Sep 03,2023 18:19

విద్యార్థుల అభ్యున్నతికి కృషి
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన
బొబ్బిలి రాజమౌళి కోటేశ్వరస్వామి
ప్రజాశక్తి - కాళ్ల

             మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వినూత్నంగా బోధన చేస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు బోధనను కేవలం పాఠశాల గదులకే పరిమితం చేయకుండా... ఉపకరణాలు.. వివిధ రీతులను మేళవించి చేయడంతో భావి పౌరులకు మేలు జరుగుతుంది. సృష్టిలో పనికిరాని వస్తువులతో అందమైన ఆకృతుల్లో బోధనోపకరణాలను తక్కువ ఖర్చుతో తయారు చేసి పిల్లలకు సులువుగా పాఠాలు బోధించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో అందరి ప్రశంసలు పొందడమే కాదు. అవార్డులు కూడా అందుకుని ఉంటారు. బొబ్బిలి రాజమౌళి కోటేశ్వర స్వామి మాస్టారు 2002లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. భీమవరం మండలంలో వెంకటతిప్ప ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి అక్కడ మూడేళ్లు పని చేశారు. ఆ తర్వాత భీమవరంలో ఎల్‌విఎన్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేశారు. ప్రస్తుతం సీసలి గ్రామంలోని స్పెషల్‌ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుంచి టిఎల్‌ఎం తయారీలో మంచి ప్రతిభ కనపర్చి 2015లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన అవార్డులను అందుకున్నారు. ఫౌండేషనల్‌ లీట్రసీ, నుమేరసీపై మూడురోజుల రాష్ట్రస్థాయి శి క్షణా కా ర్యక్రమం గతే డాది సె ప్టెంబర్‌ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎస్‌సిఇ ఆర్‌టి ఆధ్వర్యంలో ఎన్‌సిఇఆర్‌టి ప్రొఫెసర్లచే విజయవాడ అలంకార్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొబ్బరిచిప్పలు, కార్డ్‌ బోర్డ్‌తో వీణను తయారుచేశారు. ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి, ఎన్‌సిఇఆర్‌టి హె చ్‌ఒడి అనూప్‌ కుమార్‌రాజ్‌పుట్‌లు స్వామి మాస్టర్‌ని అభినందించారు.
స్వామి మాస్టర్‌ తయారుచేసిన బోధనోపకరణాలు
            దసరా సెలవులను ఉపయోగించుకుని చక్కని మోడల్స్‌, టిఎల్‌ఎం తయారు చేశారు. ఖాళీ అట్టపెట్టెలు, పాత వార్తాపత్రికలు, కార్డ్‌ బోర్డులను ఉపయోగించి పిల్లలకు ఉపయోగపడే లో కాస్ట్‌, నో కాస్ట్‌ టిఎల్‌ఎం తయారుచేశారు. సెలవులో కూడా పాఠశాలకు వెళ్లి నాడు-నేడు పనులను చేయిస్తూ, మరోపక్క తమ విద్యార్థులకు పాఠ్య బోధనలోఉపయోగపడే టిఎల్‌ఎం తయారుచేశారు. టిఎల్‌ఎం తయారీలో స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌గా అనేక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర స్థాయి టిఎల్‌ఎం మాడ్యూల్స్‌ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. కార్డ్‌ బోర్డ్‌తో చేసిన కదిలే రథం. గడియారంలో టైం చెప్పడంతో పాటు ఈ సమయానికి ఏం చేయాలో పిల్లలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఖాళీ అట్టపెట్టె , కార్డ్‌ బోర్డ్‌తో తయారు చేసిన పల్లకి, కార్డ్‌ బోర్డ్‌, పాత పేపర్లతో కుతుబ్‌ మీనార్‌, కార్డ్‌బోర్డ్‌తో లైట్‌ హౌస్‌, శాటిలైట్‌ మోడల్‌లను స్వామి మాస్టర్‌ స్వయంగా తయారు చేశారు. విద్యాబోధనలో వీటిని తరచూ ఉపయోగిస్తూ విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.
కృషి అమోఘం..
           బొబ్బిలి రాజమౌళి కోటేశ్వరస్వామి 2023 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నిక కావడానికి ఆయన చేసిన కృషి అమోఘం. దాతల సహకారంతో తాను పనిచేసిన ప్రతి పాఠశాలను అభివద్ధి చేయడంతో పాటు విద్యాసామగ్రి అందించారు. నాడు-నేడులో నోడల్‌ టీచర్‌గా పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దించారు. దాతల సహకారంతో పాఠశాల గోడలపై చక్కని బొమ్మలు వేయించారు. పిల్లల్లో ఆశించిన సామర్థ్యాలను సాధించడానికి లో కాస్ట్‌, నో కాస్ట్‌ మెటీరియల్‌ తయారుచేశారు. క్రీడల్లో పిల్లలు చక్కని ప్రతిభ కనపరచేటట్లు, చేయడం, వారు మండల స్థాయి పోటీల్లో బహుమతులు పొందడం వీరి కృషికి తార్కాణం. పాఠశాల వార్షికోత్సవాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో దాగి ఉన్న కళలను వెలికి తీయడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించారు. దాతల సాయంతోనే కాకుండా తను వ్యక్తిగతంగా కూడా కంచాలు, దేశ నాయకుల చిత్రపటాలు, కుర్చీలు అందించారు. అంతేకాక జిల్లా, రాష్ట్ర స్థాయిలో రిసోర్స్‌పర్సన్‌గా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, మాడ్యూల్స్‌ తయారీలో భాగస్వామిగా ఉండడం, ఇ కంటెంట్‌ తయారు చేయడం వంటి అంశాల్లో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ నెల ఐదో తేదీన విశాఖపట్నంలోని ఎయు కాన్వొకేషన్‌ హాలులో నిర్వహించే గురుపూజోత్సవ అధికారిక కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అందించనున్నారు.
అవార్డు రావడం ఆనందంగా ఉంది
బొబ్బిలి రాజమౌళి కోటేశ్వర స్వామి,
సీసలి స్పెషల్‌ ప్రాథమిక పాఠశాల

                రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఆనందంగా ఉంది. తాను నేర్పించిన ప్రతి పదం, దానికి సంబంధించిన చిత్రాలు, బొమ్మలను విద్యార్థులు ఎంతో చక్కగా గుర్తిస్తూ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆడియో, వీడియోల ద్వారా పాఠాలు త్వరితంగా అర్థమవుతాయి. టీవీ, వస్తువుల ద్వారా పాఠాలు బోధించే సమయంలో విద్యార్థులంతా ఆసక్తిగా వింటున్నారు. ఆట, పాటల ద్వారా విద్యాబోధన చేపడుతున్నాం.