ప్రజాశక్తి- సాలూరు రూరల్ : రైతులు శ్రమదానంతో గురువారం ఎత్తిపోతల పథకానికి మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల ప్రజాశక్తి పత్రికలో బురదాలమ్మ ఎత్తిపోతల పథకంపై వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు ఆగమేఘాల మీద ప్రాజెక్టు వద్దకు వచ్చి మరమ్మతు పనులకు కావాల్సిన నిధులుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అధికారుల హడావుడి చూసి ఆయకట్టు రైతులు మరమ్మతు పనులు చేస్తారని ఆశపడ్డారు. కానీ మరమ్మతు పనులకు నిధులు లేవని అధికారులు చేతులేత్తేయడంతో ఏమి చేయాలో అర్థం కాక ఆయకట్టు పరిధిలో వుండే రైతులందరూ సమావేశమై ఈ పది రోజులలో మరమ్మతు పనులు చేసుకోకపోతే వ్యవసాయం చూస్తుండగానే నీరు అందక పంట చనిపోయే ప్రమాదం ఉందని భావించారు. ఈ నేపథ్యంలో ఇంటికి ఒక రైతు చొప్పున సుమర్ణముఖి నదిలో పంపులు వద్ద వున్న మట్టిని తొలగించి తదుపరి తలో కొంత నగదును పోగుచేసి మోటార్లు, ఎలక్ట్రికల్ బోర్డులను బాగు చేయించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి దీనికి సంబందించిన ఏ మరమ్మత్తులు వచ్చినా ఖరీఫ్ సీజన్ కు ముందుగానే చేపించాలని రైతులు కోరుతున్నారు










