Aug 02,2021 12:13

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అంటే ఇంటి పెద్దదిక్కును కోల్పోయినట్లేనని విశాఖపట్నం మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రెండు రోజులపాటు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద మేయర్‌ హరి వెంకట కుమారి నాయకత్వంలో ''మేము సైతం అంటూ'' అన్ని పార్టీల కార్పొరేటర్లు నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని జివిఎంసి కౌన్సిల్‌ లోను, అసెంబ్లీలో తీర్మానాలు చేయడం జరిగిందని, కేంద్రానికి పంపడం జరిగిందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంటే తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న పరిశ్రమ అన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌ సరఫరా చేసి బాధితులను స్టీల్‌ ప్లాంట్‌ ఆదుకుందని, 1000 పడకలు ఏర్పాటు చేసి తనవంతు పాత్ర నిర్వహించిన స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను వెనుక్కు తీసుకొని ప్రభుత్వ రంగంలోనే స్టీల్‌ ప్లాంట్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ మేయర్‌ కట్టమూరి సతీష్‌ మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా కౌన్సిల్‌లోని అన్ని పార్టీల కార్పొరేటర్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కౌన్సిల్‌లో సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ బి గంగారావు మాట్లాడుతూ... అన్ని పార్టీల కార్పోరేటర్లు ఒకే మాటపైకి వచ్చి స్టీల్‌ ప్లాంట్‌ కోసం నడుం బిగించడం హర్షించదగిన విషయం అన్నారు. విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకు ఉమ్మడి కుటుంబం వంటి స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మే హక్కు మోడీ ప్రభుత్వానికి లేదన్నారు. లాభాల్లో నడుస్తున్న స్టీలు ప్లాంటును అమ్మే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ ఉందన్నారు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం ఢిల్లీకి బయలుదేరిన కార్మికులను, ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లోనూ, ఎయిర్‌ పోర్టులోను అడ్డుకోవడం, ముందుగా బుక్‌ చేసుకున్న హౌటళ్లను వారికి ఇవ్వకుండా అవరోధాలు కల్పించడం మోడీ ప్రభుత్వానికి తగదన్నారు. మోడీ గాని, బిజేపి మంత్రులు గాని, విశాఖపట్నం రాగలరా అని ప్రశ్నించారు. వారు విశాఖ వస్తే అడ్డుకుంటామని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదన్నారు. ఆంధ్ర ప్రజలు వారి సత్తా ఏమిటో నిరూపిస్తామని స్పష్టం చేశారు.