Sep 11,2023 22:38

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం మచిలీపట్నం పోర్టు అభివద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి సోమవారం జిల్లా కలెక్టర్‌ చాంబర్‌ లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి రాష్ట్రంలో వివిధ పోర్టుల అభివద్ధి పనుల పురోగతిపై వరుసుగా సమీక్షించారు. పోర్టు, రెవెన్యూ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గని మచిలీపట్నం పోర్టు అభివద్ధి పనుల గురించి సిఎస్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం మచిలీ పట్నం పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయని తెలిపారు. మొత్తం 2,075 మీటర్ల సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ నిర్మాణంలో ఇప్పటికి 650 మీటర్ల దూరం సముద్రం లోనికి పటిష్టంగా చొచ్చుకుపోతున్నట్లు చెప్పారు. అదేవిధంగా సముద్రంలో నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ నిర్మాణం 250 మీటర్ల దూరం పూర్తయిందని తెలిపారు. రైల్‌, రోడ్‌ కనెక్టివిటీకి సంబంధించి మూడు దశల్లో చేపట్టే రహదారి అభివద్ధి పనులకు బీచ్‌ రోడ్డు నుండి బ్రేక్‌ వాటర్‌ వరకు రహదారి పనులు ప్రారంభమైనట్లు కలెక్టర్‌ చెప్పారు. రెండవ, మూడవ దశల్లో రహదారి అభివఅద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. టర్నింగ్‌ సర్కిల్‌ ఏరియా వద్ద ల్యాండ్‌ సైడ్‌ డ్రెడ్‌ జింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శివయ్య, రైట్‌ సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ జగదీష్‌, మెఘా ఇంజనీరింగ్‌ సంస్థ తరుపున రాఘవేంద్రరావు, కలెక్టరేట్‌ తహసిల్దార్‌ రాధిక తదితరులు పాల్గొన్నారు.