Jan 02,2023 23:06

ఆందోళన చేస్తున్న సర్పంచ్‌లు

గిరిజన సర్పంచ్‌ల ఆందోళన
ప్రజాశక్తి -హుకుంపేట
:తరాలుగా అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులను ఏజెన్సీ నుంచి వెళ్లగొట్టేందుకు మన్యాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రభుత్వాలు పూనకుంటున్నాయని మండలంలోని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు తెలియకుండా, వారి ఆమోదం లేకుండా హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు చేపట్టరాదంటూ సోమవారం స్థానిక మండల పరిషత్‌ వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు పెనుమల రంజిత్‌కుమార్‌. రేగం రమేష్‌ విలేకర్టతో మాట్లాడుతూ చింతపల్లి, కొయ్యూరు మండలాల సరిహద్దు ప్రాంతమైన గొందిపాకల పంచాయతీ సమగిరి, ఎర్రవరం సమీప అటవీప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టాలన్న వైసిపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీన్ని సర్పంచ్‌లంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు.కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేకుండా, ఏజెన్సీ నిబంధనలన్నీ తుంగలో తొక్కి, గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులతో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్‌ల అనుమతి, గిరిజనుల ఆమోదం లేకుండా ప్రాజెక్టు పనులు చేపడతి ఉద్యమించక తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు బాకూరు వెంకటరమణరాజు, తామర్ల సత్యనారాయణ. నైని సన్నిబాబు, సమీడ వెంకటపూర్ణిమ, సోమేలి సత్యవతి, పద్మ కుమారి పాల్గొన్నారు