Jul 03,2023 21:23

సర్వే వంద శాతం పూర్తి కావాలి : కలెక్టర్‌

రాయచోటి :ఎన్‌సిడి-సిడి సర్వే వంద శాతం పూర్తి కావాలని కలెక్టర్‌ గిరీష మెడికల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హల్‌లో మెడికల్‌ ఆఫీసర్లతో ఎన్‌సిడి-సిడి సర్వే, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, అనిమిక్‌ టెస్టింగ్‌, డెంగీ, మలేరియా, తదితర అంశాలపై కలెక్టర్‌ గిరీష పిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య స్థితిగతులు సంపూర్ణంగా తెలుసుకుని ప్రతి ఒక్కొరికీ ఒక హెల్త్‌ ఐడిని క్రియేట్‌ చేయాలని ఇందుకు సంబంధించి జరుగుతున్న ఎన్‌ సిడి-సీడీ సర్వేను పగడ్బందీగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో మెడికల్‌ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోజూ ఎఎన్‌ఎం ద్వారా వారు అందించిన వైద్య సేవలను సంబంధిత యాప్‌లో వందశాతం అప్‌లోడ్‌ చేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు మెడికల్‌ ఆఫీసర్లు కషి చేయాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడూ రక్తపరీక్షలు నిర్వహించి అనీ మియా నివారణకు కషి చేయాలన్నారు. ఇంటి వద్దకే వైద్య సేవలు - ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కార్యక్రమంలో భాగంగా డయాబెటిస,్‌ హైపర్‌ టెన్షన్‌ రోగులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అతిసార వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని, చిన్నపిల్లలకు విరోచనాలు అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా, ఎఎన్‌ఎం, ఆరోగ్య కార్యకర్తలు తల్లులకు అవగాహన కల్పిం చాలని సూచించారు. ప్రతి పిహెచ్‌సిలోనూ ఇన్‌స్టిట్యూషనల్‌ డెలవరీలు తప్పక నిర్వహించాలన్నారు. పిహెచ్‌సిలలో మెడికల్‌ ఆఫీసర్‌, ఎఎన్‌ఎం, నర్సులు, సిబ్బంది ఉన్నారని, ఇకనుంచి తప్పక నార్మల్‌ డెలివరీలు జరిగేటట్లు చూడా లన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో టిబి కేసులకు సంబంధించి ఎఎన్‌ఎం వారీగా రిపోర్టు పంపాలన్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్లు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన పరీక్షలు ఎప్పటికప్పుడూ నిర్వహించాలన్నారు. ప్రతి సచివాలయంలో ఉన్న మందుల వివరాలు ప్రజలకు తెలిసే విధంగా నోటీసు బోర్డులో డిస్‌ప్లే చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ రెఫరల్‌ కేసులకు సంబంధించి రిజిస్టర్లో నమోదు చేసి డేటా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. కలెక్టర్‌ వివిధ అంశాలలో సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య, మెడికల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.