ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీలోని జనరల్ ఫండ్‌లో ఉన్న డబ్బులతో విద్యుత్ బిల్లులకు కట్టాలని గ్రామ కార్యదర్శులు సర్పంచుల మీద ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి కృష్ణమోహన్ పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిల చెల్లిస్తూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇలా జనరల్ ఫండ్ నిధులను బిల్లుల చెల్లింపునకు వినియోగించాలనుకోవడం సరికాదన్నారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది కలిసి ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేసి ఖాతాల్లో జమ చేశారు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా జనరల్ ఫండ్‌ను విద్యుత్ బిల్లులు పేరుతో తీసుకుంటామని అనటం దుర్మార్గమైన చర్య అని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు అందరు కలిసి పార్టీలకతీతంగా పెద్దఎత్తున పోరాటం చేస్తామని కృష్ణమోహన్ తెలిపారు. ఎవరు కూడా విద్యుత్ బకాయిలు చెల్లించవద్దని సర్పంచ్‌లకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పంచాయతీ అధికారులు.. కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ వారి ఆదేశాల ప్రకారం శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారన్నారు. జిల్లా పంచాయతీ అధికారులు, విస్తరణాధికారుల ద్వారా పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ పంచాయతీ సర్పంచుల్ని విద్యుత్ బకాయిల నిమిత్తం ఒత్తిడి చేస్తున్నారు. ఎవరూ కూడా నిధుల విడుదల కోసం తంబ్ వేయవద్దని అన్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించే దానికి సర్పంచ్‌లు వ్యతిరేకం కాదు కానీ గ్రామంలో ప్రధానమైన పారిశుధ్య కార్యక్రమాలు, జీతాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యం. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతల నిధులు ఈ నెలాఖరుకు కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు ఉంది. ఆ నిధులు వచ్చిన తర్వాత దాని నుంచి ఏంత శాతం మేర ఇవ్వవచ్చో చూసి గ్రామానికి వచ్చిన నిధులు పరిస్థితుల దృష్ట్యా విద్యుత్ శాఖ వారికి చెక్కులు ఇవ్వొచ్చు. అందువలన సర్పంచులు ప్రస్తుతం విద్యుత్ బిల్లుల కోసం ఎవరూ కూడా ఎటువంటి చెల్లింపులు చేయవద్దని కృష్ణమోహన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే వచ్చే విధంగా కృషి చేయాలని, జనరల్ ఫండ్ నిధులను వాడుకోవద్దని, అలాగే ఈ మార్చి నెలలో సర్పంచులు పెట్టుకున్న బిల్లులు వెంటనే మంజూరయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలు చేయకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు.










