Oct 05,2023 21:48

శ్రమదానంతో రోడ్డు పనులు చేస్తున్న బియ్యాలవలస గిరిజనులు

ప్రజాశక్తి - కురుపాం :  స్వాతంత్య్రం వచ్చి సుమారుగా 76 ఏళ్లు అవుతున్నా నేటికీ ఆ గిరిజన గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదు. వివరాల్లోకి వెళ్తే మండలంలో బియ్యాలవలస పంచాయితీ ఎగువ మంత్రజోలలో 30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో కొంతవరకు రోడ్డు పనులై సగంలో ఆగిపోయింది. గత కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మంత్రజోల గ్రామానికి వచ్చి రహదారి నిర్మాణం పూర్తి చేస్తానని గ్రామస్తులకు ఇచ్చిన హామీలు బుట్ట దాఖలయ్యాయి. దీంతో ఆ గిరిజన గ్రామ ప్రజలు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రోడ్డు సౌకర్యంలేని తమ గ్రామానికి రోడ్డు ఉండాలనే దృఢ సంకల్పంతో సుమారు రెండు కిలోమీటర్లు స్వచ్ఛందంగా కొంత డబ్బులు ఎత్తుకొని జెసిబితో పనులు చేయిస్తూ గ్రామస్తులంతా పలుగు, పార పట్టి స్వచ్ఛందంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో రోడ్డుపనులు కష్టం కనుక తమకు చేతనైనంత వరకు చేయగలుగుతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.