Sep 14,2023 22:42

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి పొన్నూరు రూరల్‌ : స్కీమ్‌ వర్కుర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. పట్టణంలోని రోటరీ క్లబ్‌ కార్యాలయంలో గురురవారం నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా దాదాపుగా 10 లక్షల మందిపైగా ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు, 60-70 వేలుకు పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని, లక్ష నుండి రెండు లక్షల వరకు స్కీమ్‌ వర్కర్స్‌ ఉన్నారని చెప్పారు. వీరెవరికీ చట్ట ప్రకారం వేతనాలు అమలు కావడం లేదని అన్నారు. వీరికి అనేక హామీలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన సందర్భంలో ఇచ్చారని, పర్మినెంట్‌ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు 10200 మందినే పర్మినెంట్‌ చేస్తామంటూ నాలుగున్నరేళ్ల తర్వాత చెబుతున్నారని, ఇది మోసమని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పు అమలుకు నోచడం లేదని, అత్తెసరు జీతాలతో ఉద్యోగులు, స్కీమ్‌ వర్కులు కాలం గడుపుతున్నారని చెప్పారు. కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని 7వ వేతన సంఘం చెప్పిందని, అయితే ఇప్పటికీ రూ.10-12 వేలే వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, కార్మికులు చేసే పోరాటాలకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలుగా తమ పూర్తి మద్దతు, ఉంటుందని, తామూ పోరాడతామని చెప్పారు. సదస్సులో మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, నాయకులు ఎన్‌.రమేష్‌, టి.ఉమాశంకర్‌, ఎంవి సుకన్య, ఎం.లక్ష్మి, ఎస్‌కె.రిజ్వానా, పి.భూషమ్మ, డి.అనురాధ, సిహెచ్‌ గిరి, లవకుమార్‌రెడ్డి, ఎం.నాగేశ్వరరావు, రామ్‌బ్రహ్మచారి, భవాని పాల్గొన్నారు.