Dec 25,2021 07:14

కీలవేన్మణి దళిత బిడ్డల పోరాటం వృథా పోలేదు. ఆ పోరాట స్ఫూర్తిని అందుకుని రైతు కూలీలు, శ్రమజీవులందరూ మరింత సంఘటితమై తంజావూరు జిల్లా అంతటా ఉధృతంగా పోరాటాలు సాగించారు. పోరాటాలకు తలొగ్గిన భూస్వాములు కూలీ రేట్లు పెంచాల్సి వచ్చింది. దళిత చైతన్యం వెల్లివిరిసిన కారణంగా కుల వివక్ష కూడా క్రమక్రమంగా తోకముడిచింది. పోరాట ఫలంగా భూమిని దక్కించుకున్న రైతు కూలీలు చిన్నపాటి రైతులుగా ఎదిగారు. అమరవీరుల త్యాగాలతో ఎరుపెక్కిన ఎర్రజెండా మరింత సమున్నతంగా ఎగిరి..వారి జీవితాల్లో గౌరవప్రదమైన మార్పులు తీసుకురాగలిగింది.

     కుల రక్కసి సృష్టించిన అసమానతల వ్యవస్థపై మనదేశంలో తిరుగుబాట్లెన్నో జరిగాయి. స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటనగా నిలిచిన కీలవేన్మణి పోరాటం అందులో ఒక మహోజ్వల ఘట్టంగా భాసిల్లుతున్నది. మనువాద శక్తులు నేడు మరింతగా బలాన్ని సంతరించుకుని ... దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసి మను వ్యవస్థ పున:ప్రతిష్టాపన చేసేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. కీలవేన్మణి పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకోవడం.. ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగించడం నేడు మరింత అవసరం. 1961 జనాభా లెక్కల ప్రకారం...తమిళనాడులో అత్యధిక శాతం భూమి లేని నిరుపేదలు తంజావూరు జిల్లాలో ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడ్డ వారిలో.. ప్రతి పది మందిలో, తొమ్మిది మంది సొంత భూమి లేక ఇతరుల పొలాల్లో కూలి పనులు చేసి పొట్ట నింపుకునే వారే. దేవుడి పేరు మీద ఉన్న భూములు సైతం అగ్ర వర్ణాల కబ్జాలో ఉండి ఆదాయం వారికే దక్కేది. భూమి గల ఆసాములందరూ అగ్రవర్ణాల వారు కాగా.. రైతు కూలీలలో తొంభై శాతం వరకు నిమ్న వర్గాలకు చెందిన వారే. ఈ కుటుంబాలు పిల్లాజెల్లాతో భూస్వాముల పొలాల్లో వెట్టిచాకిరి చేస్తూ బతుకులు గడపాల్సి వచ్చేది. కుల వ్యవస్థ తాలూకు వివక్ష రూపాలన్నీ కీలవేణ్మని పరిసర ప్రాంతాల్లో అమలులో ఉండేవి. అస్పృశ్యత, వెట్టిచాకిరి, బావులలో నీటి వాడకంపై నిషేధం, కట్టుబాట్లను ధిక్కరిస్తే కొరడా శిక్షలు, దళిత స్త్రీలపై లైంగిక అత్యాచారాలు యథేచ్ఛగా సాగేవి. ఆలయాలకు.. విద్యాలయాలకూ దూరంగా దళిత బిడ్డలను నెట్టివేసిన మనువు పాలన నిరాటంకంగా సాగేది. మగవాళ్లు ఒంటి పైభాగంలో వస్త్రం వేసుకోవడం, వీధుల్లో చెప్పులేసుకుని నడవడం, దళిత స్త్రీలు వక్షస్థలాన్ని దాచుకోవడం అక్కడ నిషిద్ధం. చేసిన కూలీకి తగిన జీతం సైతం అడగ లేని బానిస బతుకులు అక్కడ కొనసాగాయి. రైతు కూలీలపై భూస్వాముల దౌర్జన్యాలు ఇష్టానుసారం కొనసాగేవి. భూస్వాములు ప్రత్యేకంగా గూండాలను ఏర్పాటు చేసుకుని నోరెత్తితే దాడులు చేసేవారు. ఈ నేపథ్యంలో జిల్లా లోని రైతు కూలీలు సంఘటితమై సిపిఎం నేతృత్వంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తంజావూరు జిల్లా లోని కీలవేన్మణి పరిసర ప్రాంతాల్లో సంఘం కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. సిపిఎం స్థానిక నాయకులు మణి అమ్మై, శ్రీనివాసరావు, ఇతరులూ రైతు కూలీలందరినీ చైతన్యపరిచి సంఘం జెండా కింద ఐక్యం చేసారు. రైతు కూలీల గుడిసెల మీద రెపరెపలాడిన ఎర్రజెండాలు భూస్వాములకు కంటగింపుగా పరిణమించాయి. ధనికస్వాములు ఏహ్యభావంతో.. పేద ప్రజలు ఆరాధనా భావంతోనూ తమిళ భాషలో సిపిఎం పార్టీని పెరయన్‌ కచ్చి (దళితుల పార్టీ)గా పిలిచేవారు. 1968 సంవత్సరంలో వ్యవసాయ కూలీ రేట్లు పెంచాలనే ఉద్యమం ఊపందుకున్నది. రాజగోపాలన్‌ నాయుడు అనే భూకామందు నాయకత్వంలో భూస్వాములందరూ ఏకమై కూలీల ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మొదలుపెట్టారు. వ్యవసాయ కార్మిక సంఘానికి పోటీగా వ్యవసాయదారుల సంఘాన్ని స్థాపించి.. పోరాడుతున్న రైతుకూలీలపై ఎదురుదాడి మొదలు పెట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు భూస్వాముల పొలాలలో పనులు సాగవని తేల్చి చెప్పిన రైతు కూలీలు సమ్మెకు దిగారు. దాంతో రెచ్చిపోయిన భూస్వాములు స్థానిక కూలీలను పనుల నుండి తొలగించి.. వేరే ప్రాంతాల నుండి కూలీలను తీసుకువచ్చి వాళ్ళ చేత పనులు చేయించడం మొదలు పెట్టారు. సిపియం పార్టీ నాయకులు ఇతర ప్రాంతాల కూలీలకు నచ్చచెప్పడంతో.. వారు సైతం పోరాటానికి అండగా నిలిచి భూస్వాముల పొలం పనులను బహిష్కరించారు. డిసెంబర్‌ 25, 1968న భూస్వాముల గూండాలు.. గణపతి, ముత్తుస్వామి అనే కార్మిక సంఘ కార్యకర్తలను కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేసారు. రైతు కూలీలందరూ కర్రలు, బరిసెలు పట్టుకుని ఊరేగింపుగా బయల్దేరి.. భూస్వాముల ఇళ్లపై దాడి చేసి తమ వారిని విడిపించుకున్నారు. ఆ దాడిలో భూస్వాముల గూండా ఒకడు రైతు కూలీల చేతుల్లో చనిపోవడం జరిగింది. రైతు కూలీల ప్రతిఘటన భూస్వాముల ఉక్రోషాన్ని రెచ్చగొట్టింది. ఇక సహించకూడదని భావించిన భూస్వాములు..చుట్టుపక్కల గ్రామాలలో తమకు మద్దతు ఇచ్చే వాళ్లందర్నీ సమీకరించుకుని పోలీసుల అండతో అదే రోజు రాత్రి దళితవాడపై దండెత్తారు. భూస్వాముల పక్షం వహించిన పోలీసులు అకారణంగా రైతు కూలీపై కాల్పులు జరపగా ...కొందరు మరణించారు. మిగతా వారందరూ పోలీసుల దాడి నుండి తప్పించుకునే క్రమంలో రైతు కూలీ రామయ్యకు చెందిన గుడిసెలో తలదాచుకున్నారు. గోపాలకృష్ణన్‌ నాయుడు, ఇతర భూస్వాములూ గుడిసె దగ్గరకు చేరుకుని గుడిసె పై పెట్రోల్‌ పోసి నిప్పంటించమని గూండాలను ఆదేశించారు. పసి పిల్లలు, మహిళలు తలదాచుకున్న గుడిసెపై నిర్దాక్షిణ్యంగా పెట్రోలు చల్లి మంట అంటించారు. క్షణాల్లో రామయ్య గుడిసె అగ్నిగుండంగా మారింది. లోపల తల దాచుకున్న వారు ఆర్తనాదాలు చేస్తూ అగ్నికి ఆహుతయ్యారు. పసి పిల్లల్నైనా రక్షించుకుందామనే ఆశతో తగలబడుతున్న తల్లులు తమ పిల్లల్ని బయటకి విసిరేస్తే.. బయటనున్న భూస్వాములు వాళ్లని మళ్లీ గుడిసె మంటల్లోకి తోసారు. తెల్లారి తీరిగ్గా వచ్చిన పోలీసులు.. కాలి బూడిదైన గుడిసె పరిసరాలను పరిశీలిస్తే.. 44 మంది దళిత బిడ్డల కాలిన కళేబరాలు దర్శనమిచ్చాయి. అందులో 23 మంది పిల్లలు, 16 మంది మహిళలు, ఐదుగురు పురుషులూ ఉన్నారు. కీలవేన్మణి మారణకాండ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. దురదృష్టవశాత్తూ న్యాయ వ్యవస్థ సైతం దళితులకు న్యాయం అందించడంలో విఫలమైంది. నాగపట్టిణం జిల్లా కోర్టు గోపాలకృష్ణన్‌ నాయుడు తోసహా పది మందిని దోషులుగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే..మద్రాస్‌ హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవనే నెపంతో వారిపై శిక్షను రద్దుచేసింది. బాధితులు చెప్పిన దాని ప్రకారం గోపాలకృష్ణన్‌ నాయుడు ఇతరులూ తగలబడిన రామయ్య గుడిసె దగ్గరకు వచ్చారనే కథనం నమ్మశక్యంగా లేదని గౌరవ న్యాయమూర్తి తేల్చేసారు. డబ్బున్న ఆసాములు తమ ఇళ్లలోనే ఉండి తమ మనుషులకు ఆదేశాలు ఇస్తారు తప్ప స్వయంగా మారణకాండలో పాల్గొన్నారు అంటే నమ్మలేం..అనే కారణాలను సదరు న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్నా దురై నాయకత్వంలోని డిఎంకె ప్రభుత్వం సైతం.. పలుకుబడి గల వర్గాలకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం చేయలేక బాధితులకు న్యాయం అందించడంలో ప్రేక్షక పాత్ర వహించింది. భూస్వామ్య శక్తులు అగ్నికి ఆహుతి చేసిన ఆ రామయ్య గుడిసె స్థానంలో ఉద్యమకారులు ఒక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. 44 మంది అమరవీరుల పేర్లు ఒక ఎర్రటి గ్రానైట్‌ రాయిపై చెక్కబడినాయి. నాటి బెంగాల్‌ ఉప ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆ స్మృతి చిహ్నానికి శంకుస్థాపన చేశారు. మాయంది భారతి అనే స్వాతంత్య్ర సమర యోధుడు కీలవేన్మణి మారణకాండ జరిగిన మరుసటి రోజు అక్కడికి చేరుకుని మృత వీరుల అవశేషాలను ఒక గాజు గిన్నెలో సేకరించాడు. సదరు గిన్నెను స్మృతి చిహ్నంలో నిక్షిప్తం చేశారు. నేడది తమిళనాట ప్రగతిశీల శక్తుల తీర్థాస్థలిగా నిలిచింది. కీలవేన్మణి బాధితులకు న్యాయం దక్కాలంటూ జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో మహిళా ఉద్యమ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. మారణకాండ జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత ఐద్వా తమిళనాడు రాష్ట్ర మొదటి మహాసభ ఆ చిన్న ఊర్లోనే జరుపుకున్నారు. ఐద్వా జాతీయ నాయకురాలు కామ్రేడ్‌ మైథిలి శివరామన్‌ పత్రికల్లో విస్తృతంగా వ్యాసాలు రాసి.. బాధితులకు బాసటగా రాష్ట్ర ప్రజలను సమీకరించారు. కీలవేన్మణి వీరగాథపై ఆమె రాసిన వ్యాసాల పరంపర.. 'హాంటెడ్‌ బై ఫైర్‌' పేరిట పుస్తకంగా తీసుకొచ్చారు. నాటి దళిత బిడ్డల ప్రతిఘటనపై ప్రముఖ తమిళ రచయిత్రి ఇందిరా పార్థసారథి రాసిన కురుదిప్పునల్‌ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 1983లో ఆ నవల ఆధారంగా కన్న్‌ శివంతల్‌ మన్న్‌ శివక్కం అనే తమిళ చిత్రం వచ్చింది. 2019 లో వచ్చిన ధనుష్‌ నటించిన అసురన్‌ (తెలుగులో నారప్ప) సినిమా సైతం కీలవేన్మణి మారణకాండను ఇతివృత్తంగా తీసుకుని వచ్చిందే. కీలవేన్మణి దళిత బిడ్డల పోరాటం వృథా పోలేదు. ఆ పోరాట స్ఫూర్తిని అందుకుని రైతు కూలీలు, శ్రమజీవులందరూ మరింత సంఘటితమై తంజావూరు జిల్లా అంతటా ఉధృతంగా పోరాటాలు సాగించారు. పోరాటాలకు తలొగ్గిన భూస్వాములు కూలీ రేట్లు పెంచాల్సి వచ్చింది. దళిత చైతన్యం వెల్లివిరిసిన కారణంగా కుల వివక్ష కూడా క్రమక్రమంగా తోక ముడిచింది. పోరాట ఫలంగా భూమిని దక్కించుకున్న రైతు కూలీలు చిన్నపాటి రైతులుగా ఎదిగారు. అమరవీరుల త్యాగాలతో ఎరుపెక్కిన ఎర్రజెండా మరింత సమున్నతంగా ఎగిరి..వారి జీవితాల్లో గౌరవప్రదమైన మార్పులు తీసుకు రాగలిగింది. అయితే మనువాద భూతం మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నదన్నది సత్యం. కీలవేన్మణులను.. ఖైర్లాంజీలను.. కారంచేడులను... అనేకానేకం సృష్టించిన మనువాదం నేడు మరింత బలపడి.. దేశమంతటా స్వైరవిహారం చేస్తున్న వేళ.. శిరస్సు వంచని శంభూకుడి వారసత్వాన్ని తమ అసమాన త్యాగాలతో నిలబెట్టిన ఆ తమిళగడ్డ దళిత పులుల పోరాట పటిమ నేటి కాలపు సామాజిక న్యాయ పోరాటాలకు స్ఫూర్తిదాయకమై నిలిచిఉన్నది. భూస్వామ్య క్రౌర్యానికి కాలి బూడిదయిన ఆ రామయ్య గుడిసె రగిలించిన నిప్పు రవ్వ.. వర్గ దోపిడినీ నిర్మూలించడానికి సాగుతున్న ఉద్యమాలకు దివిటీయై వెలుగొందుతున్నది.

నేడు కీలవేన్మణి మృతవీరుల సంస్మరణ దినం ( వ్యాసకర్త సెల్‌: 9440443183 )

ఆర్‌. రాజేశమ్‌