Sep 06,2023 22:37

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయతర ప్రాంతాలు, గ్రామ కంఠాల నిర్ధారణకు చేపట్టిన భూముల రీసర్వే మందగమనంగా సాగుతోంది. 2020 ఏప్రిల్‌ 24న ఈ సర్వే ప్రారంభం కాగా స్వామిత్వ కార్యక్రమం కింద వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం ద్వారా ప్రాంతాల్లో నివాసాల సమగ్ర రీ సర్వేను చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని కుటుంబాలను డ్రోన్‌ టెక్నాలజీతో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల ఆస్తులు ఆక్రమణదారులు, నివాసిత యజమానులకు యాజమాన్య ధ్రువీకరణాల పత్రాల జారీకి సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించే ఉద్దేశంతో ఈ సర్వేను చేపట్టారు. ఈ ధ్రువీకరణ పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నివాసిత కుటుంబాలు తమ ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించుకునేలా యాజమాన్య రికార్డును సిద్ధం చేయటానికి ఈ సర్వే చేపట్టినట్టు తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 2002 గ్రామపంచాయతీల్లో డ్రోన్‌ ప్లరు కార్యక్రమాలు పూర్తయ్యాయి. 65 గ్రామాల్లో మ్యాప్స్‌ సిద్ధమైనట్లు జిల్లా పంచాయతీ అధికారి కేశవ రెడ్డి తెలిపారు. దశల వారిగా అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. అయితే ఇప్పటి వరకూ నాలుగు గ్రామాల్లో ఆర్‌ఒఆర్‌ ప్రాసెస్‌ ప్రకారం అన్ని ఛాయాచిత్రాలు, సర్వే పూర్తి చేశారు. ఈ గ్రామాల్లో 1858 మందికి రికార్డు లు సిద్ధం చేశారు. ప్రత్తిపాడు మండలం కొండ జాగర్లమూడి, దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం, చింతలపూడి, శృంగారపురం గ్రామాల్లో మాత్రమే గ్రామ కంఠాల నిర్ధారణ జరిగింది.
మూడేళ్ల క్రితం చేపట్టిన సర్వే అత్యంత మందగానంగా కొనసాగుతోదని చెప్పటానికి 202 గ్రామాలకు గాను కేవలం నాలుగు గ్రామాల్లోనే పూర్తి కావడం ఒక ఉదాహరణ. మరో ఆరు గ్రామాల్లో పూర్తి వివరాల నమోదు పూర్తయ్యింది. గ్రామ సచివాలయాల పరిధిలోనే సర్వేయర్లు పనిచేస్తున్నా వారు పూర్తి స్థాయిలో గ్రామ కంఠాల సర్వే పనుల్లో నిమగం కాకపోవడమూ ఒక కారణంగా చెబుతున్నారు. అయితే సర్వేయర్‌ లను వ్యవసాయ భూముల హక్కుదారుల నిర్ధారణకు వినియోగించడం వల్ల వారు గ్రామాల్లో నివాసాల నిర్ధారణకు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయం కూడా లేకపోవడం వల్ల మరికొన్ని ప్రాంతాల్లో సర్వే మందగమనంగా సాగుతున్నట్లు తెలిసింది.