ప్రజాశక్తి-విజయనగరం టౌన్: ఎంతో హుందాగా.. ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో.. మీసం తిప్పడం, విజిల్ వేయడం ద్వారా టిడిపి సభ్యులు సభను అగౌరవ పరిచారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై రాద్ధాంతం చేస్తున్న టిడిపి నాయకులు అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీ ఒక వేదికగా చర్చకు ఉపయోగపడేదని చెప్పారు. ఆ అవకాశాన్ని ఎందుకో గానీ.. టిడిపి సభ్యులే జారవిడుచుకున్నారని విమర్శించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21, 22వ తేదీల్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో టిడిపి సభ్యుల ప్రవర్తనను ప్రజలంతా గమనించారని చెప్పారు. మొత్తంగా సస్పెండ్ అవ్వడం కోసమే వారంతా యాక్షన్ చేశారని.. ఏదో ఒక విధంగా సభ నుంచి వెళ్లిపోవడమే వారి ఉద్దేశమని తెలిపారు. సమావేశాలు ప్రారంభమై నిమిషమైనా కాకముందే, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళ పరిచారన్నారు. సభాపతిని కొట్టేంత పని చేశారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ కోరకుండా ఆయనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని అరవడం ఎంత వరకూ సబబని, అసలు సభాపతికి ఆ హక్కు ఉంటుందా? అని ప్రశ్నించారు. 'అచ్చెన్న వంటివారు జగన్ మీద విమర్శలు చేస్తున్నారు.. పోనీ, మా ముఖ్యమంత్రి బెయిల్ మీద వచ్చారు. మీకు సత్తా ఉంటే చంద్రబాబు నిప్పు, నిజాయితీపరుడు, కడిగిన ముత్యం అని నిరూపించుకోండి' అని సవాల్ చేశారు. మిగిలిన మూడు రోజుల సమావేశాలనైనా అందుకు వినియోగించుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, ఎన్‌టిఆర్ కాళ్లు పట్టుకొని టిడిపిలో చేరిన చంద్రబాబు.. చివరకు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని కోలగట్ల విమర్శించారు. కొడుకు భవిష్యత్తుకు అడ్డు వస్తాడన్న కారణంతో జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేశాడని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రికి దాసోహమై, విభజన చట్టంలోని హక్కును సుమారు 8 ఏళ్లు కోల్పోయేలా చేశాడని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. స్టేలన్నీ ఎత్తివేయించి విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నగరంలోని వివిధ ప్రాంతాలలో రూ.65 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి శంకుస్థాపనలు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం దిశగా రహదారులు, కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోరాడ వీధి, తుపాకుల వీధి, జొన్న గుడ్డి, ధర్మపురి, తోటపాలెం, ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ లయ యాదవ్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. మేయర్ విజయలక్ష్మి, జోనల్ ఇన్చార్జి డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కార్పొరేటర్లు కడియాల రామకృష్ణ, పట్నాన పైడిరాజు, పతివాడ గణపతి రావు, దుప్పాడ సునీత, జివి రంగారావు తదితరులు పాల్గొన్నారు.










