నేడు జగన్ ప్రభుత్వం తమకున్న వాటాల మొత్తాన్ని అమ్మేయాలని నిర్ణయించడం, 2002లో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం కంటే కూడా అనేక విధాలుగా నష్టకరమైనది. ఎలాగంటే, ఇప్పుడు వాటాలమ్మడమంటే ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 1800 ఎకరాలపై శాశ్వతంగా హక్కును కోల్పోవడమే. రెండోది, 30 సంవత్సరాలు, ఆపై మరో 20 సంవత్సరాలు రావలసిన లీజు సొమ్ము, లాభాలలో వాటా కూడా పూర్తిగా కోల్పోవలసిందే. మూడోది, 2002 ఒప్పందం ప్రకారం పోర్టు యాజమాన్యానికి అత్యధికంగా 50 సంవత్సరాల వరకు మాత్రమే ఉన్న హక్కు కాస్తా నేడు శాశ్వతమవుతుంది. ఏ రకంగా చూసినా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం.
ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విశాఖ జిల్లా గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికున్న 10.39 శాతం వాటాను అదాని సంస్థకు అమ్మాలని నిర్ణయించారు. ఈ అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.645 కోట్లు వస్తాయని కూడా అంచనా వేశారు.
గంగవరం పోర్టులో నేడు డివిఎస్ రాజు కుటుంబానికి 58.11 శాతం, లాకెసైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ కు 31.50 శాతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10.39 శాతం వాటాలున్నాయి. మొదటి రెండింటి నుండి వాటాలను అదాని సంస్థ కొనేసింది. నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాలమ్మేస్తే, ఇక మొత్తం నూరు శాతం అదాని పరమవుతుంది. ఇది ఒక క్రమంలో పరిశీలిస్తే, స్టీల్ నిర్వాసితుల భూమి ద్వారా ఒక ప్రవేటు పోర్టు, దాని ద్వారా నేడు ఒక కార్పొరేట్ కంపెనీకి బదిలీ జరుగుతోంది.
గంగవరం పోర్టు నిర్మాణం వెనుక పెద్ద చరిత్రే ఉంది. దేశంలోనే లోతైన ఈ పోర్టును తమ స్వంత నిధులతో నిర్మిస్తామని 1998 లోనే ప్రభుత్వ రంగ విశాఖపట్నం పోర్టు ముందుకు వచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పోర్టుల డిపార్ట్‌మెంటు కూడా ఆమోదించింది. స్టీల్‌ప్లాంట్ ఎగుమతులు, దిగుమతుల అవసరాల కనుగుణంగా ఉంటుంది కాబట్టి తామే నిర్మిస్తామని స్టీల్‌ప్లాంట్ కూడా తెలిపింది. అయితే నాటి చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వమే పిపిపి పద్ధతిలో నిర్మాణం చేబడుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీనికనుగుణంగా డివిఎస్ రాజు కన్సార్టియంకు (గంగవరం పోర్ట్ లిమిటెడ్) రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 2002 లో ఒక ఒప్పందం కుదిరింది. దీని ఆధారంగా మొత్తం భూమిని యాజమాన్యానికి బదలాయించారు. ఈ ప్రైవేటు పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికంగా పెద్ద ఉద్యమమే జరిగింది. 2005 లో నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోలీసు కాల్పులలో ఒక మత్స్య కార్మికుడి ప్రాణాలు బలిగొంది. అనేక మంది ఉద్యమకారులను నెలల తరబడి జైళ్ళలో నిర్బంధించింది.
గంగవరం పోర్టుకు ప్రభుత్వ అధికారిక వివరాల ప్రకారం 2852 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 604.96 ఎకరాల రెవిన్యూ భూమిని రూ.53.73 కోట్లకు కేటాయించింది. కొంత భూమి ప్రైవేటుగా సేకరించబడింది. ఇదికాక స్టీల్‌ప్లాంటు నుండి 1400 ఎకరాల భూమి కేటాయించేలా లేఖ రాసి (26.08.2002) కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఈ 1400 ఎకరాలలో 700 ఎకరాలకు రూ. 20.82 కోట్లను అంటే ఎకరాకు రూ. 2.97 లక్షల చొప్పున పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంటుకు చెల్లించింది. మిగిలిన 700 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం విశాఖ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో భూమిని స్టీల్ ప్లాంటుకు కేటాయించింది. ఇలా స్టీల్ ప్లాంట్ భూమి 1400 ఎకరాలు, ప్రభుత్వ భూమి 273.13 ఎకరాలు, ప్రవేటు యజమానుల నుండి 126.87 ఎకరాల భూమిని సేకరించడం ద్వారా మొత్తం 1800 ఎకరాల భూమిని సమకూర్చుకుని రాష్ట్ర ప్రభుత్వం 10.39 శాతం ఈక్విటీకి గాను గంగవరం పోర్టుకు బదిలీ చేసింది. దీనికనుగుణంగా గంగవరం పోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 17.07.2002 న ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పోర్టు యాజమాన్యానికి 30 సంవత్సరాలకు లీజుకు ఇస్తుంది. ఇరు పక్షాల అప్పటి ఆమోదం మేరకు మరో పదేసి సంవత్సరాల చొప్పున రెండు సార్లు పొడిగించవచ్చు. ఈక్విటీ వాటాకు గాను, పోర్టు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి 30 సంవత్సరాలలో స్థూల ఆదాయంలో 2.1 శాతం చొప్పున చెల్లించాలి. తరువాత దీన్ని పొడిగిస్తే, 31-40 సంవత్సరాల రెట్టింపు అంటే 4.2 శాతం చేయాలి. 41-50 సంవత్సరాల మధ్య దానిపై రెట్టింపు 8.4 శాతం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జి, అమ్మకం పన్నుతో సహా అనేక మినహాయింపులు పోర్టు యాజమాన్యానికి కల్పించింది. దీనికి మించి ఈ పోర్టును విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి నుండి మినహాయించి, ఇండిస్టియల్ ఏరియా లోకల్ అథారిటీ అనే ప్రత్యేక హోదా ఏర్పాటు చేసింది. దీని వల్ల విశాఖ మునిసిపాలిటీకి వీరు ఏ రకమైన పన్నులు గాని, ఇతర సెస్సులు గాని చెల్లించనవసరం లేకుండా ప్రభుత్వం రాయితీ కల్పించింది.
పోర్టు యాజమాన్యం ఈ భూమిని 13 బ్యాంకుల కన్సార్టియంలో తనఖా పెట్టి రూ.1170 కోట్లు అప్పు తీసుకుని పోర్టును నిర్మించింది. ఇలా పైసా స్వంత పెట్టుబడి లేకుండా యాజమాన్యం పోర్టును స్వాధీనం చేసుకుంది. ఇక్కడ ఇంకో మతలబు కూడా జరిగింది. అదేమిటంటే, ఈ భూమిని ప్రభుత్వం ఆగస్టు 2007న పోర్టు యాజమాన్యానికి బదలాయించింది. కానీ విచిత్రంగా రేటును మాత్రం ఒప్పందం జరిగిన 2002 నాటిదే నిర్ణయించారు. దీనర్ధం ఈ ఐదేళ్ళ కాలంలో పెరిగిన భూమి విలువను ప్రభుత్వం కోల్పోయింది. దీని ఆధారంగానే 50 సంవత్సరాలకు చెల్లిస్తారు కాబట్టి, భవిష్యత్తు ఆదాయం కూడా ప్రభుత్వం కోల్పోతుంది. నాటి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువ కంటే తక్కువకు, అది కూడా ఐదు సంవత్సరాల క్రితం రేటుకు గంగవరం పోర్టుకు ఈ స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వం అప్పుడే కానీ ఆనాటి మార్కెట్ విలువకు కేటాయించి ఉండి ఉంటే, ప్రభుత్వం కనీసం 90 శాతం వాటాను కలిగి, రాష్ట్ర ప్రభుత్వ పోర్టుగా ఉండేది. ఇలా అప్పటి ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరిగింది, ప్రైవేటు పోర్టుకు మాత్రం బాగా లాభం జరిగింది.
దీనికి తోడు పోర్టు యాజమాన్యం ఆనాడు ఉపాధికై చేసుకున్న అనేక ఒప్పందాలను నేటికీ అమలు చేయడం లేదు. ఈ పోర్టు రాక వల్ల గంగవరం గ్రామంలో రెండు వేల మందికి పైగా గ్రామస్థులు ఉపాధి కోల్పోయారు. వీరందరికి ప్రత్యామ్నాయ వేట వృత్తి ఏర్పాటుకై జెట్టి నిర్మిస్తామని, అప్పటి వరకు ప్రతి నెలా రెండు నుండి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని, 600 మందికి పోర్టులో శాశ్వత ఉపాధి కల్పిస్తామనే హామీలలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. స్టీల్ ప్లాంటుకు బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే అది కూడా అమలు కావడం లేదు. ఇలా అన్ని ఒప్పందాలను యాజమాన్యం ఉల్లంఘిస్తూనే ఉంది. అయినా వరుస ప్రభుత్వాలలో చలనం లేదు.
నేడు జగన్ ప్రభుత్వం వీటన్నింటినీ తలదన్ని, శాశ్వతంగా తెర పడేలా తమకున్న వాటాల మొత్తాన్ని అమ్మేయాలని నిర్ణయించడం, 2002 లో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం కంటే కూడా అనేక విధాలుగా నష్టకరమైనది. ఎలాగంటే, ఇప్పుడు వాటాలమ్మడమంటే ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 1800 ఎకరాలపై శాశ్వతంగా హక్కును కోల్పోవడమే. రెండోది, 30 సంవత్సరాలు, ఆపై మరో 20 సంవత్సరాలు రావలసిన లీజు సొమ్ము, లాభాలలో వాటా కూడా పూర్తిగా కోల్పోవలసిందే. మూడోది, 2002 ఒప్పందం ప్రకారం పోర్టు యాజమాన్యానికి అత్యధికంగా 50 సంవత్సరాల వరకు మాత్రమే ఉన్న హక్కు కాస్తా నేడు శాశ్వతమవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం. గత ప్రభుత్వమే తీవ్ర తప్పిదాలు చేసిందనుకుంటే, నేటి ప్రభుత్వం మరింత తప్పు చేస్తోంది. నేడు ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంటు ప్రకారం గజం 9,500 లెక్కన మొత్తం 1800 ఎకరాల విలువ రూ. 8276 కోట్లు. వాస్తవంగా ఇక్కడ మార్కెట్ విలువ గజం రూ. 35 వేలుంది. ఇంత విలువైన సొత్తును కేవలం రూ. 645 కోట్లకు అమ్మేయాలని నిర్ణయించడం అవివేకమే. ప్రభుత్వ ఖజానాకు మాత్రమే కాక, వృత్తి కోల్పోయిన మత్స్యకారులకు, స్టీల్‌ప్లాంటుకు కూడా మరింత నష్టం చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయం ఉంది. వీటికి మించి, అసలు గంగవరం పోర్టు లోని వాటాలను అమ్మే హక్కే 2002 ఒప్పందం ప్రకారం యాజమాన్యానికి లేదు. ఎందువల్లనంటే, ఇది కేవలం 30 సంవత్సరాలకు లీజుకు తీసుకున్న స్థలం మాత్రమే. ఇప్పటికే సగం కాలం అయిపోయింది. నడిపితే తాను నడపాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలి.
అందులోనూ, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ను ప్రవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి బలం చేకూర్చేదిగా ఉంది. వెరసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ నిర్ణయాలు రెండూ కలిపి రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తాయి.
రూపాయి పెట్టుబడి లేకుండా దేశంలోనే లోతైన పోర్టుగా, రూ.500 కోట్లకు పైగా ఆదాయంతో నేడు గంగవరం పోర్టు ఎదగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ సహకారమే. ఈ ప్రాంత ప్రజలకు నిర్బంధం, కాలుష్యం, ఉపాధి పోవడం తప్ప ఈ పోర్టు వల్ల ఒరిగిందేమీ లేదు. మత్స్యకారుల ఉపాధి, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు వంటి అంశాలన్నీ గమనంలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అదాని సంస్థకు వాటాలమ్మాలన్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడమే కాక, మిగిలిన వాటాల అమ్మకాలను కూడా ఆమోదించరాదు. గంగవరం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టాలి. కాని పక్షంలో విశాఖపట్నం పోర్టు ఆధ్వర్యంలోకి తీసుకుని వచ్చేలాగైనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. అలా కాకుండా తన నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే మాత్రం అది తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమే.
/వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి/
ఎ. అజ శర్మ











