May 22,2023 23:58

దగ్ధమైన తోటను పరిశీలిస్తున్న బాధితుడు

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో పాత జోగంపేట నుండి సాలికి మల్లవరం, పొగచెట్లపాలెం, వెంకటాపురం గ్రామాలకు వెళ్లే విద్యుత్‌ లైన్లు ఐదు అడుగుల కంటే కిందికి వేలాడటంతో సరుగుడు తోట దగ్ధమైంది.సాలిక మల్లవరం గ్రామానికి చెందిన పెదిరెడ్ల మల్లేశ్వరరావు సరుగుడు తోట సుమారు ఎకరం కాలి బూడిదయింది. తెల్లవారుజామున వీచిన గాలికి విద్యుత్‌ మంటలు రావడంతో ఈ సంఘటన జరిగిందని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు. కాగా ఈ విషయమై గొలుగొండ విద్యుత్‌ అధికారులకు, లైన్మెన్‌లకు, డివిజన్‌ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వేలాడుతున్న విద్యుత్‌ వైర్లపై పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.ఈ చుట్టుపక్కల వ్యవసాయం చేసే వారంతా భయం గుప్పెట్లో వ్యవసాయం చేయవలసి వస్తుందని, ఎప్పుడు ఏమవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో సుమారు రెండు లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చిందని రైతు గుగ్గోలు పెట్టాడు. జీడి మామిడి తోటలగుండా వెళ్లే కూలీలు, రైతులు, కరెంటు తీగలకు భయపడి పిక్కలు ఏరలేక తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్‌ తీగలను సరి చేయాలని స్థానికులు కోరారు.