రాజకీయాలు విధానాలు, సిద్ధాంతాల చుట్టూ గాక వ్యక్తుల చుట్టూ, బలీయమైన సంపన్న కుటుంబాల చుట్టూ తిరుగుతున్నంత కాలం వారి కదలికలే చర్చనీయమవుతుంటాయి.మౌలిక సమస్యలు ప్రజలకు చెప్పి ఉద్యమాలలో సమీకరించడం ఇష్టంలేని మీడియా సంస్థలకు ఇవే మంచి మసాలాలవుతుంటాయి. అలాగే రాజకీయ ఉనికికోసం అవకాశాలు వెతుక్కునేవారూ, ముందు ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం పార్టీలు కోరుకునేవారూ వీటిని ముందుకు తెస్తుంటారు.అలాగే ప్రముఖమైన పాలక వలయాలలో తమ స్థానం నిలబెట్టుకోవడానికి పెనుగులాడే వారు కూడా తమ పట్టు పెంచుకోవడానికి రకరకాల పేర్లతో ముందుకు వస్తుంటారు. తెలుగు,తమిళ రాజకీయాలలో వైఎస్ షర్మిల, శశికళ పేరిట ప్రస్తుతం కనిపిస్తున్న ి సందడి హడావుడి ఆ కోవకు చెందినవే. రాష్ట్రాల రాజకీయాలూ, వ్యక్తిగత నేపథ్యాలూ వేర్వేరైనా గత ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్ పాత్ర ప్రభావం గురించిన అంచనాల కోణంలో ఉభయుల గురించి చర్చించే అవకాశమేర్పడుతున్నది.
అనూహ్య ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారనే కథనం కొంత కాలంగా వినిపిస్తూనే వచ్చింది. తనకు అవకాశాలు ఇవ్వకపోవడం, తెలంగాణ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి పోటీ చేయకుండా ఎపికే పరిమితం కావడం, తనకు ఇస్తానన్న పార్లమెంటు నామినేషన్ ఇవ్వకపోవడం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ వారం ఆదిశలో ఆమె తెలంగాణ రాజకీయాలలో కాలూనతున్నట్టు ప్రకటించారు. ఈ నెల తొమ్మిదిన నల్గొండ జిల్లా నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిపారు. అన్న,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి షర్మిల పార్టీ ఏర్పాటును మూడు నాలుగు మాసాలుగా వ్యతిరేకించడమే గాక ఆమె ప్రకటన తర్వాత కూడా సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించారు. ఇది రాజకీయ భిన్నాభిప్రాయమే తప్ప విభేదం కాదని జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు చెప్పినా పరస్పర విభేదాలు బయటకు వచ్చాయనేది వాస్తవం.వైఎస్ కుటుంబంలో విభేదాలు, అన్నా చెల్లెల్ల అంతరాల గురించి ఒక మీడియాధిపతి ప్రముఖంగా ప్రచురించినప్పుడు అది నీతిమాలిన కథనం అనీ, అవసరమైతే కోర్టులో దావా వేస్తానని షర్మిల ఖండించారు.కాని తెలంగాణలో రాజన్నరాజ్యం ఎందుకు లేదు, తీసుకువస్తానని చెప్పడం ద్వారా ఆ కథనాలు కొంత నిజమేనని నిరూపించారు. వైఎస్‌ఆర్ అంటే అభిమానించేవారూ, సామాజికంగా ఆయన కుటుంబం వైపు చేరేవారూ తెలంగాణలో వున్నా ఓటింగుకు,పార్టీకి వచ్చేసరికి అది పెద్ద ప్రభావశీలపాత్ర కాకపోవచ్చుననీ, షర్మిల పార్టీ పరిమితంగానే వుండిపోవలసిరావచ్చనీ అంచనాలున్నాయి. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితమవుతాయి తప్ప రెండు చోట్ల బలంగా వున్నవి లేవనీ, టిడిపి వైసిపి జనసేన కూడా తెలంగాణలో పోటీ ఇవ్వలేకపోయిన వాస్తవం కనిపిస్తున్నది. అసలు పార్టీ ఏర్పాటు యోచన ఆమెది కాదని, భర్త అనిల్ వెంటపడి ఏర్పాటుచేయించారనీ చెబుతున్నారు. అయితే కుల మత కుటుంబ కోణాలతో ముడిపడిన ఈపార్టీ ప్రతిపాదన వెనక తెలంగాణలో ఎవరు వున్నారంటూ వూహాగానాలు కూడా విశృంఖలంగా సాగుతున్నాయి. ప్రభావం ఎంతైనా ఆమెపార్టీ వల్ల కాంగ్రెస్‌్ ఓట్లేపోతాయి గనక బిజెపి,టిఆర్‌ఎస్‌లు ప్రోత్సహించాయని కొందరు, అసలు జగన్ ఆశీస్సులతోనే ఏర్పడుతున్నదని మరికొందరు తోచిన వూహలు చెబుతున్నారు. పార్టీ ఏర్పాటుపై వచ్చిన కథనానికీ వాస్తవంగా జరుగుతున్నదానికి తేడాలు కూడా వున్నాయి. వైసిపి ఎంఎల్‌ఎ ఆర్కే ఆమెను కలుసుకోవడమూ వూహాగానాలకు దారితీసింది. అందుకే ఆ ప్రయత్నంతో అధికారికంగా విడగొట్టుకోవడం, వెనక్కు తగ్గేలా నచ్చజెప్పడానికి ప్రయత్నాలు చూస్తున్నాం. ఇంకా పార్టీ ఏర్పాటు విధానాలు కార్యక్రమం ప్రకటించలేదు గనక స్పష్టమైనఅంచనాకు రావడం తొందరపాటే. అయితే పార్టీ పెట్టడం మాత్రం ఖాయమని, ఖమ్మం నల్గొండలపై మొదట కేంద్రీకరిస్తారని కథనాలు వస్తున్నాయి. అవసరమైతే రాష్ట్రాల మధ్య సమస్యలపై వైసీపీతో పోట్టాడటానికి కూడా వెనుకాడబోమని సహాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఎపిలో జగన్‌ను ఎలా నష్టపరచగలరని, ఏం చేయగలరనే ప్రశ్న కూడా బలంగానే వుంది. ఏమైనా అది జగన్‌కు కొంత ఇరకాటమేనని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. అనిల్ షర్మిల దంపతుల షరతులు లేదా కోర్కెలు ఏవైనా అంగీకరించి సంతృప్తి పరిస్తే తప్ప పార్టీ ఏర్పాటును ఆపడం కుదిరేపని కాదని కూడా ఒప్పుకుంటున్నాయి.మొదట్లో తెలంగాణ గురించి మాట్లాడటానికి పరిమితమైనా ఉత్తరోత్తరా ఎపిలోనూ ఆమె పార్టీ విస్తరింపచేయవచ్చనీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలో ఈ అంశాన్నికూడా జోడించగా ఆయన సోదరుడు మరో పార్టీలో చేరడం, ఎన్టీఆర్ కుటుంబంతో విభేదాలు వంటివి వైసిపి వారు గుర్తు చేశారు. మొత్తంపైన దేశంలోని వివిధ రాష్ట్రాలలో కుటుంబ సభ్యుల మధ్య పొరపొచ్చాలు వారసత్వ తగాదాలు కొత్తకాదు. మహారాష్ట్ర యుపి తమిళనాడు కర్నాటక, జమ్మూకాశ్మీర్ వంటిచోట్ల గతంలో ఇలాటి పరిస్థితి చూశాం. అయితే అవన్నీ అదే రాష్ట్రానికి సంబంధించినవి కాగా షర్మిల విడిపోయిన తెలంగాణలో ఈ ప్రయత్నం చేస్తున్నారు. పరిమిత ప్రభావమే అయినా కచ్చితంగా ఏం చేస్తారనే ప్రకటన కార్యాచరణ కోసం చూడవలసిందే. అధికార టిఆర్‌ఎస్ మాత్రం పెద్దగా స్పందించనవసరం లేదని నిర్ణయించగా కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ప్రాంతీయ కోణంలో వ్యతిరేకిస్తున్నారు. బిజెపి నేతలు కొందరు కెవిపిరామచంద్రరావు వెనకవుండి ఈ పార్టీ ఏర్పాటు చేయించినట్టు ఆరోపించారు.పూర్తిస్పష్టత వచ్చాకే స్పందించగలమని సిపిఎంవ్యాఖ్యానించింది.
తమిళనాడు విచిత్ర పరిణామాలు
తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత ప్రియనేస్తంగా అంతులేని అధికారం చలాయించిన శశికళ అవినీతి ఆరోపణలపై నాలుగేళ్లపాటు కర్ణాటకలో జైలుశిక్ష అనుభవించి తిరిగి రాష్ట్రంలో అడుగెట్టారు.మన్నార్ గుడి మాఫియాగా పేరొందిన శశికళ గత చరిత్ర అంతా అలావుంచి జయలలిత అపోలో అస్పత్రిలో అచేతనంగా సుదీర్ఘకాలం కొనసాగిన దశ మరో మలుపు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం గురించి గానీ, అన్నా డిఎంకె అంతర్గత కలహాల గురించి కాని బయటకు రాకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరీముఖ్యంగా బిజెపి అప్పటి అధ్యక్షుడు అమిత్‌షా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో సహకరించారు. తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రత్యక్ష పాత్ర వహించారు. వీర విధేయుడైన తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో రాజీనామా చేయించి శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని పథకం వేయగా గవర్నర్ ఆలస్యం చేశారు. తర్వాత వైరుధ్యాలు పెరిగి శిబిరాలు నడిచి చివరకు ఎడుప్పావై పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. బిజెపి మద్యవర్తిత్వంలో పన్నీరు సెల్వం కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారు.ఈ ఉభయులూ కలసి తనను దూరం పెట్టడం సహించలేని శశికళ జయ సమాధి దగ్గర నాటకీయంగా ప్రతిజ్ఞ చేసి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత కాలంలో బిజెపి అన్నా డిఎంకెలు పొత్తు కుదుర్చుకోవాలని అవగాహనకు వచ్చాయి. పళనిస్వామి నిలదొక్కుకోగా శశికళ మేనల్లుడు దినకరన్ ఒక ఉప ఎన్నికలో గెలిచి ఆ వర్గం ఉనికి కాపాడాడు. అయితే ఈ మల్లగుల్లాల మధ్య అనర్హతకు గురైన సభ్యుల స్థానాల ఉప ఎన్నికలలో మాత్రం పాలక పక్షం ఎలాగో విజయాలు సాధించి మెజార్టీ కాపాడుకోగలిగింది.2019 పార్లమెంటు ఎన్నికలలో డిఎంకె కూటమి ఘన విజయం వంటివి కమల్‌హాసన్ పార్టీ స్థాపన , బిజెపి సన్నిహితుల ప్రోద్బలంతో రజనీకాంత్ వూరించి వూరించి చివరకు పార్టీ స్థాపనపై వెనక్కుపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు శశికళ పున: ప్రవేశం చూడవలసి వుంటుంది. గతంలోనే పన్నీరు పళని స్వామి ద్వయం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినా అన్నా డిఎంకె పతాకంతో రావడంపై కోర్టుకు వెళ్లినా ఆమెను ఆపలేకపో యారు. ఆ పార్టీ నేతలే కొందరు పతాకంతో ఆమె కారుకు ముందు ప్రయాణించారు. పోలీసులు నిరుత్సాహ పర్చాలని చూసినా వేలమంది స్వాగతం పలికారు. దినకరన్ మళ్లీ ముందుకువచ్చి తమ వర్గమే చక్రం తిప్పబోతుందన్నట్టు మాట్లాడారు. ఈ విధంగా హంగామాతో వచ్చిన శశికళ తమకు ఉమ్మడి శత్రువు డిఎంకెపై పోరాడాతామన్నారు. దేశంలో బిజెపి ఎన్‌డిఎ కూటమికి వ్యతిరేకమైన డిఎంకె కాంగ్రెస్ వామపక్షాల కలయికకే ఘన విజయం రాబోతున్నట్టు ఎన్నికల సర్వేలు వెల్లడిం చడం బిజెపికి మింగుడుపడటంలేదు. ఈపరిస్థితి లో శశికళ చేయగలిగింది పెద్దగా వుండకపోయినా అన్నా డిఎంకెను అదుపులోకి తెచ్చుకుంటారా అనేది చూడవలసి వుంటుంది. బిజెపి సిద్ధాంత కర్త ఎస్‌గురుమూర్తి శశికళ వర్గంతో ముఖ్యమంత్రి పళనిస్వామి రాజీ చేసుకోవడం మంచిదని సూచిం చారు. ఆమెకు ఉన్న ఆర్థిక వనరులు రాజకీయ యంత్రాంగం వాడుకోవాలని కోరుకునేవారు పాల క శిబిరంలో వున్నందున ఏదైనా జరగొచ్చు. దక్షిణ భారతంలో కాలూనాలనే బిజెపి ఆశకు మాత్రం తమిళనాడులో అవకాశం రాదనే చెప్పాలి.
- - తెలకపల్లి రవి










