Dec 31,2022 23:40

పవర్‌ కెనాల్‌ గండి పూడ్చివేత పనులు జరుగుతున్న దృశ్యం

ప్రజాశక్తి -సీలేరు
సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని డొంకరాయి పవర్‌ కెనాల్‌ గండి మరమ్మతు పనులు శరవేయంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ 14 అర్ధరాత్రి పవర్‌ కెనాల్‌కు గండిపడి నీరు వృథాగా పోవడంతో డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం విధేతమే. సుమారు కోటి 70 లక్షల రూపాయలతో కెనాల్‌ గండి మరమ్మతు చేపట్టడానికి స్థానిక కాంట్రాక్టులకు పనులు అప్పగించారు. మరమ్మతు పనులు చేపట్టి పది రోజుల దాటింది. పనులు వేగవంతం చేయడానికి మెటీరియల్‌, యంత్రసామాగ్రి కొరత రాకుండా అందుబాటులో ఉండే విధంగా జెన్‌కో అధికారులు చర్యలు చేపట్టారు. పూడ్చివేత పనులు నాలుగు విభాగాలుగా విభజించి నిరంతరం ఏపీ జెన్కో విద్యుత్‌ సౌద చీఫ్‌ ఇంజనీర్‌ శేషారెడ్డి, సీలేరు కాంప్లెక్స్‌ ఎస్‌ఈ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఈఈలు బాబూరావు, జాకీర్‌ హుస్సేన్‌, ఏఈ సురేష్‌ పర్యవేక్షిస్తున్నారు. గ్రావెల్‌తో గండి పూడ్చివేత పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం, సోమవారాల్లో కాంక్రీట్‌ పనులు చేపట్టనున్నారు. జనవరి మొదటి వారానికి గండి పూర్చివేసి కెనాల్‌ వినియోగంలో తేవడానికి ఇంజనీర్లు శత విధాల ప్రయత్నిస్తున్నారు.