ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌లోనే ఏ జిల్లాలోనూ లేని రీతిలో కాకినాడ జిల్లా ప్రత్యేకత సంతరించుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని కాకినాడ తీరంలో ఉన్న డీప్ వాటర్ పోర్ట్, యాంకరేజ్ పోర్టులకు తోడుగా మూడో పోర్ట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. కాకినాడ సెజ్ పరిధిలో జరుగుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం ఆలస్యంగా మొదలయ్యి ముందుకు సాగుతోంది. ఇప్పటికే రెండు పోర్టుల కారణంగా కాకినాడ తీరంలో పారిశ్రామికాభివద్ధికి అవకాశం ఏర్పడింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. తాజాగా మూడో పోర్ట్ నిర్మాణం కూడా పూర్తయితే కాకినాడ సెజ్ కేంద్రంగా పరిశ్రమలకు ఊతమిస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ (కేజీపీఎల్) పేరుతో పదేళ్ల క్రితమే పోర్ట్ నిర్మాణం ప్రతిపాదించినా ఆచరణ రూపం దాల్చలేదు. చివరకు తొండంగి మండలం పెరుమాళ్లపురం సమీపంలో సెజ్‌కు ఆనుకుని పోర్ట్ నిర్మాణానికి 2019లో గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన జరిగింది. కానీ పనులు ముందుకు సాగలేదు. కానీ ఇటీవల సెజ్ యాజమాన్యం మారింది. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పేరుతో అరబిందో సంస్థ పనులు మొదలుపెట్టడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురంలో ఏర్పాటవుతున్న కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ ఎపి అభివద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. నాలుగు నెలల క్రితం మొదలైన దీని నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. రూ.2500 కోట్ల పెట్టుబడితో 1,650 ఎకరాల్లో కేజీపీఎల్ నిర్మాణం కానుంది. తొలి దశలో నాలుగు బెర్తులను నిర్మిస్తున్నారు. సంవత్సరానికి 16 మిలియన్ టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ పోర్టులో రెండు లక్షల డెడ్ వెయిట్ టన్నుల నౌకలను ఏకకాలంలో హ్యాండిల్ చేయవచ్చు. ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ మొదటి దశకు సంబంధించి అన్ని రకాల అనుమతులూ వచ్చాయి. 2600 మీటర్ల పొడవునా ప్రస్తుతం సౌత్ బ్రేక్ వాటర్ పనులు జరుగుతున్నాయి. నార్త్ బ్రేక్ వాటర్ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటి మధ్యలో భారీ షిప్పులు ఆగుతాయి. కోల్, ఆయిల్ దిగుమతులకు ప్రధాన కేంద్రంగా ఈ పోర్ట్ ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాకినాడ సెజ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమల ఉత్పత్తులు కూడా ఈ పోర్ట్ ద్వారా ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. లక్షా ఇరవై వేల టన్నుల బరువు మోయగల షిప్పులను హ్యాండిల్ చేయగల ఈ పోర్టును భవిష్యత్తులో 2 లక్షల టన్నుల బరువు మోయగల షిప్పులను హ్యాండిల్ చేయడానికి వీలుగా డిజైన్ చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ పోర్ట్ కమర్షియల్ గా ఆపరేషన్స్ ప్రారంభించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ప్రత్యేక రైల్వే లైన్
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి గేట్ వే పోర్ట్ కోసం డెడికేటెడ్ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.300 కోట్లు వ్యయం కానుంది. అన్నవరం నుంచి 15 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మిస్తారు. అంతర్గతంగా మరో 10 కిలోమీటర్ల లైన్‌తో కలిపి మొత్తం 25 కిలోమీటర్ల రైల్వే లైన్ వేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అన్నవరం రైల్వే స్టేషన్‌కు కొత్త భవనం నిర్మించి రైల్వే శాఖకు అప్పగిస్తారు.
ప్రత్యేక రహదారులు
కేంద్రం నిధులతో నిర్మించునున్న సాగర మాల రహదారి ఈ పోర్టుకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నవరం జాతీయ రహదారి నుంచి కాకినాడను కలుపుతూ నిర్మించనున్న సాగరమాల రోడ్ ఈ పోర్ట్ అభివద్ధిలో కీలక పాత్ర నిర్వహించనుంది. ఈ రోడ్డు మార్గం వల్ల పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. ఈ పోర్ట్ రాకతో సమీప గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏర్పాటయ్యే పరిశ్రమల ఉత్పత్తులు ఇక్కడ నుంచి సులభంగా విదేశాలకు ఎగుమతులు చేసుకొనే అవకాశం ఉంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని పోర్ట్ నిర్వాహకులు తెలిపారు.










