Aug 04,2023 23:27

పల్నాడు జిల్లా: నరసరావుపేట మున్సిపల్‌ పరిధిలోని సంక్షిప్త ఓటర్ల జాబితా తయారీ కోసం చేపట్టిన సర్వే ప్రక్రియను సమర్థ వంతంగా పూర్తిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ (ట్రైనీ కలెక్టర్‌) కల్ప శ్రీ (ఐఏఎస్‌) అధికారులను ఆదేశించారు. నరసరావుపేట మున్సిపల్‌ పరిధిలో చేస్తున్న స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ - 2024 సంక్షిప్త ఓటర్ల జాబితా తయారీ కోసం చేపట్టిన సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసే విధానం పై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే ప్రక్రియ కొనసాగుతున్న తీరును ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ అడిగి తెలుసుకుని, ఎటువంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎన్నికల నిర్వహణ అధికారులకు వెంటనే తెలియజేసి, సమస్యలను పరిష్కరించు కోవాలన్నారు. సర్వే కార్యక్రమంలో రాజకీయ పార్టీల పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లను భాగస్వామ్యం చేసి ఎటువంటి అనుమానాలు తలెత్తిన నివత్తి చేయాలన్నారు. ఓటర్ల సర్వే ప్రక్రియ జాబితా తయారీలో మార్పులు, చేర్పులు, ఇంటి నంబర్లు, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్‌ బూతుల వారీగా ఓటర్ల పేర్లు నమోదు తదితర అంశాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్దిష్ట కాలపరిమితి లోపు ఎన్నికల జాబితా యాప్‌ లో వివరాలను నమోదు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో నరసరావు పేట మున్సిపల్‌ శాఖ అధికారులు, పోలింగ్‌ బూత్‌ అధికారులు, సూపర్‌ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.