Apr 26,2023 22:45

స్పాట్‌ కేంద్రంలో నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-గుంటూరు : ఏడాది పొడవునా బోధనేతర పనులతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి, చివరకు ఉపాధ్యాయులను సస్పెన్షన్లు చేయటం సరైంది కాదని గుంటూరు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్‌ ఎం.కళాధర్‌ అన్నారు. ఉపాధ్యాయుల అక్రమ సస్పెన్షన్లు నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా రెండోరోజైన బుధవారం స్థానిక నగరంపాలెంలోని టెన్త్‌ స్పాట్‌ కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. కళాధర్‌ మాట్లాడుతూ పర్యవేక్షణ పేరుతో పాఠశాలలను తనిఖీలు చేస్తూ ఇదిలేదు.. అదిలేదు.. అనే వంకతో ఉపాధ్యాయుల్ని సెస్పెండ్‌ చేయటం కక్షసాధింపు చర్యన్నారు. ఉపాధ్యాయుల్ని వేధించటం ద్వారా విద్యాభివృద్ధి జరగదని, సస్పెన్షన్లు ఆపకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫ్యాప్టో నాయకులు బసవలింగారావు, కో-ఛైర్మన్‌ జి.మోహన్‌రావు, కార్యదర్శులు వేళంగిణిరాజు, బి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఉన్నతాధికారులు వారి విధులు మాని, ఉపాధ్యాయుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉపాధ్యాయుల్ని బలిపశువుల్ని చేస్తోందని అన్నారు. నిరసనలో ఫ్యాప్టో నాయకులు మేకల సుబ్బారావు, ఖాలిద్‌, శివపార్వతి, శివన్నారాయణ, నరసింహారావు, జి.వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి ప్రసంగించారు.