Aug 08,2021 13:08

భూమాత ఎదపై బువ్వపూలు
పూయించడానికి ....
సద్దిమూటలను శిరంపై ఎత్తుకొని
పనిముట్లను చేతిలో పట్టుకొని
చీమలదండుల్లా కదులుతారు కైకిలవ్వలు.
వాళ్ళు పాదం మోపితే...
నేలంతా ఆనందంతో చిందులు వేస్తుంది.
నోళ్లు తెరిచిన బీడు భూములు సైతం...
సిరుల పంటలను కురిపిస్తాయి.

వాళ్ళ శ్వాస.. ధ్యాసంత ఒక్కటే...
ప్రపంచానికి బుక్కెడు బువ్వపెట్టాలని.
వాళ్ళ చేతి స్పర్శతో మాగాణి సాళ్లన్ని
సంబురపడతాయి.
మంత్రసాని పురుడోసినట్లు...
విత్తులన్నింటికి ప్రాణం పోస్తారు వారు.
నేలనంత పచ్చని తివాచీ పరిచినట్లు...
తుకాలను అలికి మొక్కలను మొలిపిస్తారు.

బురదనీటిలో మట్టిపాదాలతో కదులుతూ...
వరినాట్లని చేతబూనుకొని...
పుడమితల్లి ఎదచిత్తముపై నాటుతుంటారు.
కైకిలవ్వల నోటినుండి జాలువారే...
జానపద పాటలను వింటూ...
ఒక్కో వరిపైరు తనువంతా కదిలిస్తూ
పరవశించిపోతుంది.
పక్షులన్నీ శబ్దాలు చేస్తూ సంగీతాన్ని వినిపిస్తాయి.
వాళ్ళ రుధిరాన్ని
పంటపొలాలకు ప్రాణంగా పోసి....
వడ్లగింజలను పండిస్తారు.

దేహం నుండి చెమటచుక్కలు జారిపడుతుంటే...
పిల్లగాలులన్నీ శరీరాన్ని తాకుతూ
మా కైకీలవ్వలను సేదతీరుస్తుంటాయి.
వాళ్ళ సద్దిమూటల్లో ఉండే కారం మెతుకులు...
పచ్చడన్నమే...మా అవ్వలకు పరమాన్నం.
మా అవ్వల రెక్కల కట్టమే...
మన కంచంలో కనిపించే నాలుగు మెతుకులు.

అశోక్‌ గోనె
94413 17361