Nov 03,2023 20:23

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌డిఎ పీడీ కల్యాణ చక్రవర్తి

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  అఖిలభారత డ్వాక్రా బజార్‌ (సరస్‌)కు విజయనగరంలో అపూర్వ స్పందన వచ్చిందని డిఆర్‌డిఎ, వైకెపి ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.కల్యాణ చక్రవర్తి తెలిపారు.. గత నెల 28న ఈ సరస్‌ను ప్రారంభించగా, ఇప్పటివరకు సుమారు రూ.2.8 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయని తెలిపారు. సరస్‌ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో తొలిసారిగా ప్రభుత్వం ఈ సరస్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక్కడ మొత్తం 194 స్టాల్సు ఏర్పాటు అయ్యాయని, 15 రాష్ట్రాలకు చెందిన సుమారు 45 స్టాల్సు బయటి రాష్ట్రాల నుంచి రాగా, మిగిలిన స్టాల్స్‌లో అధికశాతం మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి వచ్చాయని తెలిపారు. మన జిల్లాకు చెందిన స్టాల్స్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ద ఉత్త్పత్తులు, వస్త్రాలు, తినుబండారాలు, హస్త కళలు, అలంకార వస్తువులను అక్కడి మహిళా సంఘాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నాయని తెలిపారు. సరస్‌లో కేవలం వస్తు ప్రదర్శన, విక్రయాలకే పరమితం కాకుండా, సాయంత్రం 6 నుంచి 9 వరకు వివిధ సాంస్కతిక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
గ్రామీణ నైపుణ్యానికి, హస్త కళలకు పెద్ద పీట వేస్తూ, వారి ఉత్పత్తులను ప్రోత్సహించడం, వాటికి ప్రాచుర్యం కల్పించడం ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ సరస్‌లను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సరస్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వంతోపాటు, స్త్రీనిధి, మెప్మా, ఎస్‌బిఐ డిసిసిబి, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, ఆప్కాబ్‌ తదితర సంస్థలు సహకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రదర్శనలో వెదురు ఉత్పత్తులు, వస్త్ర ఉత్పత్తులు, చీరలు, జ్యువెలరీ, హ్యండ్‌లూమ్‌, హ్యాండి క్రాప్ట్స్‌, బెడ్‌షీట్స్‌, గృహలంకరణ వస్తువులు, హ్యాండ్‌లూమ్స్‌, కుర్తాలు, రెడీమేడ్‌ దుస్తులు, ఆభరణ వస్తువులు, పచ్చళ్లు, మసాలా దినులు, ఆయుర్వేద ఉత్పత్తులు, తినుబండారాలు, జ్యూట్‌ ఉత్పత్తులు, నాబార్డ్‌, మెప్మా, తెలంగాణా రాష్ట్ర ఉత్పత్తులు పోచంపల్లి, గద్వాల్‌ వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ నెల8వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, అప్పటి ఆదరణ బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రసిద్ధ ఉత్పత్తులన్నీ ఒకే చోట దొరకడం అపూర్వ అవకాశమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, సరస్‌ను సందర్శించాలని పీడీ కల్యాణ చక్రవర్తి కోరారు. సమావేశంలో డిఆర్‌డిఎ ఎపిడి సావిత్రి, డిఐపిఆర్‌ఒ డి.రమేష్‌ పాల్గొన్నారు.