
ప్రజాశక్తి - దేవరపల్లి విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకే బాలోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైతు నాయకులు ఉండవల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక ఎంపిపి పాఠశాలలో శనివారం మండల రెండో బాలోత్సవం గోడపత్రికను వ్యవసాయ శాఖ విశ్రాంత ఎడి కేశిరాజు సీతారామయ్య, బాలోత్సవ గౌరవ సలహాదారుడు నారాయణ విశ్వేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతమైన దేవరపల్లిలో బాలోత్సవం నిర్వహించటం కష్టమైన బాలల బంగారు భవిత కోసం తప్పడం లేదన్నారు. అందుకు ప్రతీ ఒక్కరూ చేయి చేయి కలిపి జయప్రదం చేయాలన్నారు. మండల బాలోత్సవ అధ్యక్షులు బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని, విద్యార్థుల్లోని సజనాత్మకతను, జ్ఞాన తృష్ణను ప్రోత్సహించేందుకు బాలోత్సవం ఒక వేదిక అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా యుటిఎఫ్ గౌరవ అధ్యక్షుడు యు.శంకరుడు, బాలోత్సవ వర్కింగ్ కమిటీ సభ్యులు ఆచంట సుభాష్ చంద్రబోస్, నలమాటి రామారావు, మండల యూటిఎఫ్ సభ్యులు బి. నాగేంద్ర ప్రసాద్, కెపి. బిందు, డి. రమాజానికి, కె. ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.