ఈ సెప్టెంబరు 25 నాటికి కామ్రేడ్ ప్రభాకర్ సాంజ్‌గిరి జన్మించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1921 సెప్టెంబర్ 25న జన్మించిన ఆయన 2009 మార్చి తొమ్మిదిన కన్నుమూశారు. ఆయన మరణంతో మహారాష్ట్ర వామపక్ష ఉద్యమం, కార్మికోద్యమం, సి.పి.ఐ. (ఎం) ఒక గొప్ప అసాధారణ నేతను కోల్పోయింది. 1941లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన సాంజ్‌గిరి తన 87 సంవత్సరాల జీవితంలో 68 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంలో అకుంఠిత దీక్షతో పని చేశారు.
ఈ కాలంలో ఆయన మహారాష్ట్ర రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా, పార్టీ వారపత్రిక జీవన్‌మార్గ్ సంపాదకుడిగా, శాసనసభ సభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, సృజనాత్మక మార్క్సిస్టు మేధావిగా వివిధ బాధ్యతలను నిర్వహించారు. జీవితాంతం ఆయన మార్క్సిజం-లెనినిజం పట్ల అచంచల విశ్వాసంతో వ్యవహరించారు.
విలువైన సైద్ధాంతిక కృషి
''అణువు అంతరంగం'', ''మనిషి కథ'', ''అంబేద్కర్‌ామార్క్సిస్టు పరిశీలన'' ''చార్వాకుల నుండి మార్క్స్ దాకా'' వంటి ఆయన గ్రంథాలు కేవలం మరాఠీ భాషలోనే గాక దేశంలో పలు ఇతర భాషల్లో సైతం అనువదించబడ్డాయి. మార్క్సిస్టు దృక్కోణం నుంచి తానెంచుకున్న విషయాలను సాంజ్‌గిరి విశ్లేషించి రచించిన ఆ గ్రంథాలు భావి తరాలకు సైతం ఉపయుక్తంగా ఉంటాయి.
1989 నుండి 2009 వరకూ ఆయన 'జీవన్ మార్గ్' సంపాదకుడిగా ఉంటూ రాసిన వ్యాసాలు, వర్తమాన పరిణామాల విశ్లేషణలు, సంపాదకీయాలు చాలా ప్రాచుర్యం పొందాయి. సరళమైన ఆయన శైలి, ఘాటైన వ్యాఖ్యలు పాఠకులను ఆకట్టుకున్నాయి. సోవియట్ సోషలిస్టు వ్యవస్థ పతనం అనంతరం మార్క్సిస్టు సిద్ధాంతం మీద, సోషలిస్టు భావనల మీద జరిగిన తీవ్రమైన దాడిని సమర్ధవంతంగా తన రచనల ద్వారా సాంజ్‌గిరి తిప్పికొట్టారు. ఈ కాలంలో దేశంలో అమలు లోకి వచ్చిన సరళీకరణ విధానాలను, హిందూత్వ దాడిని పలు రచనలద్వారా ఎండగట్టారు. మహారాష్ట్ర లోని కుల వ్యవస్థను, సామాజిక సమస్యలను లోతుగా వివరిస్తూ, బి.టి రణదివే, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్‌ల రచనలకు తన అవగాహనను కూడా జోడించి పలు రచనలు చేశారు. మహారాష్ట్ర లోని చారిత్రిక వ్యక్తులైన ఛత్రపతి శివాజీ, జ్యోతిరావు ఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ తదితరుల చరిత్రలను మార్క్సిస్టు దృక్పథంతో వివరించారు.
కమ్యూనిస్టు పార్టీ నేతగా...
ఎ.ఐ.ఎస్.ఎఫ్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సాంజ్‌గిరి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గన్నారు. బ్రిటిష్ వారి లాఠీఛార్జిలను ఎదుర్కొన్నారు. తెలివైన విద్యార్ధిగా ఉండిన సాంజ్‌గిరి తన ఎం.ఎస్‌సి చదువు పూర్తి కాగానే పార్టీకి పూర్తికాలం పనిచేయడానికి సిద్ధపడ్డారు. ముంబాయి జౌళి కార్మికుల పోరాటాల్లో, సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో (ఆనాటికి సాంజ్‌గిరి అవిభక్త కమ్యూనిస్టు పార్టీ ముంబాయి కార్యదర్శి), గోవా విమోచన పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. రివిజనిజానికి వ్యతిరేకంగా జరిగిన పార్టీ ఆంతరంగిక పోరాటంలో గట్టిగా నిలబడ్డారు. 1962-66 మధ్య జైలు నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. శివసేన ప్రాంతీయ విద్వేష రాజకీయాలను గట్టిగా ప్రతిఘటించారు. ఆ తర్వాత సిఐటియు నిర్మాణంలో, కార్మిక, కర్షక పోరాటాల్లో ముఖ్యభూమిక పోషించారు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటంలో, మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి బాబా సాహెబ్ పేరు పెట్టాలన్న డిమాండ్ పై సాగిన ఉద్యమంలో సాంజ్‌గిరి పాత్ర విలువైనది. చట్టసభల్లో కరువు, భూసమస్య వంటి అంశాలపై మంచి కృషి చేశారు.ఎన్రాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉమ్మడి పోరాటంలోను, రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతను నిర్మించడంలో ముందున్నారు.
ఎస్.వై.కొల్హాట్కర్, ఆ తర్వాత అహల్యా రంగేకర్ మహారాష్ట్రలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులుగా పని చేశారు. ఆతర్వాత1986 నుండి 2005 వరకూ కా|| ప్రభాకర్ సాంజ్‌గిరి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. కార్యకర్తలను గుర్తించి తర్ఫీదు చేయడంలో, సైద్ధాంతిక శిక్షణ గరపడంలో సాంజ్‌గిరి మంచి కృషి చేశారు.
సిఐటియు భందప్ కేంద్రాన్ని (ముంబై కార్మిక సంఘం) నిర్మించడం, రైతుల, వ్యవసాయ కార్మికుల ఉద్యమానికి దిశా నిర్దేశం చేయడం, రైతాంగ ఉద్యమాలకు కార్మిక వర్గం నుండి ప్రతీ ఏడూ పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించే ఒరవడిని ప్రారంభించడం వంటివి సాంజ్‌గిరి నిర్మాణ కృషిలో ముఖ్య భాగాలు.
నిరాడంబర జీవితం, సమరశీలత, లోతైన అధ్యయనం, కార్యకర్తల ఎడల అమిత శ్రద్ధ కా.సాంజ్‌గిరి నుండి నేర్చుకోవాలి. జీవితపు ఆఖరు సంవత్సరాల్లో తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా తట్టుకుని నిలిచారే తప్ప ఏనాడూ ఎవరికీ తన ఇబ్బందుల గురించి చెప్పుకోలేదు. జీవితాంతం ఆయనకు తోడుగా సతీమణి సుమన్ సాంజ్‌గిరి నిలిచారు. ప్రభాకర్ సాంజ్‌గిరి శత జయంతి సంవత్సరం ముగిసిన సందర్భంగా ఆ కామ్రేడ్‌కు జోహార్లు అర్పిస్తున్నాం.
అశోక్ ధావలే
/ కామ్రేడ్ ప్రభాకర్ సాంజ్‌గిరి శత జయంతి సందర్భంగా /
( సంక్షిప్త అనువాదం )










