Nov 14,2023 23:23

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి ప్రభుత్వం పాలనలో తమకు 'గౌరవం' దూరమైందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పోల్చితే వాలంటీర్ల పరిస్థితే కొంత మేలని వాపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్న విషయం విధితమే. జిల్లావ్యాప్తంగా 366 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 నెలలుగా గౌరవ వేతన బకాయిలు ఉన్నట్లు సర్పంచ్‌లు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క సర్పంచ్‌కు రూ.18,000 చొప్పున అక్షరాలా రూ.65.88 లక్షలు బకాయిలు ఉన్నట్లు సమాచారం. 90 శాతం గ్రామ పంచాయతీల్లో వైసిపి మద్దతుదారులే సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు. జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికలు జరిగి 30 నెలలు కాగా ప్రారంభంలో నాలుగైదు నెలలకు మాత్రమే గౌరవ వేతనం ఇచ్చింది. ఇక రెండేళ్ల నుంచి గౌరవ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తోంది. పల్లెల్లో పరపతి కోసం సర్పంచ్‌లుగా ఎన్నికై నాటి నుంచి స్థానికంగా ఏదో చేద్దామని కలలు కన్నారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులు తాము అనుకున్న విధంగా ఖర్చు చేయవచ్చన్న ఉద్దేశంతో సొంత ఖర్చులతో పలు రకాల పనులు చేశారు. అలా పనులు చేస్తున్న క్రమంలోనే ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. పంచాయతీ అకౌంట్లలో ఉన్న నిధులను ప్రభుత్వం తమ అకౌంట్లలోకి జమ చేసుకోవటం ప్రారంభించింది. సర్పంచ్‌లుగా కొత్తగా వచ్చిన సమయం కదా అని మొదట్లో వదిలేశారు. రాను రాను కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వమే వాడేసుకుని పంచాయతీ అకౌంట్లను జీరో చేయటం పరిపాటిగా మారింది. పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం(జీతం) కూడా ఇవ్వని దుస్థితి ఏర్పడింది. సర్పంచ్‌లకు ఏ నెలకానెల రూ.3 వేలు గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. గ్రామాల్లో నిరంతరం ప్రజలతో ఉండే సర్పంచ్‌లకు ఒక వైపు కనీస గౌరవం లేకుండా పోతుండగా ఇంకొక వైపు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు. ప్రతి ఏటా రెండు సార్లు విడుదలయ్యే ఆర్ధిక సంఘం నిధులను ప్రభుత్వం సిఎఫ్‌ఎంఎస్‌ ఖాతా ద్వారా విద్యుత్‌ చార్జీలకు ఇతరాత్ర ఖర్చులకు దారి మళ్లిస్తోంది. మైనర్‌ పంచాయితీలలో అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణకు సైతం నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరస్థితుల్లో నెలల తరబడి గౌరవ వేతనాలు తీసుకోలేని పరిస్థితి నెలకుందని కొందరు వాపోతున్నారు. ఈ గౌరవ వేతనం కోసం సర్పంచ్‌ల సంఘం జిల్లా, రాష్ట్రస్థాయిలో అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోని పరిస్థితి వచ్చిదంటే సర్పంచ్‌ల మనో వేదన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
6 నెలలుగా గౌరవ వేతనాలు లేవు
రాష్ట్ర ప్రభత్వుం సర్పంచులకు సక్రమంగా గౌరవ వేతనం విడుదల చేయటం లేదు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ప్రతి నెలా విడుదల చేసిన దాఖలాలు లేవు. 6 నెలలకోసారి వేతనాలు విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల బకాయిలు ఉన్నాయి. అక్షరాలా రూ.18,000 బకాయిలు ఉన్నాయి.
-చెక్కపల్లి మురళీకృష్ణ, సర్పంచ్‌, కడియపుసావరం, కడియం మండలం.