తుగడల్లో భాగంగా ఉంది.
వీర్రాజు వాదన ప్రకారం ఒక్క ట్వీట్‌ని పట్టుకుని విశాఖ ఉక్కు పరిశ్రమ మీద రాజకీయాలు చేస్తున్నారు. వామపక్షాలు, పాలక వైసిపి, ప్రతిపక్ష టిడిపి దీనికి కారణమట.
అదే నిజమైతే ఆ ప్రకటన తర్వాత విశాఖలో జరిగిన బిజెపి సమావేశం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ గురించేనని ఎందుకు చెప్పారు. అక్కడి నుంచి ఢిల్లీ యాత్ర ఎందుకు చేశారు. బిజెపి మాత్రమే కాకుండా వారి మిత్రపక్షం జనసేన నేతలు హస్తినలో అమిత్‌ షాతో భేటి వెనుక విశాఖ ఉక్కు పరిరక్షణే అని చెప్పిన మాటలు ఎందుకు.. బిజెపి మీటింగ్‌ కి, ఆ పార్టీ నేతల ఢిల్లీ పర్యటనకు కూడా వామపక్షాలు సహా ఇతర పార్టీలు కారణం అనుకోవాలా?
విశాఖ ఉక్కు పరిశ్రమలో కార్మికులను కమ్యూనిస్టులు రెచ్చగొడుతున్నారని సోము వీర్రాజు సెలవిచ్చారు.
అదే వాస్తవం అనుకుంటే కుటుంబాలతో కలిసి రోడ్డెక్కిన ప్లాంట్‌ సిబ్బంది అంత అమాయకులా. మరి ప్లాంట్‌లో బిఎమ్‌ఎస్‌ పేరుతో ఉన్న కొద్దిమంది అయినా... వారు కూడా స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై ఆందోళన చేపట్టారు కదా. వాళ్ళని కూడా కమ్యూనిస్టులు రెచ్చగొట్టారా లేక వాస్తవాన్ని కప్పిపుచ్చి వారిని అమాయకులుగా మార్చాలనే యత్నమా.
బిజెపి నేతలు ఎక్కడైనా ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ ప్రకటన చేశారా అంటూ సోము వీర్రాజు సంధించిన మరో ప్రశ్న.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ మాట చెబుతున్న సంగతి వీర్రాజుకి తెలియదనుకుంటున్నారా. మొన్నటి ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రతిపాదనలు ఆయనకి తెలియక అనుకుంటున్నారా. అక్కడి వరకూ ఎందుకు? వీర్రాజు సహచరులు జివిఎల్‌ నరసింహారావు ఏమంటున్నారు. నాలుగు రంగాల్లో మినహా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మాలనే నిర్ణయించిన విషయం తెలుగులోనే చెబుతున్నారుగా. మరో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మాల్సిందేనని సెలవిచ్చారు కదా. అయినా సోము వారు ఎందుకిలా?


కమ్యూనిస్టులు, వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌లు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులలో భయాందోళనలను కలగచేయటానికి చేస్తున్న పుకార్లతో పక్కదారి పట్టవద్దని ఆంధ్ర ప్రదేశ్‌ బిజెపి స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నదని సోము వారు చెబుతున్నారు.
నిజమే మరి.. జివిఎల్‌ ఒక మాట.. సుజనా మరో మాట మాట్లాడుతుంటే వీర్రాజు, పురందేశ్వరి వంటి వాళ్ళు అబ్బే ఏమి లేదని చెబుతున్నది కూడా పుకార్లే. చివరకు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో అమిత్‌ షా సానుకూలంగా స్పందించారని ఢిల్లీలో వీర్రాజు బృందం చెప్పిన మాటలు కూడా పుకార్లే. ఇవన్నీ ప్లాంట్‌ ఉద్యోగులకు అర్థం కావని వీర్రాజు అనుకుంటే అది కూడా పుకారు అవుతుంది మరి. కేంద్ర ప్రభుత్వానికి స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ప్రయోజనాలు అతి ముఖ్యమైన అంశం, వారు ఎప్పుడూ సురక్షితం గా ఉంటారు అంటూ సోము వీర్రాజు భరోసా ఇస్తున్నారు.


అయ్యా.. వీర్రాజు గారు.. మీ పక్కనే ఉన్న పురందేశ్వరి 2012, 13లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పక్కనే ఉన్న హిందూస్థాన్‌ జింక్‌ ఉద్యోగులకు చెప్పిన మాటలు మీరు మళ్ళీ పునరావృతం చేయదలచుకున్నారా. ఎందుకంటే ఇలాంటి మాటలు విన్న తరువాత అక్కడ ఏమయిందో విశాఖ వాసులు అందరికి తెలుసు. పారిశ్రామిక కార్మికులు అసలు మరచిపోలేరు. కాబట్టి పోరాటం పక్కదారి పట్టించేందుకు మీరు వేస్తున్న కుయుక్తులు ప్రతిసారీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీరు గ్రహిస్తే మంచిది.
                                                                                       * అప్పలకొండ