Dec 05,2021 12:16

మొదటి సినిమాతోనే గ్రేట్‌ మాస్టర్స్‌ సరసకు చేరిన దర్శకుడిగా, తను సృష్టించిన పాత్రలతో తరతరాల పాఠకులను అలరిస్తున్న రచయితగా, కంప్యూటర్‌ ఫాంట్లు లేని కాలంలో సరికొత్త అక్షరాలను సృష్టించిన కాలిగ్రాఫర్‌గా, వినూత్న రీతిలో గ్రంథాల ముఖచిత్రాలూ, పోస్టర్లూ, లోగోలూ డిజైన్‌ చేసిన ఇలస్ట్రేటర్‌గా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, సంగీత దర్శకుడిగా, డాక్యుమెంటరీ నిర్మాతగా, పత్రికా సంపాదకుడిగా - ఇలా సత్యజిత్‌ రే తను ప్రవేశించిన ప్రతి రంగంలోనూ అసమాన ప్రతిభాపాటవాలు కనబరిచి.. బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నాడు. పద్మభూషణ, భారతరత్న బిరుదులు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఆస్కారు జీవన సాఫల్య పురస్కారం, అఖిరా కురసోవా జీవన సాఫల్య పురస్కారం వంటి వ్యక్తిగత అవార్డులతో పాటు, లెక్కలేనన్ని ఇతర అవార్డులూ, గౌరవాలూ దక్కించుకున్నారాయన. పౌరాణిక ఇతివృత్తాలతోనే భారత చలనచిత్రం సతమతమౌతోన్న తరుణంలో, అచ్చమైన భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు సత్యజిత్‌ రే. అటువంటి అరుదైన మేధావి శతజయంతి జరుపుకుంటున్న ప్రత్యేక సందర్భం.. ఆయన జీవిత విశేషాలనూ, ఆయన సృజనలోని విశిష్టతను గురించే ఈ ప్రత్యేక కథనం..

   సుకుమార్‌ రే, సుప్రభా రేకు 1921, మే 2న జన్మించాడు సత్యజిత్‌ రే. పుట్టిన రెండున్నర ఏళ్లకే తండ్రి సుకుమార్‌ మరణించాడు. తన తండ్రి గురించి సత్యజిత్‌ రే ఇలా రాసుకున్నాడు 'నాన్న గురించి నేను అమ్మ ద్వారా, బంధువుల ద్వారా, అతని రచనలూ, బొమ్మలూ, నోట్‌ బుక్కులూ, రాత ప్రతుల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగాను. నాన్న ప్రత్యక్ష స్పర్శ జ్ఞాపకాలేవీ లేవు. 'అపరాజితో'లో అపూను కష్టపడి పెంచే సర్బొజయాలో మనం సత్యజిత్‌ తల్లి సుప్రభానే చూస్తాం. ఆ సినిమా చాలామట్టుకు సత్యజిత్‌ బాల్యాన్నే చూపుతుంది. భర్త మరణానంతరం సుప్రభా కొడుకుతో పాటు తన అన్నయ్య ఇంటికి చేరింది. వితంతువుల ఆశ్రమంలో కుట్టుపని నేర్పే ఉద్యోగంలో చేరి, ఇంటి ఖర్చులకు తనవంతు తోడ్పడేది. మేనమామ ఇంట్లో ఎవరూ సత్యజిత్‌ను అనాథగా చూడలేదు. పైపెచ్చు అతడి తెలివితేటల్ని చూసి 'మాణిక్‌' (మాణిక్యం) అని పిలిచేవారు. సత్యజిత్‌ రేను చాలామంది 'మాణిక్‌ దా' అనే పిలుస్తారు.

                                                 ఉద్యోగ పర్వం - సృజనాత్మక డిజైనింగ్‌

డి.జె. కీమర్‌ అనే బ్రిటీషు అడ్వర్టైజ్‌మెంట్‌ సంస్థలో 1943లో సత్యజిత్‌ చేరాడు. దాంతోపాటే సిగెట్‌ ప్రెస్‌ అనే ప్రచురణ సంస్థకూ బొమ్మలు వేసేవాడిగా (ఇలస్ట్రేటర్‌గా) కుదిరాడు. సిగెట్‌ ప్రెస్‌లో పుస్తకాల కవర్లు రూపకల్పనలో సత్యజిత్‌ అసామాన్య సృజనను కనబరిచాడు. సినిమా పోస్టర్లు, ఏవైనా సంస్థల లోగోలు తయారుచేసినా వాటిలో రే ముద్ర కచ్చితంగా కనిపించేది. ఉదాహరణకు ఐన్‌స్టీన్‌ సినీ క్లబ్‌ కోసం వేసిన లోగో నాలుగువృత్తాలు నలువైపులా వ్యాపిస్తున్నట్టు ఉంటుంది. ఒక సినిమా క్లబ్బు ప్రేక్షకుడి ప్రపంచ సినీ పరిజ్ఞానాన్ని విస్తరింపజేసేదే కదా! ఉద్యోగంలో భాగంగా 'పథేర్‌ పాచాలి' బాలల వెర్షన్‌కు బొమ్మలు వేసే పని సత్యజిత్‌ రేకి అందింది. అది అతడి జీవితంలో ఒక పెద్ద మలుపు. ఆయన ఆ కథతో, ఆ పాత్రలతో, తను వేసిన బొమ్మలతో ఎంతగా మమేకమయ్యాడంటే, దాన్ని సినిమాగా ఎలా తీయాలో ఆలోచించడం మొదలుపెట్టేంతలా! ఈ అనుభవంతోనే స్క్రిప్టు దశలో సన్నివేశాలను స్కెచ్చులుగా వేసుకోవడం అలవర్చుకున్నాడు రే.

                                                   రెనర్‌ సాంగత్యం - లండన్‌ ప్రయాణం

సినిమాలు తీయాలని ఆసక్తి ఉన్నా, అతడు కోరుకున్నవి భారతదేశంలో తయారౌతున్న మాదిరి సినిమాల్లాంటివి కావు. అందుకని సినీ సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. రష్యన్‌ మాస్టర్స్‌ పుదోవ్కిన్‌, సెర్గీ ఐన్‌స్టీన్‌ పుస్తకాలు చదివి, మాంటేజి టెక్నిక్‌ను అర్థం చేసుకున్నాడు. బ్రిటీషు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి 'సైట్‌ అండ్‌ సౌండ్‌' పత్రికకు చందాదారుడయ్యాడు. మంచి సినిమాల ప్రచారం కోసం చిదానంద దాస్‌ గుప్తా తదితరులతో కలిసి 1947లో కోల్‌కతా ఫిల్మ్‌ సొసైటీ స్థాపించాడు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా కోల్‌కతా పోస్టింగ్‌లో ఉన్న అమెరికన్‌ సైనికులు కొందరితో రేకి స్నేహం ఉండేది. వారు అమెరికా సినిమాల గురించీ, సంగీతం గురించీ సమాచారం అందించేవారు. 1949లో అతడి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి: చాలా ఏళ్ల ప్రేయసి, బంధువులమ్మాయి బిజయా దాస్‌తో పెళ్లి, కుమారుడు సందీప్‌ జననం. రెండోది: ప్రఖ్యాత ఫ్రెంచి దర్శకుడు జీన్‌ రెనర్‌ తన 'ది రివర్‌' సినిమా షూటింగు కోసం కోల్‌కతా రావడం. బ్యారక్‌పూర్‌, బయట ప్రాంతాల్లో షూటింగ్‌కు వెళ్లినపుడు, రే అతనికి గైడుగా ఉంటూ, షూటింగును పరికిస్తూ దర్శకత్వంలో కిటుకులు నేర్చుకున్నాడు. 'పొథేర్‌ పాచాలి' సినిమా తీయాలన్న సంగతి రెనర్‌కు చెప్పడంతో మనసారా ప్రోత్సహించాడు. సత్యజిత్‌ సినీ నిర్మాణంపై రెనర్‌ ప్రభావం ఎంతో ఉంది.
    రే పనిచేసే డి.జె. కీమర్‌ కంపెనీ 1950లో అతడిని ఆరు నెలల పాటు లండన్‌ హెడ్‌ ఆఫీసుకి పంపించింది. సత్యజిత్‌కి లండన్‌ యాత్ర వరంలా పనిచేసింది. ఆ ఆర్నెలల్లో 99 పేరైన విదేశీ సినిమాలు చూశాడు. కోల్‌కతాలో చూడలేకపోయిన ఆర్సన్‌ వేల్స్‌ 'సిటిజన్‌ కేన్‌' (1941) సినిమా చూశాడు. కానీ ఇటలీ నవ్య వాస్తవ వాద ధోరణిలో విటోరియా డిసికా తీసిన 'ది బైసైకిల్‌ థీవ్స్‌' (1948) అతడిని ఎంతగా ఆకట్టుకుందంటే, ఆ సినీ వీక్షణంతో తను తీయబోయే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది. 'సినిమా కోసం ఉద్యోగాన్ని వదులుకునే ఆలోచన నాకిక కలవరపెట్టడం లేదు. అంతగా నన్ను కదిలించింది ఈ సినిమా' - అని రే ఒక ఉపన్యాసంలో చెబుతారు. రే ఆ సినిమాను 25 సార్లు చూశారు. 'అవర్‌ ఫిల్మ్స్‌ - దెయిర్‌ ఫిల్మ్స్‌' (మన సినిమాలు - వారి సినిమాలు) పుస్తకంలో దీని గురించి వివరించారు. 'పొథేర్‌ పాచాలి' సినిమా నిర్మించాల్సిందే అనే కృతనిశ్చయంతో కోల్‌కతాకు తిరిగి వస్తాడు రే.

 

సృజనకు మరో పేరు.. సత్యజిత్‌ రే..



                                                     రహదారిలో కఠిన సినీ ప్రయాణం

'పొథేర్‌ పాచాలి' అంటే 'రహదారి వినిపించే గేయకావ్యం'.. 1929లో విడుదలై, అప్పటికే బెంగాల్లో క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న నవల. ఇందులో 300 పాత్రలున్నాయి. కానీ రే ముఖ్యమైన 30 పాత్రల్ని తీసుకుని, నవల ఆత్మ దెబ్బతినకుండా సినిమాకు తగ్గట్టు స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. నటీనటుల ఎంపిక చాలామటుకు పూర్తయ్యింది. ముఖ్యమైన నటీనటులను రంగస్థలం నుంచే తీసుకున్నారు. మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లు లేదా కొద్దిపాటి అనుభవమున్న వాళ్లే. ఉద్యోగాలు చేస్తూ వారాంతాల్లో షూటింగ్‌ చేయాలనుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా షూటింగు మూడేళ్ల పాటు సాగింది. రూ.8 వేల బ్యాంకు బ్యాలెన్సుతో షూటింగు మొదలు పెట్టారు. భార్య నగలూ, అరుదైన రికార్డులూ అమ్మేశారు. ప్రముఖుల పరిచయాలతో నిధులు సేకరించారు. మామ సుబిమల్‌ రే ప్రావిడెంట్‌ ఫండ్‌ కూడా వాడేశారు. అయినా చాలలేదు. చివరికి పశ్చిమ బంగా ముఖ్యమంత్రి బిదాన్‌ చంద్రరేను ఆశ్రయించారు. ఆయన మొదట్లో పెద్ద ఆసక్తి చూపకపోయినా, ఆ తర్వాత ఒప్పుకుని, 'రహదారి కథ' కనుక 'రోడ్డు రవాణా శాఖ' నుండి ధన సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయ్యింది. విడుదల కాగానే ప్రపంచ సినిమాలో తన స్థానాన్ని ప్రతిష్టించుకుంది. 1955 కాన్స్‌లో 'ఉత్తమ హ్యూమన్‌ డాక్యుమెంట్‌' అవార్డు అందుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక రే తన ఉద్యోగం వదిలేశాడు.

                                                                అపూ త్రయం

'పొథేర్‌ పాచాలీ' (1955), 'అపొరాజితో' (1956), 'అపూర్‌ సొంసార్‌' (1959) - ఈ మూడు సినిమాల్నీ కలిపి 'అపూ ట్రిలాజీ' (అపూ త్రయం) అంటారు. 'పొథేర్‌ పాచాలీ' బెంగాలు గ్రామంలోని పేద బ్రాహ్మణ పరివారం కథ. భర్త హరిహర్‌, భార్య సర్బజయా, పిల్లలు దుర్గ, అపూలతో చాలీచాలని బతుకులపై చిత్రించాడు. 'అపొరాజితో' బనారస్‌లో జీవించే తల్లీ, కొడుకుల అనుబంధం, వారి మధ్య సంఘర్షణ ఇందులో ప్రధాన ఇతివృత్తం. 'అపరాజితో' అంటే 'అపజయం లేని' అని అర్థం. ఈ జీవశక్తే అపూ త్రయానికి చోదకశక్తి. అపూర్‌ సొంసార్‌ మూడో భాగం తీయాలని సత్యజిత్‌ రే మొదట్లో అనుకోలేదు. ఈలోగా 'పారొస్‌ పాథొర్‌' (1957), 'జల్సాఘర్‌' (1958) అనే సినిమాలు తీశాడు. కానీ ఒక విదేశీ పాత్రికేయుడికి ఇచ్చిన జవాబు కారణంగా మూడో భాగం తీశాడు. ఇందులో అపూ వైవాహిక జీవితం, దాని ఒడిదుడుకులూ చూపించారు. ఈ సినిమాలపై ఎందరో సినీ విమర్శకులు ఎన్నో విశ్లేషణలు ఇప్పటికీ చేస్తున్నారు. ప్రపంచంలోని సినిమా బోధనా సంస్థల్లో వీటిపై అధ్యయన పాఠాలు నడుస్తూనే వున్నాయి.

 

సృజనకు మరో పేరు.. సత్యజిత్‌ రే..



                                                                     ఆఖరి చిత్రాలు

స్వదేశీ ఉద్యమ నేపథ్యంలో ఒక స్వదేశీ నాయకుడి ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ 1983లో 'ఘరే బాయిరే' తీశాడు. ఆ షూటింగు జరుగుతుండగా సత్యజిత్‌కి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. 1987లో కొంత కోలుకున్నాక, ఇండోర్‌కే పరిమితమౌతూ, ఔట్‌డోర్‌ షూటింగుల కోసం కుమారుడు సందీప్‌పై ఆధారపడుతూ మరణించేలోగా మరో మూడు సినిమాలు తీశాడు. అందులో మొదటిది 'ఇబ్సన్‌' నాటకం ఆధారంగా తీసిన 'గణశత్రు' (ప్రజా శత్రువు) (1989). మతతత్వం పెచ్చరిల్లుతున్న ఈ కాలంలో, కరోనా కాలంలో కుంభమేళాలు చేసిన నేపథ్యంపై ఈ సినిమా ఆవశ్యకత చాలా ఉంది. ఒక ఊరి పేరైనా మందిరంలో ఇస్తున్న చరణామృతం కారణంగా ఆ ఊరిలో తీవ్రమైన వ్యాధి ప్రబలుతోందని ఆ ఊరి ప్రభుత్వాస్పత్రి డాక్టరు నిర్ధారిస్తాడు. 'దేవుడిని నమ్మనివాడు మందిరానికి వ్యతిరేకంగా పుకార్లు పుట్టిస్తున్నాడ'ని అతడిని ప్రజాశత్రువుగా ముద్రవేస్తారు ఆ ఊరి స్వార్థపరులు. 'ఇది వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన సమస్య కాదు, ప్రజారోగ్య సమస్య' అని మొత్తుకున్నా వినేవారుండరు. చివరికి వామపక్ష పార్టీ కార్యకర్తలు దీనికో పరిష్కారాన్ని కనుగొంటారు. 1990లో విడుదలైన చిత్రం 'శాఖా ప్రోశాఖా' (శాఖోపశాఖలు). ఈ సినిమాలో జీవితాంతం నిజాయితీతో బతికిన ఒక వృద్ధుడికి తన ముగ్గురు కుమారులూ అవినీతిలో మునిగారని తెలుస్తుంది. చివరికి మతిస్థిమితం లేని తన నాల్గో కొడుకు సాంగత్యంలోనే సేద తీరుతాడు. ఈ నాల్గో కుమారుడి పాత్ర వేసింది రే మెచ్చే సౌమిత్ర చటర్జీనే. సౌమిత్ర 14 సత్యజిత్‌ సినిమాల్లో నటించాడు. 1991లో వచ్చిన రే ఆఖరు చిత్రం 'ఆగంతుక్‌' (అపరిచితుడు). ఉత్పల్‌ దత్త్‌ ప్రధానపాత్రలో కనిపిస్తాడు. కోల్‌కతాలోని అనిలా ఇంటికి తన దూరపు చుట్టమైన మామయ్య ఒకాయన ఓ రోజు హఠాత్తుగా ఊడిపడతాడు. తనో అంత్రోపాలజిస్టుననీ, దేశ విదేశాల్లోని నాగరికతలను పరిశీలించి వచ్చాననీ, ఎన్నో రకాల తెగలవారితో గడిపాననీ చెబుతాడు. అనిల అతనితో మర్యాదగా మసలుకున్నా, ఆమె భర్తతో పాటు అందరూ వచ్చినాయన్ని శంకిస్తారు. మానవసభ్యత, నాగరికతలపై చాలా బలమైన చర్చలు ఈ చిత్రంలో ఉన్నాయి. సత్యజిత్‌ రే తన జీవిత తాత్విక సారాన్నంతా ఇందులో రంగరించాడు. 'దర్శక మహాశయుడు తన జ్ఞాన పరిపక్వతతో నేర్చుకున్న ఉత్తమ సంగతులన్నీ చూపించాడు' అని కొనియాడాడు సినీ విమర్శకుడు హాల్‌ హిన్సన్‌.

                                                               విద్యాభ్యాసం

సత్యజిత్‌ మొదట బాలీగంజ్‌ హైస్కూల్లో చదువుకున్నాడు. కళాశాలలో రెండేళ్లు సైన్స్‌ చదివినా '(త్రికోణమితి) సైనులూ, కొసైనులూ ఇబ్బంది పెట్టేవి. ఫిజిక్సూ, కెమిస్ట్రీ నచ్చేవికావు' అని చెప్పుకున్నాడు. తన తండ్రి స్నేహితుడైన ప్రశాంతచంద్ర మహాలనోబిస్‌ సలహా మేరకు ప్రెసిడెన్సీ కాలేజీలో రెండేళ్లు ఎకనామిక్స్‌ చదివాడు. కానీ, అతడి ధ్యాసంతా చిత్రకళ మీదనే. చిన్నప్పటి నుంచే సినిమా అన్నా, సంగీతమన్నా మక్కువ. హాలీవుడ్‌ నటీనటుల బొమ్మలు కత్తిరించి, దాచుకునేవాడు. కాలేజీ టైంలో నటుల మీద ఇష్టం దర్శకుల మీదకి మళ్లింది. తల్లి ప్రోద్బలంతో 1940లో రవీంద్రుడు శాంతినికేతన్‌లో నెలకొల్పిన విశ్వభారతీ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ నందలాల్‌ బోస్‌, వినోద్‌ విహారీ ముఖర్జీ లాంటి ప్రఖ్యాత చిత్రకారుల నుండి చాలా విషయాలు నేర్చుకున్నాడు. 1972లో గురువు, అంధ చిత్రకారుడు వినోద్‌ విహారీ ముఖర్జీపై 'ది ఇన్నర్‌ ఐ' (అంతర్‌ దృష్టి) అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. ఆ రోజుల్లోనే ముగ్గురు మిత్రులతో కలిసి అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటాలను సందర్శించి, భారతీయ చిత్ర, శిల్ప కళల గురించి అవగాహన చేసుకున్నాడు. ఈ సంగతులు అతడికి కమర్షియల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ రంగంలో చాలా ఉపకరించాయి. శాంతినికేతన్‌లో ఉన్న కారణంగా సినిమాలు చూడలేకపోయినా అక్కడి గ్రంథాలయంలో సినిమా క్రాఫ్టుకు సంబంధించిన 'ఫిల్మ్‌ టిల్‌ నౌ' (పాల్‌ రోథా), 'గ్రామర్‌ ఆఫ్‌ ది ఫిల్మ్‌' (రేమండ్‌ స్పాటిస్‌వుడ్‌) లాంటి పుస్తకాలు చదివేవాడు.

                                                    వైవిధ్యమైన అంశాలతో సినిమాలు

రే మొత్తం 30 సినిమాలు తీశాడు. వాటిలో గ్రామీణులూ, మధ్యతరగతి జనాలు, మేధావులూ, జమీందార్లూ, రాజులూ, డిటెక్టివ్‌ల గురించి వివిధ ఇతివృత్తాలతో కథలున్నాయి. ఏదీ మరొక దానికి నకలు కాదు. వస్తువులోనూ, కథన విధానంలోనూ దేనికదే ప్రత్యేకం. ఆ సినిమాలన్నీ జీవితాన్ని స్పష్టంగా ప్రతిఫలించేవే! 37 ఏళ్ల తన కేరీర్‌లో ఒక శతాబ్దకాలపు చారిత్రక మార్పుల్ని అతడు తన సినిమాల్లో రికార్డు చేశాడు. ప్రేమ్‌చంద్‌ కథ ఆధారంగా వచ్చిన 'షతరంజ్‌ కే ఖిలాడీ' (1977) ఈస్టిండియా కంపెనీ దూసుకొస్తుంటే చదరంగం ఆటల్లో తలమునకలైన మొఘల్‌ రాజులను చూపుతుంది. జమీందారీ వ్యవస్థ పతనమౌతుంటే తన పాత రాజసాన్ని వదులుకోలేక, కొత్త ధనాఢ్యుల పొగరును జీర్ణించుకోలేని ఒక జమీందారు బాధను చూపుతుంది 'జల్సాఘర్‌' (1958). ఆధునిక భారతంలో పేద బ్రాహ్మణ కుటుంబపు ఈతి బాధల్ని 'అపూత్రయం' చూపగా, మూఢనమ్మకాలతో కోడల్ని అమ్మవారుగా మార్చేస్తుంటే, ఆధునిక హేతువాద భావాలతో దాన్ని ఎదిరించేవాళ్లు తయారౌతున్న వైనాన్ని 'దేవి' (1960) సినిమా దర్శింపజేస్తుంది. 'చారులత', 'మహానగర్‌' (1963) సినిమాల్లో స్త్రీల విముక్తిని చిత్రిస్తే, 'ప్రతిద్వంది' (1970)లో నిరుద్యోగ సమస్యను వర్ణిస్తుంది. క్రమంగా దిగజారుతున్న లంచగొండి సమాజంలో మధ్యతరగతి నైతిక పతనాన్ని 'జనారణ్య' (1975) సాక్షాత్కరింపజేస్తుంది. 'ప్రతిద్వంది' - 'సీమాబద్ధ' (1971) - 'జనారణ్య' సినిమాలను కలిపి సత్యజిత్‌ రే 'కలకత్తా త్రయం' అని అంటారు. (మృణాల్‌ సేన్‌ 'కలకత్తా త్రయం' వేరే ఉంది.) 'గోపీ గాయిన్‌ - బాగా బాయిన్‌' (1968) సంగీతం, హాస్య రసాలతో ఆబాలగోపాలన్ని అలరించింది. ఇవే క్యారెక్టర్లతో ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీపై చురకలా పరోక్ష విమర్శతో 'హిరక్‌ రాజార్‌ దేశే' (హిరక్‌ రాజు దేశంలో) (1980) సినిమా వచ్చింది. ఇరవై లక్షల మందిని పొట్టన పెట్టుకున్న బెంగాల్‌ క్షామం మానవుల్ని ఎంత దయనీయ స్థితిలోకి నెడుతుందో చూపుతుంది 'ఆశని సంకేత్‌' (1973).సత్యజిత్‌ రే సినిమాల్లో అతడికి వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమా 'చారులత'. రవీంద్రుని 'నష్టనీర్‌' (చెడిన గూడు) కథ ఆధారంగా తీశాడు. ఈ చిత్రంలో 'సున్నితత్వం, సరళత్వాల దోబూచులాట అద్భుతంగా వుంది' అంటూ ఈ సినిమాకు కితాబునిచ్చింది రే మెచ్చే సినిమా పత్రిక 'సైట్‌ అండ్‌ సౌండ్‌' సంపాదకురాలు పినలోప్‌ హోస్టన్‌.

 

సృజనకు మరో పేరు.. సత్యజిత్‌ రే..



                                             డాక్యు మెంటరీలూ - లఘు చిత్రాలూ - ఇతరాలూ

రే నిర్మించిన డాక్యుమెంటరీల్లో ముఖ్యమైనవి - విశ్వకవిపై 'రవీంద్రనాథ్‌ ఠాకూర్‌' (1961), చిత్రకారుడు బినోద్‌ బిహారీ ముఖర్జీపై 'ది ఇన్నర్‌ ఐ' (1972), తన తండ్రి జీవితంపై 'సుకుమార్‌ రే' (1987), భరతనాట్యం నర్తకి బాలసరస్వతిపై 'బాల' (1976). సిక్కిం మనదేశంలో అంతర్భాగం కాకమునుపు అక్కడి రాజు ధన సహాయంతో 'సిక్కిం' (1971) డాక్యుమెంటరీని నిర్మించాడు రే. కానీ, ఇందులో సిక్కిం పేదరికాన్ని చూపారంటూ దీనిపై చాలా ఏళ్లు నిషేధం విధించారు. చివరికి 2010లో కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ డాక్యుమెంటరీని చూసే అవకాశం దొరికింది. 1964లో 'టూ' అనే లఘుచిత్రం పేద, ధనిక పిల్లల్లో ఎవరు గొప్ప అనే విషయాన్ని చర్చిస్తుంది. అంతకు ముందు ఠాగూర్‌ కథలతో తీసిన 'తీన్‌ కన్యా' (1961) కూడా మూడు లఘుకథల సమాహారమే. 1980లో 'పికూ' అనే మరో లఘు సినిమా నిర్మించాడు రే. బెంగాల్‌ సూపర్‌స్టార్‌ ఉత్తమ్‌కుమార్‌తో రెండు సినిమాలు తీశాడు. అందులో ఒకటి ఒక సూపర్‌స్టార్‌తో ఒక విలేకరి సంవాదంగా వచ్చిన 'నాయక్‌' (హీరో) (1966). మాట్నీ హీరోల మిరుమిట్లు గొలిపే జీవితంలోని డొల్లతనాన్ని ఎండగడుతుంది ఈ సినిమా. రెండోది శరదిందు బంధోపాధ్యాయ డిటెక్టివ్‌ బ్యోమ్‌కేశ్‌ బక్షీ పాత్రతో అపరాధ పరిశోధక కథ 'చిడియాఖానా' (జూ) (1967). సత్యజిత్‌ రే మొదట్లో తన సినిమాలకు పండిత్‌ రవిశంకర్‌ తదితరులతో సంగీతం చేయించేవాడు. కానీ తర్వాతి సినిమాల్లో తనే సంగీత దర్శకుడిగా మారాడు. తన సినిమాలకే కాక ఇతరుల సినిమాలకూ స్క్రిప్టు రాయడం, సంగీతం అందివ్వడం చేశాడు రే.

 

సృజనకు మరో పేరు.. సత్యజిత్‌ రే..


                                                                  సాహిత్య సేవ

సత్యజిత్‌ రే తన తాతయ్య 1961లో ప్రారంభించిన 'సందేశ్‌' పత్రికను పునరుద్ధరించాడు. 'సందేశ్‌' అనే పదానికి 'సందేశం' (మెసేజ్‌) అనీ, 'బెంగాల్లో దొరికే ఒక మిఠాయి' అనీ రెండర్థాలు ఉన్నాయి. ఈ రెండర్థాలకూ న్యాయం చేస్తూ రే విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా ఉండే రచనలు పిల్లల కోసం రాసేవాడు. వేరే పత్రికలకూ రాస్తూ కొన్ని రూకలు పారితోషికంగా సంపాదించేవాడు. అపరాధ పరిశోధక నవలలు రాసినా, వాటిలో పిల్లలకు తగ్గట్టు శృంగారం గానీ, అతి హింస గానీ లేకుండా జాగ్రత్త పడేవాడు. షెర్లాక్‌ హోమ్స్‌ ప్రేరణతో సృష్టించిన డిటెక్టివ్‌ ఫెలూదా కథల కోసం పిల్లలు చెవి కోసుకుంటారు. పుస్తక ప్రదర్శనల్లో ఫెలూదా కథలు బాగా అమ్ముడు పోతుంటాయి.

 

సృజనకు మరో పేరు.. సత్యజిత్‌ రే..



సత్యజిత్‌ రేని వర్ణించడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే చిన్నమాట సరిపోదు. తను పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వదిలాడు రే. వ్యక్తిగతంగానూ, వివిధ సినిమాలకూ, పుస్తకాలకుగానూ అతడు లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు. సత్యజిత్‌ సినిమాలు చాలా స్లోగా ఉంటాయనే వారు సినిమా గ్రామర్‌ గురించి తెలీనివారైనా అవ్వాలి లేదా సినిమాను ఒక సర్కస్‌గా మార్చిన వారైనా అయ్యుండాలి. రే భారత దేశపు పేదరికాన్ని విదేశాలకు అమ్మాడని ప్రఖ్యాత నటి నర్గిస్‌ ఓసారి విమర్శించారు. కానీ 'తమరి 'మదర్‌ ఇండియా' భారతదేశ ఐశ్వర్యం చూపిందా?' అంటూ ఉత్పల్‌ దత్తా చాలా ఘాటుగానే విమర్శించాడు. ఆనారోగ్యంతో ఉన్నా, చనిపోయే మునుపటి సంవత్సరం వరకూ రే చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నాడు. 1992లో ఆస్పత్రి బెడ్డు నుండి అకాడెమీ/ ఆస్కారు జీవనసాఫల్య గౌరవ పురస్కారం అందుకున్నాడు. సాటిలైట్‌ టెలివిజన్‌ ద్వారా ఆస్కారు అవార్డుల సభను సంబోధించాడు. 'చలన చిత్రాల కళపై అతని అరుదైన పాండిత్యానికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు, ప్రేక్షకులపై చెరగని ప్రభావాన్ని చూపిన అతని లోతైన మానవతా దృక్పథానికీ గుర్తింపుగా' ఈ గౌరవం ఇస్తున్నట్టు అకాడమీ అవార్డు కమిటీ తన సైటేషన్లో పేర్కొంది.

బాలాజీ (కల్‌కతా)
9007755403