ప్రజాశక్తి- రేగిడి : మండలంలో 39 గ్రామ పంచాయతీలు, 51 రెవెన్యూ గ్రామాలతో పాటు మరో 15 హేబటేషన్ గ్రామాలలో వాహనాల ద్వారా రేషన్ పంపిణీకి సర్వర్ పనిచేయకపోవడంతో ఎండి ఆపరేటర్లు, రేషన్ లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల ఐదు నుంచి శనివారం వరకు సర్వర్ పనిచేయక రేషన్ సరుకులు పంపిణీ కాక పేద ప్రజలు రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు రేషన్ వద్దకు లబ్ధిదారులు వచ్చి క్యూలో ఉన్నప్పటికీ సర్వర్ పనిచేయక రోజులు తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి ఉంది.
మండలంతో పాటు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రేషన్ సరుకులు అమ్మిన ఎండి ఆపరేటర్లు బయోమెట్రిక్‌లు వేసిన లబ్ధిదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ పనిచేయకపోవడంతో బియ్యం పంపిణీ ఆలస్యం అవుతుందని వెల్లడించారు. దీనికి తోడు బియ్యానికి ఒక వేలిముద్ర వేస్తే, పంచదార, పప్పులకు రెండోసారి బయోమెట్రిక్ లబ్ధిదారులు వేయడంతో ప్రతి లబ్ధిదారుల వద్ద ఆలస్యం అవుతుందని, అందుకు రేషన్ పంపిణీ చేయలేకపోతున్నామని వాహనదారులు తోపాటు లబ్ధిదారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి సర్వర్ పనిచేసేందుకు వేరే సిమ్మును ఏర్పాటు చేస్తారని రేషన్ లబ్ధిదారులు, వాహనదారులు కోరుతున్నారు.










