Jul 04,2023 00:12

ముంచంగిపుట్టులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సర్పంచులు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:14,15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేయాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఎం సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విజయవాడలో అరెస్టు చేసిన సర్పంచులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ కొమ్ము రామారావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం లక్ష్మీపురం సర్పంచ్‌, సర్పంచ్‌ పోరం మండల ఉపాధ్యక్షుడు కొర్ర త్రినాధ్‌, ఎస్‌.సుభాష్‌ చంద్ర మాట్లాడుతూ, కేంద్రం ి పంచాయితీలకు కేటాయించిన 14,15వ ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పాలక వర్గం ఆమోదం లేకుండా దుర్వినియోగం చేసిందని, దీంతో దిష్టి బొమ్మల్లా మిగిలి పోయామని వాపోయారు.వైసీపీ ప్రభుత్వం సచివాలయం కన్వీనర్‌, గృహ సారథులను నియమించి సర్పంచ్‌లకు గౌరవం లేకుండా చేశారని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయితీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎస్‌.నర్సింగ్‌, కే.శివశంకర్‌, కే.గంగాధర్‌ పాల్గొన్నరు.
పెదబయలు :14, 15 ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారిమల్లించడంపై సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సిప్‌ఎం జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్ని బాబు, సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు అశోక్‌ మాట్లాడుతూ, పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడం పై మండిపడ్డారు. నిధులు లేక పోవడంతో పంచాయతీల పరిధిలో అనేక సమస్యలు నిలిచి పోయాయన్నారు. పంచాయతీ సర్పంచులకు రూ.15000 గౌరవ వేతనం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీతగుంట పంచాయతీ ఉప సర్పంచ్‌ బొండా గంగాధరం, టిడిపి నాయకులు వెచ్చంగి కొండయ్య పాల్గొన్నారు.