ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 2021-22 బడ్జెట్‌లో సవరించి ప్రతిపాదించిన విధానం మొత్తం కేంద్ర సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించే దిశలో వుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్‌యు)లో వాటాల ఉపసంహరణ మాత్రమే కాదు, అచ్చమైన ప్రైవేటీకరణ ప్రక్రియ ఇది. పి.వి నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఈ వాటాల ఉపసంహరణ కార్యక్రమం మొదలెట్టింది. వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చాక ఈ పెట్టుబడుల ఉపసంహరణను పచ్చి ప్రైవేటీకరణగా మొండిగా కొనసాగించింది. ఎంతవరకూ వెళ్లారంటే పెట్టుబడుల ఉపసంహరణకు ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటుచేశారు. పెట్టుబడుల ఉపసంహరణతో పాటు వాజ్‌పేయి ప్రభుత్వం డజనకు పైగా సిపిఎస్‌యు లను నూటికి నూరుపాళ్లు తెగనమ్మింది.
వినాశకర పోకడ
ఇప్పటి వరకూ పెట్టుబడుల ఉపసంహరణ ఐపివో, ఇపివో, ఒఎఫ్‌ఎస్, ఇటిఎఫ్ వంటి వాటి ద్వారా జరుగుతుండేది. మళ్లీ కొనేయడం, వేలం, చివరగా వ్యూహాత్మక అమ్మకం జరిగేవి. ఇప్పుడు సవరించిన విధానం పూర్తిగా ప్రైవేటీకరణకు ఉద్దేశించింది. వివిధ పద్ధతులలో మార్గాలలో పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పుడు వెనక్కు నెట్టబడింది. పరిశ్రమలను కీలక కీలకేతరమైనవిగా విభజించడం కేవలం కనికట్టు మాత్రమే. రాష్ట్రాలు కూడా తమ ఆధ్వర్యం లోని పిఎస్‌యు లను అమ్మేసే విధంగా ప్రోత్సహించే పేరిట మోడీ ప్రభుత్వం సమాఖ్య స్వతంత్రాన్ని కూడా హరించివేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు పిఎస్‌యు లను అమ్మేలా ఒత్తిడి పెడుతున్నది.
ముందుగా ఎంపిక చేసిన, గుర్తించిన సిపిఎస్‌యు లను వేగంగా వదిలించుకోవడం కోసం కేంద్రం ప్రైవేటు నిపుణులతో సహా ఒక స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఐఎఎస్ అధికారుల (మంత్రిత్వశాఖల కార్యదర్శులు) పని తీరు బాగా లేదని ప్రధాని మోడీ పార్లమెంటు తాజా సమావేశాలలో మాట్లాడిన నేపథ్యంలోనే ఇది జరుగుతున్నదని గమనించాలి. తమ శాఖల ఆధ్వర్యం లోని సంస్థలను ప్రైవేటీకరించడంలో వారు దూకుడుగా వ్యవహరించడం లేదనేది ఆయన ఆగ్రహానికి కారణం.
ప్రైవేటీకరణకు సంబంధించి సవరించిన విధాన ప్రకటన ప్రకారం ఇప్పుడు ప్రధానంగా రెండు సాధనాల ద్వారా జరుగుతుంది. మొదటిది-ఉత్పత్తి తయారీ సర్వీసు రంగాలలోని సిపిఎస్‌యులను నేరుగా అమ్మేయడం, రెండవది-ఆస్తుల నగదీకరణ (అమ్మి నగదు చేసుకోవడం) పేరుతో...భూమిని, ప్రాతిపదిక సదుపాయాలనే వాటిని విక్రయించడం. రకరకాల పేర్లతో, పద్ధతులతో ప్రైవేటీకరణ సాగించడం కేవలం ప్రజలను మోసగించడం తికమక పెట్టడం తప్ప మరొకటి కాదని గుర్తించాలి. ఎందుకంటే చివరకు జరిగేది ప్రైవేటీకరణ తప్ప మరేమీ కాదు. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను ముక్కలు ముక్కలుగా అమ్మడమన్న మాట.
2021-22 కేంద్ర బడ్జెట్ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా రూ.లక్షా 75 వేల కోట్లు సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇదేగాకుండా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మడం ఎల్‌ఐసిలో ఐపివో తీసుకురావడంతో సహా ప్రైవేటీకరణ దిశలో అనేక చర్యలు ప్రకటించింది. అలాగే విద్యుత్ పంపిణీని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించాలని తలపెట్టింది. విద్యుచ్ఛక్తి పంపిణీ ప్రైవేటీకరణ (సవరణ)-2021 బిల్లును ఇప్పటికే ప్రజలకు అందుబాటులో వుంచింది. ఆస్తుల నగదీకరణ అంటే ఏమిటో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్దిష్టంగా ప్రతిపాదించారు. బడ్జెట్‌లో ఇందుకోసం ఒక మార్గం ప్రతిపాదించారు. 2021 నుంచి 2024 వరకూ వున్న కాలాన్ని ఒక ముద్దగా పరిగణించి ఈ దశలో రూ.2.5 లక్షల కోట్లు రాబట్టాలని ప్రతిపాదించారు.
జాతీయ నగదీకరణ మార్గం
వివిధ మంత్రిత్వ శాఖలు జాతీయ నగదీకరణ మార్గంలో చేర్చవలసిన ఆస్తులను గుర్తించి సమాచారం పంచుకోవాలని నీతి ఆయోగ్ చెప్పింది. ఇందుకోసం కార్యదర్శుల కీలక బృందం ఒకటి ఏర్పాటైంది. ఈ బృందం గత నెల సమావేశమై 2021-22లో అమ్మి సొమ్ము చేసుకోవాల్సిన ఆస్తుల క్లుప్త జాబితా ఒకటి తయారు చేసింది.
న్యూఢిల్లీ లోని ప్రతిష్టాత్మకమైన నెహ్రూ స్టేడియంను ప్రైవేటీకరించేందుకు గాను ఒక సలహాదారును నియమించే ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా ఆ కార్యదర్శుల బృందం క్రీడా మంత్రిత్వశాఖను కోరింది. ఆ స్టేడియంను నిర్వహణ, వాణిజ్యం ఒప్పందం కింద లీజుకు ఇస్తారని చెబుతున్నారు. 2021-22లో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆస్తుల అమ్మకం కింద ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్ ఎయిరుపోర్టులను పూర్తిగా అమ్మేయాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా 13 ఎఎ1 ఎయిర్‌పోర్టులను ఒఎండిఎ (ఆపరేషన్, మేనేజిమెంటు, డెవలప్‌మెంట్ ఒప్పందం) కింద నగదీకరిస్తారు. ఎనిమిది మంత్రిత్వ శాఖల కింద వున్న ప్రభుత్వ రంగ సంస్థలు గాక అనేక ఇతరమైనవి కూడా ఆస్తుల ప్రైవేటీకరణ జాబితాలో వున్నాయి, బొగ్గు, గనులు, పర్యాటకం, గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కూడా ఈ ప్రైవేటీకరణ జాబితాలో చేర్చవచ్చని మీడియా చెబుతున్నది.
ప్రైవేటీకరణ అర్థశాస్త్రం
ప్రైవేటీకరణ దాడితో ముడిపడిన ఆర్థిక విషయాలు కూడా అర్ధం చేసుకోవడం అవసరం. పెట్టుబడిదారీ విధానంలో క్రమానుగతంగా వస్తున్న సంక్షోభపు ప్రస్తుత పరిస్థితితో దాన్ని కలిపి చూడాల్సి వుంటుంది. ఇది అమెరికాలో ఆర్థిక దివాళాతో ముడిపడి వున్న సంక్షోభం కూడా. కోవిడ్-19 వ్యాప్తికి ముందే దేశ ఆర్థిక పరిస్థితి అన్ని విధాల దెబ్బతిని వుందనేది అంకెలు చెప్పే నిజం. దేశంలో ఆర్థికంగానూ భౌతికంగానూ ఎప్పుడు ఎలాంటి సంక్షోభం వచ్చినా పిఎస్‌యులను అమ్మేసి ప్రభుత్వాన్ని ఆదుకోవాలనే ఒత్తిడి వస్తుంటుంది. ఇది ఎప్పటి నుంచి మొదలైందో కూడా చెప్పలేంగాని ఉదాహరణలు అసంఖ్యాకంగా వున్నాయి. కోవిడ్ వ్యాప్తి ఇందుకు మినహాయింపు కాదు. సిపిఎస్‌యులను అమ్మి నగదు రాబట్టేందుకోసం మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకూ సంపద్వంతమైనవిగా వున్న ప్రభుత్వ సంస్థలను కూడా చావు దెబ్బ కొడుతున్నది. పి.ఎం.కేర్స్ ఫండ్, విపరీతమైన స్థాయిలో డివిడెండ్లను, పన్నులను, సుంకాలను రాబట్టాలని కాపెక్స్‌కు ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించడం కూడా మరింత దిగ్భ్రాంతి కలిగించే నిజాలు.
ఒఎన్‌జిసి కథ మరింత దిగ్భ్రాంతికరమైంది, నవరత్నాలలో అగ్రస్థానంలో వున్న సిపిఎస్‌యు అది. అత్యంత కీలకరంగంలో పనిచేస్తున్నది. అయినా ఒఎన్‌జిసిని కూడా మోడీ ప్రభుత్వం హెచ్‌పిసిఎల్‌ను గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌ను కొనుగోలు చేసి తీరాలని శాసించింది. ఈ కార్పొరేషన్ ఆయన ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ప్రారంభమైంది. ఈ అనవసరమైన కొనుగోళ్ల కోసం ఓఎన్‌జిసి 25 వేల కోట్ల నగదు నిల్వ చెల్లిపోవడమే గాక మార్కెట్‌లో 24 వేల రుణం తెచ్చుకోవలసి వచ్చింది. 2013-14లో ఒఎన్‌జిసి నగదు, నగదుతో సమానమైన విలువ కలిపి లక్షా ఏడు వేల కోట్ల మిగులు నిల్వ వుండేది. కాని ఇప్పుడు అది మార్కెట్‌లో అప్పులపాలవడమేగాక పని చేసేందుకు కూడా పెట్టుబడిలేని పరిస్థితి ఏర్పడింది. ఉత్తరోత్తరా ఓఎన్‌జిసి చమురు తవ్వకం కోసం చేసే వ్యయం 2004-2020 మధ్య 13.7 శాతం క్షీణించింది. ఫలితంగా చమురు ఉత్పత్తి పడిపోయింది. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నిధులు గుంజే విధానం పర్యవసానమిది.
'పి.ఎం.కేర్స్'కు నిధులు ఇవ్వాలని... 55కు పైగా సిపిఎస్‌యులు ఒక విధంగా ఒత్తిడికి గురైనాయి. 38 సిపిఎస్‌యుల మొత్తం విరాళం రూ.2,10,500 కోట్లు వుంటుందని అంచనా. కోవిడ్ రాకముందే ఆర్థిక సంక్షోభ పరిస్థితులలో మంత్రి నిర్మలా సీతారామన్ 32 మంది సిపిఎస్‌యుల అధినేతలను పిలిచి పెట్టుబడి వ్యయ సేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం భారీ ప్యాకేజీలిచ్చినా ప్రైవేటు రంగం పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఇందుకు కారణమైంది. ఇప్పుడు సంక్షోభానికి కోవిడ్ ఆజ్యం పోయడంతో దేశ పరిస్థితి ఘోరంగా తయారైంది. మరోసారి 2020 జులై 7న ఆమె 23 సిపిఎస్‌యుల సిఎండిలతో సమావేశమై ఇదే మళ్లీ చెప్పారు. ప్రభుత్వ సంస్థలలో వాటాలను తగ్గించుకోవడం కేవలం రెవెన్యూ కోసమే కాదు. ప్రైవేటుకు చోటు కల్పించేందుకు అదొక మార్గం అని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ సూటిగానే చెప్పారు. తమ హయాంలో ప్రైవేటు పెట్టుబడికి స్వర్గధామం లాంటిదని ద్రవ్య పారిశ్రామిక పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడం కూడా మోడీ ప్రభుత్వ రాజకీయ సైద్ధాంతిక క్రీడలో భాగమే. ప్రభుత్వ రంగం అన్న ప్రసక్తి లేకుండా చేసే నయా ఉదారవాద సిద్ధాంతానికి మోడీ ప్రభుత్వం అంకితమైందనేది బాహాటంగా కనిపిస్తున్న విషయం. తాను పూర్తిగా ప్రైవేటు రంగానికి కట్టుబడివున్నానని మోడీ ప్రభుత్వం చెప్పదల్చుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సామ్రాజ్యవాదానికి అత్యంత విశ్వాస పాత్రమైన ఏజంటు పాత్రలో తన ప్రస్తుత స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని పాలక పక్షం భావిస్తున్నది. చైనా చుట్టూ సాగుతున్న ఆర్థిక రాజకీయ సైనిక కార్యక్రమాలు ఈ మొత్తం విధానచట్రంలో భాగాలు తప్ప విడిగా జరుగుతున్నవి కాదు.
ప్రభుత్వ రంగంపై దాడి మరింత తీవ్రమయ్యేకొద్ది దాన్ని ఎదుర్కొనే ప్రతిఘటన కూడా మరింత శక్తివంతంగా దృఢంగా సాగవలసి వుంటుంది.ఈ రోజున ప్రైవేటీకరణ కోసం మోడీ ప్రభుత్వం సాగిస్తున్న వినాశకరమైన బరితెగింపుపై అవగాహనా పూర్వకమైన విశ్లేషణ చేయవలసి వుంటుంది. దేశానికి, ప్రజలకు శత్రువులైన వారిని ఓడించేందుకోసం కట్టుబడి అంకితభావంతో సుసంఘటితంగా ప్రభుత్వ రంగ కార్మికుల ఉద్యమం సాగించవలసి వుంటుంది. ఈ ప్రయత్నాన్ని సరైన రీతిలో చెప్పవలసి వుంటుంది. ఇదే నేటి తక్షణ అవసరం.
ఒకటైతే నిశ్చయంగా చెప్పొచ్చు. దేశంలో గనక ఐక్య పోరాటాలు, సమ్మెలు జరిగివుండకపోతే...ప్రభుత్వ రంగ విధ్వంసం, కార్మిక హక్కులపై దాడి ఊహించలేనంత తీవ్రంగా విస్తారంగా సాగివుండేది. ఈ ఐక్య పోరాటాలు ఉద్యమాల కారణంగా...మోడీ ప్రధానిగా వున్న ఎన్‌డిఎ ప్రభుత్వం తన విధ్వంసకర చర్యలను వదులుకోవడం, వాయిదా వేసుకోవడం తప్పనిసరైంది. రాబోయేకాలంలో ప్రభుత్వ రంగ పరిరక్షణ ఉద్యమాన్ని అన్ని వైపులా విస్తరించవలసి వుంటుంది. కేవలం ఉద్యోగుల కోసమే గాక దేశ ఆర్థిక సార్వభౌమత్వం కోసం కూడా పోరాడటం అవసరం. మన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగాన్ని లేకుండా చేసే వినాశకరమైన పథకాలకు వ్యతిరేకంగా ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక అవగాహన పెంచడం ద్వారా అత్యధిక జనబాహుళ్యాన్ని సమీకరించి సమరం చేయవలసి వుంటుంది. విస్త్రుతమైన సమరశీల పోరాటాలకు సమాయత్తం కావలసి వుంటుంది.
- స్వదేశ్ దేవ్ రాయ్










