Oct 17,2023 00:40

ధర్నా చేస్తున్న స్టీల్‌ సిఐటియు కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : దసరాలోగా స్టీల్‌ కార్మికులకు బోనస్‌ చెల్లించాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్టీల్‌ ప్రధాన పరిపాలన భవనం వద్ద స్టీల్‌ సిఐటియు మిత్రపక్షాల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం స్టీల్‌ సిఎమ్‌డి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం కంటే అదనంగా బోనస్‌/ఎక్స్‌ గ్రేషియా చెల్లింపుతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు గత సంవత్సరం బకాయి పడ్డ రూ.9500 కూడా కలిపి చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం రూపొందించిన ఫార్ములాను పక్కనపెట్టి బోనస్‌ చెల్లింపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
యూనియన్‌ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, స్టీల్‌ యాజమాన్యం బోనస్‌పై రూపొందించిన దుర్మార్గమైన ఫార్ములాకు వ్యతిరేకంగా దుర్గాపూర్‌ స్టీల్‌ప్లాంట్‌లో కార్మిక సంఘాలను ఐక్యపరిచి ఉద్యమిస్తున్నారని, దేశంలోని అనేక ప్లాంట్‌లో దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారని వివరించారు. దుర్గాపూర్‌లో నిరసన తెలుపుతున్న కార్మిక నాయకులను యాజమాన్యం సస్పెండ్‌ చేయడం క్షమించరానిదన్నారు. ఇదే దుర్గాపూర్‌లో 12 మంది ప్రాణాలర్పిస్తేనే ఎన్‌జెసిఎస్‌ ఆవిర్భవించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి బెదిరింపులకు యాజమాన్యం దిగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్‌, మిత్రపక్షాల నాయకులు డివి.రమణారెడ్డి, డి.సురేష్‌బాబు, సిహెచ్‌ సన్యాసిరావు మాట్లాడుతూ, కార్మికులకు హక్కుగా ఉన్న బోనస్‌పై యాజమాన్య అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు నాయకులు పి.శ్రీనివాసరాజు, యు.వెంకటేశ్వర్లు, మరిడయ్య, లోకేష్‌, డిఎస్‌ఆర్‌సి,మూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, వి.ప్రసాద్‌, రాజా, పవన్‌కుమార్‌, మున్నయ్య, శశిరెడ్డి, కెఆర్‌కె.రాజు, మిత్రపక్షాల నాయకులు శంకరరావు, శ్రీనివాస్‌, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.