ప్రజాశక్తి -డుంబ్రిగూడ:పంచాయితీల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న 14,15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాల్లో జమ చేయకపోవడంఐ మండలంలోని సర్పంచులు బుధవారం రోడ్డెక్కారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సమావేశ మందిరంలో జరగనున్న మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. మండల ఎంపీపీ బాక ఈశ్వరి అధ్యక్షతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేష్ పర్యవేక్షణలో జరగాల్సిన సర్వసభ్య సమావేశం ప్రారంభ దశలోనే సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరిస్తున్నట్లు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కండ్రూం గ్రామ పంచాయతీ సర్పంచ్ కిముడు హరి, గసభ పంచాయితీ సిపిఎం సర్పంచ్ పి.సునీత, సర్పంచులు తెలిఆరు. మండల సర్పంచులు ఎంపీడీవో నగేష్‌కు వినతిపత్రాన్ని సమర్పించి, కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేకపోవడంతో పంచాయతీ అభివృద్ధి పూర్తిగా కుంటపడిందని, పంచాయతీలో చేపట్టవలసిన మౌలిక, ప్రాధమిక సౌకర్యాలైన తాగు నీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల కల్పన వంటి అభివృద్ధి పనులు చేయలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ కాక పోవడంతో పంచాయతీ సచివాలయాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు ప్రతీ నెలా వేతనాలను కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని వారన్నారు. ప్రజల చేత సర్పంచ్‌లుగా ఎన్నికైన తమకు పంచాయతీ నిధులు లేకపోవడంతో గ్రామాల అబివృద్ధి చేయకుండా ఉత్సవ విగ్రహాలుగా నిలిచిపోయామని సర్పంచులు తెలిపారు. సర్పంచ్‌లకు నిధులు, విధులు, అధిóకారాలు లేకుండా చేయడమనేది రాజ్యాంగ విరుద్ధమని, ఇది తమ ఆత్మ గౌరవాన్ని కాలరాసి నట్టేనని వారన్నారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమా అయ్యేంత వరకు మండల సర్వసభ్య సమావేశాల నిర్వహణ, కార్యక్రమాలకు హాజరయ్యేది లేదని సర్పంచులు తెల్చి చెప్పారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులను తక్షణమే జమ చేయాలని, లేనిపక్షంలో దశలవారీ నిరసన కార్యక్రమాలను చేపట్టక తప్పదని సర్పంచులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పాంగి సునీత, కొములు, రాంమూర్తి, బోయిన, లచ్చు, శారద, పి.సోయిత, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.










