ప్రజాశక్తి-పాడేరు : పాడేరు ఏజెన్సీలో గిరిజన రైతులు తమ వ్యవసాయ పంటలకు పశువులు, అడవి జంతువుల నుంచి నష్టం వాటిల్లకుండా తమదైన శైలిలో రక్షణ కల్పిస్తుంటారు. మన్యంలోని గిరిజనుల వ్యవసాయ భూములు ఆరుబయలుగా ఉంటాయి. మేత కోసం పశువులు అక్కడే సంచరిస్తుంటాయి కొండకోనల్లోనూ గ్రామాల్లోనూ ఈ పంటచేనులకు భద్రత కరువనే చెప్పాలి. ముఖ్యంగా గిరిజనులు తమ వ్యవసాయ పశువులను ఈ ఆరుబయలు పంట పొలాల్లోనే పచ్చిక మేపడం అలవాటు. దీంతో గ్రామ పరిసరాల్లో ఉండే పంట పొలాలకు పశువుల వల్ల అటవీ ప్రాంతంలో ఉండే పంటచేలకు అడవి జంతువుల వల్ల ముప్పు ఎదురవుతుంటుంది దీనికి గిరిజనులు తమదైన శైలిలో రక్షణ కల్పిస్తుంటారు. ఇందులో భాగంగా పాడేరు విశాఖట్నం వెళ్ళే దారిలో డైమండ్ పార్క్ వద్ద , వరి చేనుకు కంచె కట్టి దానిచుట్టూ చీరలు కట్టిన దృశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది. పచ్చని పంట పొలాలను రంగు రంగుల చీరలతో సింగారించినట్లుగా ఉంది . పచ్చగా ఎదుగుతున్న పంట పైరగాలికి ఆ చీరలు ఊగుతూ అడవిలో ఆ పచ్చని పొలం ఉన్న ప్రాంతాన్ని శోభాయమానం చేస్తున్నాయి. . వీటికి తోడు రాత్రి పూట జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను పాడు చేయకుండా ఉండడం కోసం ఇలా చీరలతో ఆ చేనుకు రక్షణ కల్పించిన దృశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది. ఆ పంట పొలాలకు చీరలే రక్షణ కవచాలయ్యాయి. అటవీ సమీప పొలాల్లో సాగు చేసిన వరి పైరును వన్యప్రాణుల నుంచి రక్షించుకునేందుకు అన్నదాతలు చీరలను వాడుతున్నారు. పంటల చుట్టూ వీటిని కట్టడం వల్ల జంతువులు దూరం నుంచి మనుషులు ఉన్నట్లుగా భ్రమిస్తాయని గిరిజనులు చెబుతున్నారు. వాటిభారీ నుండి పంటలను రక్షించుకోవడానికి ఇలా చీరల అలంకరణ చేశామని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇలా పంటల రక్షణ కోసం గిరిజనులు తమదైన రీతిలో మరెన్నో పద్ధతులు అవలంబిస్తుంటారు. వీటిలో అచ్చం మనుషులను పోలినట్టుగా తయారు చేసే దిష్టిబొమ్మలు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.










