Feb 18,2023 21:44

గుండెపోటుతో ఆకస్మిక మృతి
భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సిఎం జగన్‌,
మంత్రులు, ఎంఎల్‌ఎలు, రాజకీయ ప్రముఖులు
భీమవరం నుంచి జక్కరం వరకూ అంతిమ యాత్ర
ప్రజాశక్తి - భీమవరం, భీమవరం రూరల్‌

రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉండి మాజీ ఎంఎల్‌ఎ పాతపాటి సర్రాజు (70) గుండెపోటుతో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఓ ఫంక్షన్‌కు హాజరై శుక్రవారం రాత్రి భీమవరంలోని ఇంటికి చేరుకున్న సర్రాజు కొద్దిసేపటికి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు ఆయనను హుటాహుటీన వర్మ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సర్రాజు మృతి చెందినట్లు నిర్థారించారు. సర్రాజుకు భార్య అన్నపూర్ణమ్మ, పెద్ద కుమారుడు పాతపాటి శ్రీనివాసరాజు (వాసు), చిన్న కుమారుడు పాతపాటి యుగంధర్‌వర్మ (వర్మ) ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి భీమవరంలోని సర్రాజు నివాసానికి విచ్చేసి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. వైసిపికి చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, రాజకీయ ప్రముఖులు, సిపిఎం, టిడిపి, జనసేన, బిజెపి నేతలు సర్రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉండి, భీమవరం నియోజకవర్గాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వేలాదిగా తరలొచ్చారు.
1953లో పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం జక్కరం గ్రామంలో సర్రాజు జన్మించారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షునిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పని చేశారు. 2004లో ఉండి ఎంఎల్‌ఎగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజానీకానికి ఎనలేని సేవలందించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2021లో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులై రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం వైసిపి పోలవరం నియోజకవర్గ పరిశీలకుని బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.
సర్రాజు మృతి పట్ల సిఎం జగన్‌ సంతాపం
భీమవరంలో పాతపాటి సర్రాజు నివాసానికి శనివారం మధ్యాహ్నం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సర్రాజు భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. సర్రాజు మృతి వార్త తెలియగానే జగన్‌ శనివారం ఉదయం ఫోన్లో సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సిఎం భీమవరం రానున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో నేతలు, ఉన్నతాధికారులు హుటాహుటీన ఏర్పాట్లలో నిమగమయ్యారు. పెదఅమిరంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు పనులను శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌ పరిశీలించారు. హెలీకాఫ్టర్లో పెదఅమిరం చేరుకున్న జగన్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా భీమవరంలోని సర్రాజు స్వగృహానికి 2.37 గంటలకు చేరుకున్నారు. సర్రాజు భౌతికాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం సర్రాజు కుమారులు వాసు, వర్మలతో మాట్లాడి ఏం జరిగిందని ఆరా తీశారు. మూడు నెలల క్రితం సర్రాజు తన వద్దకు వచ్చారని, అప్పుడు బాగానే ఉన్నారని, ఇంతలోనే ఏమైందని విచారం వ్యక్తం చేశారు. అనంతరం సర్రాజు భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించి 2.49 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి పెదఅమిరంలోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి హెలీకాఫ్టర్‌లో విజయవాడ బయల్దేరి వెళ్లారు.
సిఎం జగన్‌కు వినతిపత్రం అందించిన సర్రాజు కుటుంబ సభ్యులు
సర్రాజు కుటుంబ సభ్యులు సిఎం జగన్‌కు వినతిపత్రం అందజేశారు. సర్రాజు ఎంఎల్‌సి పదవి ఆశించారని, శుక్రవారం ఒక ఫంక్షన్‌కు వెళ్లొచ్చిన ఆయన ఇంటికొచ్చాక ఎక్కువ సేపు దీనిపై ఆలోచించారని కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించినట్లు సమాచారం. ఒక ఇంటెలిజెన్స్‌ అధికారితో ఎంఎల్‌సి పదవి కేటాయింపు గురించి మాట్లాడి తెలుసుకున్నారని, కొద్దిసేపటి తర్వాత తనకు నిద్ర పట్టడం లేదని చెప్పారని, అనంతరం టీవీలో పాటలు చూశారని, కొద్దిసేపటికి అస్వస్థతకు గురవడంతో హుటాహుటీన వర్మ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారని తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ సర్రాజు కుమారుడు వాసు ఉన్నారుగా, ఇంకా సమయం ఉంది అని సర్రాజు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు సిఎంకు ఒక వినతిపత్రం అందజేసినట్లు సమాచారం. దానిలో ఏముందో తెలియరాలేదు. దీనిపై స్థానికంగా విస్తృత చర్చ సాగుతోంది.
సర్రాజు మృతి పట్ల సిపిఎం సంతాపం
ఉండి మాజీ ఎంఎల్‌ఎ పాతపాటి సర్రాజు మృతి పట్ల సిపిఎం సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ సర్రాజు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎల్‌ఎగా సర్రాజు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
భీమవరం నుంచి జక్కరం వరకు అంతిమయాత్ర
సర్రాజు అంతిమయాత్ర భీమవరంలోని స్వగృహం నుంచి స్వగ్రామం జక్కరం వరకూ సాగింది. జక్కరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు సంతాపం
సర్రాజు మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, జిల్లా అధికారులు సంతాపం తెలిపారు. వైసిపితోపాటు సిపిఎం, టిడిపి, జనసేన, బిజెపి నేతలు, నాయకులు, జిల్లా అధికారులు సర్రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్‌ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, డిఐజి పాలరాజు, కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఇన్‌ఛార్జి జెసి ఎం.సూర్యతేజ, ఎస్‌పి యు.రవిప్రకాష్‌, ఆర్‌డిఒ దాసి రాజు, ఎంఎల్‌ఎలు గ్రంధి శ్రీనివాస్‌, పుప్పాల వాసుబాబు, మంతెన రామరాజు, దూలం నాగేశ్వరరావు, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంబిసి ఛైర్మన్‌ పెండ్ర వీరన్న, సువార్తీకులు బ్రదర్‌ అనిల్‌కుమార్‌, మాజీ ఎంఎల్‌సిలు మేకా శేషుబాబు, బొమ్మిడి నారాయణరావు, నేతలు గోకరాజు రామం, వంకా రవీంద్ర, యడ్ల తాతాజీ, గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్‌, గాయకుడు గజల్స్‌ శ్రీనివాస్‌, మాజీ ఎంఎల్‌ఎలు పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి వెంకట శివరామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, డిసిసిబి మాజీ ఛైర్మన్‌ ముత్యాల రత్నం, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్‌రాజు ఉన్నారు.
కాళ్ల: రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు (70) సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాజకీయాల పట్ల ఆసక్తితో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈయన స్వగ్రామం కాళ్ల మండలం జక్కరం. 2006లో జక్కరం నిర్మల్‌ పురస్కార్‌ అవార్డు సాధించేందుకు అహర్నిశలు కృషి చేశారు. ఆయన మరణంతో జక్కరం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు పర్యవేక్షణలో సర్రాజు భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఆప్త మిత్రుడిని కోల్పోయా : భీమవరం ఎంఎల్‌ఎ గ్రంధి
భీమవరం రూరల్‌: పాతపాటి సర్రాజు భౌతికకాయాన్ని సందర్శించిన ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ కన్నీటిపర్వంతమయ్యారు. రోజులో ఏదోక సందర్భంలో ఇద్దరం మాట్లాడుకునే వాళ్లమని గ్రంధి చెప్పారు. సర్రాజు, తాను ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టామన్నారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు, తనకు తీరని లోటన్నారు.