Oct 28,2023 23:35

స్టీల్‌ వైద్యాధికారికి వినతిపత్రం ఇస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జనరల్‌ హాస్పిటల్‌ విభాగాధిపతి డాక్టర్‌ ప్రకాష్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన స్టీల్‌ సిఐటియు ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల సంఖ్య తగ్గి ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో ఉన్న కార్మికులపై ఒత్తిడి పెరిగి, స్టీల్‌ కార్మికులు తీవ్రఒత్తిడికి గురవుతున్నారన్నారు.
దీంతో వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువై ఆసుపత్రికి వెళితే, అక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు, రోగికి కావలసిన మందులు అందుబాటులో లేవన్నారు. దీనికి పొంతన లేని కారణాలను చూపటం యాజమాన్యం నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమన్నారు. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీనికి హాస్పిటల్‌ విభాగాధిపతి డాక్టర్‌ ప్రకాష్‌ స్పందిస్తూ, సమస్యలను ఉక్కు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాలు మేరకు రోగులకు సేవలు అందిస్తామన్నారు. సమావేశంలో హాస్పిటల్‌ ప్రతినిధి డాక్టర్‌ సారంగి, స్టీల్‌ సిఐటియు ప్రతినిధులు వైటి.దాస్‌, యు.రామస్వామి, టివికె రాజు, నీలకంఠం, గడ వెంకటేశ్వరరావు, అప్పలరాజు, యు వెంకటేశ్వర్లు, పుల్లారావు, పూర్ణచంద్రరావు, సిఐటియు హాస్పిటల్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.