Nov 10,2023 19:25

లేకుంటే మరో గరగపర్రు ఉద్యమం తప్పదు : కెవిపిఎస్‌ నేతలు
ప్రజాశక్తి - వీరవాసరం
నవుడూరు సర్పంచి నల్లిమెల్లి వేణుక ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తించిన ఆ గ్రామ ఉపసర్పంచి బొట్టా మునేంద్రరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే మరో గరగపర్రు తరహా ఉద్యమం చేస్తామని కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. ఉపసర్పంచి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, ఎస్‌సి, ఎస్‌టి ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పంచి వేణుక పోలీస్‌ స్టేషన్‌, స్పందనలో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఆమె కెవిపిఎస్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిజనిర్థారణ బృందం కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, జిల్లా అధ్యక్షులు బత్తుల విజరుకుమార్‌, గరగపర్రు ఉద్యమ నాయకులు సిరింగుల వెంకటరత్నం శుక్రవారం నవుడూరులో పర్యటించారు. సర్పంచి వేణుక నుంచి వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచికి అవమానం జరిగిన సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు వార్డు సభ్యులు ఆమెకు జరిగిన అవమానం, ఉపసర్పంచి ప్రవర్తించిన తీరు బృందానికి చెప్పారు. అనంతరం కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన ఒక ఎస్‌సి మహిళా సర్పంచి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉపసర్పంచి మునేంద్రరావు ప్రవర్తనను సహించేది లేదన్నారు. తక్షణం పోలీసులు, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జాతీయ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సామాజిక న్యాయం పేరుతో బస్సుయాత్ర చేస్తున్న వైసిపి నాయకులు అదే పార్టీకి చెందిన ఒక ఎస్‌సి సామాజిక తరగతికి చెందిన సర్పంచికి అవమానం జరిగితే ఆ పార్టీ నాయకులు ఏంజేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు దిగుపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ సర్పంచి వేణుక తనకు జరిగిన అవమానం పట్ల తిరగబడ్డారు కాబట్టి సరిపోయిందని, లేకపోతే మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. డిఎస్‌పి స్థాయి అధికారికి సర్పంచి స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేస్తే స్పందించరా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి ఎక్కడ కూర్కోవాలో ఉపసర్పంచి నిర్థారిస్తాడా అని ప్రశ్నించారు. ఈ విధమైన దురంహకార ప్రవర్తన సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. సర్పంచికి జరిగిన అన్యాయం కలెక్టర్‌కు తెలిసి ఉంటే ఈ ప్రాంతంలో తక్షణం పర్యటించాల్సి ఉన్నా అలా జరగలేదన్నారు. కార్యదర్శిని వెంటనే ఇక్కడ నుంచి బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణం సర్పంచికి జరిగిన అవమానంపై, ఉపసర్పంచికి మద్దతుగా ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పరిసర గ్రామ ప్రజలతో ఉద్యమిస్తామని తెలిపారు. గరగపర్రు ఉద్యమ నేత సిరింగుల వెంకటరత్నం మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రశ్నించిన దళితులను చంపుతోందన్నారు. రిజర్వేషన్‌లో భాగంగా వేణుక సర్పంచిగా ఎన్నికైందని, పెత్తందారులు కట్టబెట్టిన పదవి కాదని తెలిపారు. న్యాయం పక్కన నిలబడిన వార్డు సభ్యులు మల్లుల రామలక్ష్మి, కరీంశెట్టి వెంకటలక్ష్మిని అభినందించారు. మరో దళిత రాష్ట్ర నాయకుడు గొట్టుముక్కల ప్రభాకరరావు మాట్లాడుతూ ఒక దళిత సర్పంచికి అవమానం జరిగితే ఆ మహిళకు అండగా నిలవడం మాని ఆమెకు వ్యతిరేకంగా అవమానించిన వారికి అనుకూలంగా కొంత మంది దళిత నాయకులు ఖండన ఇవ్వడం బాధాకరమన్నారు. వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కోరం ముసలయ్య, వార్డు సభ్యులు, నల్లిమెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.