
ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్ కార్మికులకు తక్షణం వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్, యు.రామస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యాన డైరెక్టర్ (పర్సనల్), డైరెక్టర్ (ఫైనాన్స్) సురేష్ చంద్ర పాండేను వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, గడచిన మాసానికి జీతాలను చెల్లించడంలో కూడా జాప్యం వహించడం యాజమాన్య అసమర్ధతకు తార్కాణమన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించడంలో ఇటువంటి సందర్భాలు పునరావృతం కాకూడదన్నారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్ మాట్లాడుతూ, బ్లాస్ట్ ఫర్నిస్-3ని ఉత్పత్తిలో పరుగులు పెట్టించి తద్వారా కొత్త జీతాలను చెల్లిస్తామన్న సిఎమ్‌డి మాటలు నీటిపై రాతలుగా మారుతున్నాయని విమర్శించారు. బిఎఫ్-3తో పాటు బిఎఫ్-2లో కూడా ఉత్పత్తి నిలిపి వేస్తామన్న చర్యను తక్షణం ఉపసంహరించుకొని, పూర్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నడపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు బి.అప్పారావు, కె.గంగాధర్, యు.వెంకటేశ్వర్లు, టివికె.రాజు, మరిడయ్య, రాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు.