Oct 13,2022 23:14

:శ్రమదానంతో రోడ్లు బాగుచేసుకుంటున్న గిరిజనులు

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌ : మండలంలోని మాదల పంచాయతీ మారుమూల పిటిజి గ్రామాలైన దోమలజోరు, రత్తకండి గ్రామ సమీపంలోని రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురై వాహన రాకపోకలకు ఇబ్బందిగామారింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులు, నేతలను కోరినా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానంతో భారీగా పడిన గుంతలను పూడ్చడంతోపాటు గతుకులమయమైన రోడ్డును చదును చేసే చర్యలు చేపట్టారు.మారుమూల గ్రామాలు కావటంతో తమ కష్టాలు, సమస్యలను అధికారులు, నేతలు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే డోలి మోత తప్ప వేరే మార్గం లేదన్నారు. అరకులోయ మండల కేంద్రానికి వెళ్లాలన్నా పాడైన రోడ్డుతో ఇబ్బందులు పడక తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వర్షాలకు పాడైన రోడ్డుకు మరమ్మతులు చేయడంతోపాటు పటిష్టం చేయాలని కోరారు కార్యక్రమంలో గిరిజన సంఘం పంచాయితీ అధ్యక్షులు కె అప్పన్న,గిరిజన సంఘం నేతలు కె గోపాల్‌, టి రాముర్తి, కె లచ్చన్న, జి చిన్నయ్య, జి రఘు, పి జగ్గారావు, జి రామన్న పాల్గొన్నారు.