Nov 12,2022 21:56

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
            తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా కొయ్యలగూడెం నుండి జీలుగుమిల్లి వరకూ చేపట్టిన నేషనల్‌ హైవే 516-డి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 23 కిలోమీటర్ల మేర రూ.74 కోట్లతో రహదారిని 12 మీటర్ల వెడల్పుతో (ఇరువైపులా మీటర్‌ వెడల్పుతో మార్జిన్‌) నిర్మిస్తున్నారు. ఇప్పటికే రహదారి నిర్మాణ పనులు 80 శాతం పూర్తి కాగా కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొయ్యలగూడెం - జంగారెడ్డిగూడెం మధ్య ఉన్న పులివాగు వంతెన వద్ద పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం పులి వాగు వంతెన వెడల్పు ఎనిమిది మీటర్లు ఉండగా దాన్ని 16 మీటర్లు పెంచుతున్నట్లు నేషనల్‌ హైవే అధికారులు తెలిపారు. కల్వర్టు నిర్మాణానికి రూ.కోటీ 25 లక్షలు మంజూరయ్యాయని, 18 చోట్ల కల్వర్టులు నిర్మిస్తామని తెలిపారు. 2023 ఫిబ్రవరి నెలాఖరుకు కల్వర్టులతో సహా రోడ్డు నిర్మాణం నూరు శాతం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.