శరవేగంగా మెడికల్ కళాశాల నిర్మాణ పనులు
- ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాలలో చేపడుతున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. అనుమతి పొందిన కళాశాలల్లో నంద్యాల మెడికల్ కళాశాల వుండడం సంతోషంగా ఉందన్నారు. మంగళవారం మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు మరింత వేగవంతంగా నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రధానంగా విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది విద్యా సంవత్సరం 5 మెడికల్ కళాశాలలకు అడ్మిషన్లు చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపిందని పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది 750 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు సువర్ణ అవకాశం లభించిందని తెలిపారు. నంద్యాలలో మెడికల్ కళాశాల నిర్మాణానికి అడ్డంకులు సృష్టించినా కోర్టుల్లో కేసులు గెలిచామన్నారు. అడ్డంకులు లేకపోయింటే ఇప్పటికే అనుకున్న లక్ష్యం సాధించేవారమన్నారు. అయినా అధికారుల పర్యవేక్షణలో మరింత వేగవంతంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. దాదాపుగా మొదటి ఏడాదికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నామని, త్వరలోనే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు భవనాలను అప్పజెప్పాలని కాంట్రాక్టర్‌లను, సంభందిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.










