Aug 23,2022 23:58

వైసిపి

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
తక్షణమే ఎన్నికలు జరగకపోయినా... భవిష్యత్తు దృష్టితో అధికార వైసిపి తగిన జాగ్రత్తలు, మార్పులు, చేర్పుల దిశగా ఆలోచన సాగిస్తోంది. రానున్న 2024 ఎన్నికలే లక్ష్యంగా పలు పనుల నిర్వహణకు అటు అధికారికంగానూ, పార్టీ పరంగానూ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సర్వేలు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖ జిల్లాలోనూ పలు బృందాలు ఈ సర్వేల్లో పాల్గొంటూ పలు తరగతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి.
గడచిన మూడేళ్లుగా ప్రభుత్వం వైపు నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు 'గడప గడపకూ ప్రభుత్వం'ను ఇప్పటికే వైసిపి నిర్వహించింది. దీని ద్వారా కొంతమేర ప్రజలకు ఏం కావాలో, అభివృద్ధి పనులు ఎలా నిర్వహించాలో పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా పథకాలు అందని తరగతుల ఆకాంక్షల గురించిన సమాచారాన్ని ప్రభుత్వం తన వద్ద పెట్టుకుంది. తాజాగా ఎన్నికల దిశగా సర్వేను చేపట్టి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలు, అవతల పార్టీ నాయకుల బలాలు, బలహీనతలు, ప్రభుత్వ తీరుపైనా రాండమ్‌గా తెలుసుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ పాలనా తీరుపై ప్రధానంగా ఈ సర్వేలో ప్రశ్నలను ఆయా బృందాలు సంధిస్తున్నాయి. తాజాగా సినీ హీరో జూనియర్‌ ఎన్‌టిఆర్‌తో బిజెపి అగ్రనేత అమిత్‌ షా సమావేశం నేపథ్యంలోనూ ఈ బృందాలు స్పందించాయి. ఒకవేళ బిజెపి, టిడిపి కలిసే పని జరిగితే ఏ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నావళితో కదలడం విశేషం. వైసిపి తన రాజకీయ వ్యూహం ఎలా ఉండాలో ఆ పార్టీ నిర్ణయించుకునేందుకు ఇవన్నీ దోహదపడనున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అదనపు ఇన్‌ఛార్జిల నియామకానికి వైసిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో పలుచోట్ల అసంతృప్తులూ ఆ పార్టీకి తలెత్తే అవకాశాల్లేకపోలేదన్నది చర్చ జరుగుతోంది. ప్రజా ప్రతినిధులపై ప్రజల్లో ఎక్కడైనా వ్యతిరేకత ఉంటే తాను చేయబోయే సర్దుబాట్లు, మార్పులను బట్టి పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖ నగరంపై ఫోకస్‌
విశాఖ జిల్లాలోని తూర్పు, దక్షిణ, గాజువాకలపై వైసిపి అత్యధిక ఫోకస్‌ పెట్టింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు పట్టణాల పరంగా విశాఖలో టిడిపికి నాలుగు దక్కిన సంగతి తెలిసిందే. '2024 ఎన్నికల్లో దీన్ని తిరగరాస్తాం' అని, 2019 ఎన్నికల వేళలో పేదలకు వేల కొద్దీ ఇళ్లకు టిడిపి దొంగపట్టాలు ఇచ్చేసి విశాఖ సిటీలో ఎక్కువ సీట్లు గెలిచిందంటూ వైసిపి ఆరోపణలు గుప్పిస్తోంది. రెండు వేల ఇళ్లకు కేంద్రం అనుమతి ఇస్తే ఏకంగా లక్ష వరకూ దొంగపట్టాలిచ్చేసినందునే టిడిపికి సిటీలో ఆ సీట్లు వచ్చాయనే ప్రచారం తాజాగా వైసిపి చేపడుతోంది. తమ ప్రభుత్వం జిల్లాలో తాజాగా 1.30 లక్షల వరకూ ఇళ్లు ఇచ్చిందని ఆ పార్టీ చెబుతోంది. నగరంలోని ప్రధాన సెగ్మెంట్లలో అదనపు ఇన్‌ఛార్జిలను నియమించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఎంపీ సీటును మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో వైసిపికి బలహీనంగా ఉండే తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్‌పైనా ఫోకస్‌ పెట్టింది. విశాఖపట్నం ప్రస్తుత ఎంపీని తూర్పు అసెంబ్లీకి ఆ పార్టీ పంపించనుందనే ప్రచారం ఆ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది.
అధికారులకూ అభివృద్ధి లక్ష్యాలు
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమీక్షలు, వెబెక్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌లను వేగిర పరుస్తోంది. ఈ నెల 29న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం కూడా జరుగనున్న నేపథ్యంలో పలు కీలక మార్పులు జిల్లాల్లో చోటుచేసుకుంటాయన్న చర్చ నడుస్తోంది. ఇంటి పట్టాలు, స్థలాలు, ఇళ్లు లబ్ధిదారుల వివరాలను హౌసింగ్‌ వద్ద నిక్షిప్తమై ఉండేలాగ, గ్రామ సచివాలయాలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ (గ్రామీణం), నాడు - నేడు పనుల్లో పురోగతి, ఎపి టిడ్కో ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష (సర్వే), నేషనల్‌ హైవేస్‌, కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ల్లో ఒకసారి వచ్చిన సమస్య మరో దఫా రాకుండా జాగ్రత్తలపై తరచూ జిల్లా కలెక్టర్‌, ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సమీక్షల జోరు పెంచారు. ఎన్నికల దిశగానే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయన్న చర్చ అంతటా నెలకొంది.