Dec 30,2022 23:14

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పరీక్షకు ఉపయోగపడే విధంగా స్టడీ మెటీరియల్‌ రూపొందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం శాసనమండలి సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ స్టడీ మెటీరియల్‌ పుస్తకాన్ని కలెక్టర్‌ ఢిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంఎల్‌సి లక్ష్మణరావు పది వేల పుస్తకాలను ఉచితంగా విద్యార్థులకు అందించేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పరీక్షకు అర్హత ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ఉత్తీర్ణులైతే సంవత్సరానికి 12 వేల రూపాయలు చొప్పున 4 సంవత్సరాల పాటు విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ మొత్తం అందుతుందని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పి.మురళీకృష్ణ, జ్యోత్స్న, వాణి, మనోహర్‌, కె. శ్రీనివాసరావు, రత్నకమల్‌ పాల్గొన్నారు.