సాలూరు: పనితీరుపై పార్టీ సర్వే నివేదికలు బాగోకపోతే సీటు మార్పు తప్పదు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు తెలిసింది. బుధవారం అమరావతిలో గల పార్టీ కార్యాలయంలో సాలూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల వారీగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలను సమీక్షించారు. దీనిలో భాగంగా బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు సమీక్షకు ముందు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నియోజకవర్గం నుంచి హాజరైన ముఖ్య నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒక్కో నాయకుడ్ని విడివిడిగా పిలిచి వారు చెప్పిన అభిప్రాయాలను చంద్రబాబుకు నివేదించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో సంధ్యారాణి తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాచిపెంట మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్ బాబును ఎందుకు మార్చారంటూ సంధ్యారాణిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మండలపార్టీ అధ్యక్షుడిని మార్చే అధికారం మీకెక్కడిదని నిలదీసినట్లు తెలుస్తోంది.
మండల పార్టీ అధ్యక్షుడి మార్పు విషయం రాష్ట్ర కార్యాలయానికి ముందు నివేదించారా అని ఆమెను ప్రశ్నించగా చేశానని చెప్పడంతో అక్కడే ఉన్న కార్యాలయ బాధ్యులను పిలిచి చంద్రబాబు ఆరా తీశారు. పాచిపెంట మండలపార్టీ అధ్యక్షుడి మార్పు విషయంపై రాష్ట్ర కార్యాలయానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని నిర్ధారణ అయింది. మండల పార్టీ అధ్యక్షుడిగా పిన్నింటి ప్రసాద్ బాబు కొనసాగుతారని, ప్రస్తుతం అధ్యక్షుడు ముఖీ సూర్యనారాయణకు జిల్లా స్థాయిలో పదవి ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌తో కలిసి పని చేయాలని, ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. మక్కువ మండలానికి చెందిన సీనియర్ నాయకులు పెంట తిరుపతిరావు తాను పార్టీలో చేర్చుకుంటే వద్దనడానికి మీరు ఎవరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తిరుపతిరావును కలుపుకు పోవాలని సంధ్యారాణిని ఆదేశించినట్లు సమాచారం. పార్టీ కార్యాలయం ఇంటి వద్ద కాకుండా వేరొక చోట తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద సంధ్యారాణికి అధినేత చంద్రబాబు అక్షింతలు వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పనితీరు మార్చుకోకపోతే టికెట్ వుండదనే సంకేతాలు కూడా ఆయన అందజేశారు.










