Nov 10,2022 00:28

బారికేడ్లు, రోప్‌లతో అడ్డుకుంటూన్న పోలీసులు

ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఉద్యమం ఉధృతం చేశారు. కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు కార్మికులు తలపెట్టిన బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నా వెరవకుండా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయినా పోలీసులు బారికేడ్లు, రోప్‌లతో అడ్డుకున్నారు. వాటిని తోసుకుంటూ కార్మికులు పాదయాత్ర ప్రారంభించారు. గాజువాక పోలీసు స్టేషన్‌ జంక్షన్‌ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని సుమారు 169 మంది కార్మికులను అరెస్టుచేశారు.
ఉక్కునగరం : బుధవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా అధిక సంఖ్యలో కార్మికులు కూర్మన్నపాలెం కూడలికి చేరుకున్నారు. బైక్‌ ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే వందలాది మంది పోలీసులు మోహరించారు. బైక్‌ ర్యాలీ చేపట్టడానికి వీల్లేదు అంటూ ఆంక్షలు విధించారు. బారికేడ్లు అడ్డువేసి ర్యాలీని నిరోధించారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు మాట్లాడుకుని బైక్‌ ర్యాలీ కాకుంటే పాదయాత్రగా జివిఎంసి వరకు వెళ్లడానికి నిశ్చయించారు. పోలీసు ఆంక్షల నేపథ్యంలో గాజువాక, పెదగంట్యాడ, వడ్లపూడి ఇలా వేరువేరు దారుల్లో కార్మికులంతా కలిసి పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసులు రోడ్లపై నడిచేందుకు సైతం అనుమతి ఇవ్వలేదు. వందలాదిమంది పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ పాదయాత్రగా బయలుదేరారు. గాజువాక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఎవరు దొరికితే వారిని అరెస్టు చేసి స్టేషన్‌ లోపలికి తరలించారు. ముందుగా కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్‌లో సైతం కార్మిక సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు.
అఖిలపక్ష కార్మిక సంఘాల ర్యాలీ, సభ
కలెక్టరేట్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయటం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డిఆర్‌ఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అక్కడ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాల జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరణ చేయరాదన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ సభలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రూ.మూడు లక్షల కోట్ల ఆస్తి కలిగి ఉందని, కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో చెల్లించిందని తెలిపారు. అలాంటి ప్లాంట్‌ను అమ్మాలని నిర్ణయించడం దుర్మార్గం అన్నారు. ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు పడాల రమణ మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించడం లేదని ప్రధాని మోడీ, స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ వ్యతిరేకమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌చేశారు. సిఎఫ్‌టియుఐ జాతీయ అధ్యక్షుడు ఎన్‌.కనకారావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, నేటికీ ఉపాధి పొందని 8,500 మందికి నిర్వాసితులకు పర్మినెంట్‌ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మరికొందరు వక్తలు మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని, వాల్తేరు రైల్వే డివిజన్‌ తరలింపు విరమించాలని, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఉత్తరాంధ్ర నీటి వనరుల ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌చేశారు. సభలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌.జ్యోతీశ్వరరావు, కో-కన్వీనర్‌ కె.ఎం కుమార్‌మంగళం, సిఐటియు నాయకులు బి.జగన్‌, పి.వెంకటరెడ్డి, బి.వెంకటరావు, జి.అప్పలరాజు, ఎం.సుబ్బారావు, వై.రాజు, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, బి.రమణి, ఎఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎం.మన్మధరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.కె రెహమాన్‌, ఐద్వా విశాఖ జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు చోడదాసి సుధాకర్‌, పిఒడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, అరుణోదయ కార్యదర్శి కె.నిర్మల, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు బి.కుసుమ, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు యుఎస్‌ఎన్‌.రాజు, పి.కృష్ణారావు, టి. కామేశ్వరరావు, కెవిపి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.