ప్రజాశక్తి -గోనెగండ్ల
పంటలను కాపాడుకోవడానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఎడిఎ మహ్మద్ ఖాద్రీ, ఎఒ హేమలత సోమవారం తెలిపారు. మండలంలో సాగు చేసిన మిరప పంటలో కొన్ని రకాల కొత్త తెగుళ్లు, వివిధ రకాల పురుగులు ఆశించడంతో వాటిని నివారించుకుని పంటను కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిరప పంటలో రైతులు తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యల గురించి ఎడిఎ మహ్మద్ ఖాద్రీ, ఎఒ హేమలత వివరించారు. తామర పురుగులు, పచ్చ రబ్బరు పురుగు, కొంచెం బూడిద తెగులు గమనించినట్లు తెలిపారు. తామర, పచ్చ రబ్బరు పురుగుకు ఫ్లుక్సా మెటమైడ్ 'ఎ' 16 మిల్లీ/20లీటర్ల పంపునకు కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. బూడిద తెగులు నివారణకు అజాక్సీ స్త్రోబిన్ 'ఎ' 10 మిల్లీ/20 లీటరు పంపునకు కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. ఈ పురుగు, తెగుళ్ల నివారణకు బవేరియా, వర్టిసీలియం, సూడో మోనాస్ ఒక్కోటి 100 మిల్లీ/20 లీటర్ల పంపునకు కలిపి, ప్రతి పంపునకు 200 గ్రాముల బెల్లం కరిగించిన నీరు పోసి, ప్రతి రసాయన మందు స్ప్రే తర్వాత 4 రోజులకు ఈ జీవ క్రిమి నాశనుల పిచికారీ చేయాలని సూచించారు.