Sep 04,2023 19:54

మాట్లాడుతున్న మంత్రి కాకాణి

ప్రజాశక్తి - పొదలకూరు :వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గం లో 40,691 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలంలో వైయస్సార్‌ పింఛన్‌ కానుక పథకంలో భాగంగా కొత్తగా మంజూరైన పింఛన్ల ను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలకి 13 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 156 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్‌ తీసుకునే వాళ్ళు మరణిస్తేనే, కొత్తవారికి పెన్షన్‌ ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. గతంలో చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చాడని..అయితే అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నింటిని, అధికారంలోకి వచ్చాక అమలు చేసిన విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. మీకు నా పాలనలో మేలు జరిగిందని భావిస్తేనే.. తనకు ఓటు వేయండి అని కోరే దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే.. బీజేపీతో కలుద్దామా.. జనసేనతో కలుద్దామా.. ఏదో ఒక విధంగా జగన్మోహన్‌ రెడ్డిని ఓడించాలని, ఆలోచన చేయడం తప్ప మరో పని లేదన్నారు. ప్రజా పరిపాలన ఎలా ఉంటుందో తెలుగుదేశం నాయకులకు తెలియదన్నారు. తమ పాలనలో చేసిన అభివద్ధిని వాళ్ళు చేసినట్టు చెప్పుకుంటూ పోతున్నారే తప్ప, వారి వల్ల గ్రామానికి ఎంత మేలు జరిగిందనేది చెప్పలేకపోతున్నారన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేసిన శాసనసభ్యుల హయాంలో వారెంత నిధులు తెచ్చారో... ఈ నాలుగు ఏళ్ల మూడు నెలల పాలనలో అంతకంటే అదనంగా నిధులు తెచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా, లేదా.. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పాడా, లేదా.. అని తెలుసుకుంటే కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుల కు కూడా చంద్రబాబుకు ఓటు వేయడానికి చేయి ముందుకు రాదన్నారు. గతంలో కొత్తగా పెన్షన్‌ మంజూరు కావాలంటే వద్ధులు అష్టకష్టాలు పడేవారని, ఎందరినో ప్రసన్నం చేసుకుంటేగానీ కుదిరేదికాదన్నారు. నేడు మన ప్రభుత్వంలో కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా, వాలంటీర్లు ద్వారా మన ఇంటి నుండే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కలిగిందన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన కోడి కూయకముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ ను అందజేసే పరిస్థితి మన రాష్ట్రంలో తప్ప మరి ఎక్కడా లేదన్నారు. కేవలం అర్హతే ప్రామాణికంగా వయోవద్దులు, దివ్యాంగులు, వితంతువులకు సమాజంలో గౌరవంగా బ్రతకగలిగే పరిస్థితిని కల్పించామన్నారు. గతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సామాజిక పెన్షన్స్‌ కోసం నెలకు 3 కోట్ల నిధులు వెచ్చించిగా, ప్రస్తుత ప్రభుత్వంలో నెలకు 13 కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పొదలకూరు జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ, ఎంపీపీ సుబ్బరాయుడు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌ రెడ్డి, సోమా అరుణ, పొదలకూరు సర్పంచ్‌ మల్లికా చిట్టెమ్మ, ఉప సర్పంచ్‌ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, సోమా భాస్కర్‌, ఎం. శేఖర్‌, లక్ష్మీ కళ్యాణి, వేణు గోపాల్‌ రెడ్డి, తాసిల్దార్‌ వీర వసంత కుమార్‌, ఎంపీడీవో నగేష్‌ కుమారి మండల వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.కండలేరు డ్యాం ఎడమ గట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి విద్యుత్‌ సౌకర్యం పునరుద్ధరించి రైతాంగానికి నీరు అందించాలి.స్పందనలో బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్‌ మిడతల రమేష్‌ జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాధుకు విజ్ఞప్తి చేశారు.