ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జనన్న ఆరోగ్య సురక్షపై అధికార పార్టీ ప్రచారం కాస్తా శృతి మించిపోతోంది. ఈ పథకం మంచిదే. కానీ, ప్రభుత్వం, వైసిపి పెద్దలు చేస్తున్న ప్రచారార్భాటం అంతా ఇంతాకాదు. మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడప దాటనట్టుగా అమలు తీరు ఉందని పలువురు మండిపడు తున్నారు. విద్య, వైద్యారోగ్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రభుత్వ బాధ్యత. ఇటువంటి పరిస్థితుల్లో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేని కుటుంబాలే కొకొల్లాలుగా ఉన్నాయి. ఈనేపథ్యంలో అందరికీ ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య శిబిరాలు నిర్వహించడం మంచిదే. కానీ, నిర్వహించే తీరు మాత్రం ఇలా కాదని జనం పెదవి విరుస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రభుత్వ వైద్యమంటే శాశ్వతమైన వైద్యారోగ్య సేవలు మెరుగు పర్చాలి.అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులను, అందులో సదుపాయాలు మెగరుపర్చాలి. వైద్యపరికరాలు, అన్ని రకాల మందులు సమకూర్చాలి. ముఖ్యంగా వైద్యారోగ్యసేవలకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉంటున్న ఆశా వర్కర్లకు తగిన పారితోషికం లేదా జీతభత్యాలు ఇవ్వాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం మైదాన ప్రాంతంలో ప్రతి 25వేల జనాభాకు, గిరిజన ప్రాంతంలో ప్రతి 10వేల జనాభాకు ఒక పిహెచ్‌సి చొప్పున ఉండాలి. మైదాన ప్రాంతంలో ప్రతి 5వేల జనాభాకు, గిరిన ప్రాంతంలో 2వేల జనాభాకు ఒకొక్కటి చొప్పున సబ్-సెంటర్లు ఉండాలి. విజయనగరం జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సుమారు 20లక్షల జనాభా ఉంది. ఇందులో మైదాన ప్రాంతంలో 19.50లక్షలు, గిరిజన ప్రాంతంలో 50వేల జనాభా ఉంది. ఈ లెక్కన ఒక్క మైదాన ప్రాంతంలో 78 పిహెచ్‌సిలు, 390 సబ్-సెంటర్లు, గిరిజన ప్రాంతంలో 5పిహెచ్‌లు, 25 సబ్ -సెంటర్లు ఉండాల్సినప్పటికీ మైదాన, గిరిజన ప్రాంతం కలుపుకుని మొత్తంగా 48పిహెచ్‌సిలు, 452 సబ్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. సబ్-సెంటర్ల సంఖ్య కాస్త సరిపోయినప్పటికీ కీలక వైద్యసేవలందే పిహెచ్‌సిలు సగానికి సగం మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి మైదాన ప్రాంతంలో ప్రతి 50వేల మందికి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. బాడంగి మండలంలో మొత్తం 25పంచాయతీల పరిధిలో 32 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక్క వాడాడ పిహెచ్ ఆధారం. దీంతో, వైద్య బృందాలు కేవలం విలేజ్ క్లీనిక్ కేంద్రాలుగావున్న 18 గ్రామాల్లో మాత్రమే సేవలందిస్తున్నాయి. ఈ మండలంలోని పూడివలస, పిండ్రింగివలస, చినవాడాడ, మల్లంపేట, అచ్చియ్యపేట, లక్ష్మీపురం, హరిజన పాల్తేరు గ్రామాలకు చెందిన రోగులు సంబంధిత విలేజ్ క్లీనిక్‌కి వెళ్లాలంటే కనీసం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సి వుంటుంది. కేవలం బాడంగి మండలంలోనే కాదు. దాదాపు ఎక్కువ చోట్ల ఇటువంటి పరిస్థితి ఉంది. దీంతో, క్షేత్ర స్థాయిలో కీలక సేవలందించడం భారంగా మారుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్లీనిక్ భవనాలు కూడా పూర్తి కాకపోవడంతో పరాయి పంచల్లోనూ, ఆ అవకాశమూ లేని చోట ఆరు బయట మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందులు, వైద్యపరీక్షలకు అవసరమైన పరికరాలు సమకూర్చడంతో పాటు అందుకను గుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సన్నద్ధం చేయాల్సి వుంది. ఇటువంటివేవీ పట్టించుకోకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల మాదిరిగా వైద్యశిబిరాలు నిర్వహించి దేశానికే ఆదర్శమని ఊదరగొడితే ప్రజలు నమ్మేదెలా?. అలాగని వైద్యశిబిరాలు నిర్వహించడం తక్కువ చేసి చూడలేం. ఆసుపత్రి వరకు వెళ్లలేనివారు గ్రామంలోనే ఆరోగ్య తనిఖీలు చేసుకోవచ్చు. వైద్య శిబిరాలకు అపూర్వ స్పందన అంటూ ప్రచారమే కాస్త ఆశ్యర్యానికి, అపహస్యానికి గురిచేస్తోందని జనం మాట్లాడు కుంటున్నారు. వైద్య శిబిరాల్లో ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, మాటలు చూస్తే, ఇప్పటి వరకు తల్లిదండ్రులను కొడుకు, కోడలు ఏమాత్రం పట్టించు కోనట్టు, ప్రభుత్వం మాత్రమే పట్టించు కున్నట్టుగా ఉన్నాయి. ఇటీవల ఓ గ్రామంలో కళ్ల జోళ్లు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఓ వృద్ధుడితో మాట్లాడిన తీరు ఇందుకు మచ్చుతునకగా జనం చెప్పుకుంటున్నారు. 'ఈ కళ్లద్దాలు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఆ... జగనన్న ఇచ్చాడు, మీ కొడుకో కోడలో ఇవ్వలేదు' అంటూ ముక్తాయించి చెప్పడం పట్ల హవ్వ అంటూ జనం ముక్కున వేళ్లేసుకుంటున్నారు. సాక్షాత్తు సర్వజన ఆసుపత్రిలో కనీసం థైరాయిడ్ టెస్టులే నిర్వహించలేని వారు ఏడాదికో, నెలకో వైద్య శిబిరం నిర్వహిస్తే సరిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికలు దగ్గరపడుతున్న వేల ప్రజల్లో తలలో నాలుకగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నమేనని, దీన్ని ప్రజలు ఎంత వరకు విశ్వశిస్తారో వేచి చూడాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.










