వివిధ జిల్లాల్లో ఉన్న ఆటోనగర్, పారిశ్రామిక వాడల స్థలాలపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కాలుష్యం పేరుతో వీటిని జనావాసాలకు దూరంగా తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడున్న స్థలపు మార్కెట్ విలువలో సగం మొత్తాన్ని చెల్లించాలని, లేని పక్షంలో సగం స్థలాన్ని అప్పచెప్పాలని పారిశ్రామికవేత్తలకు హుకుం జారీ చేసింది. పారిశ్రామికవేత్తలు ఖాళీ చేసే స్థలాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. నిజంగా కాలుష్యమే కారణమైతే జనావాసాలకు దూరంగా తరలించవచ్చు. దానికి కూడా ఆ మేరకు అధ్యయనాలు జరగాలి. కాలుష్య తీవ్రతను నిర్ధారించాలి. వాటిని ప్రజల ముందు చర్చకు పెట్టాలి. రాష్ట్రంలో ఇటువంటి ప్రక్రియ జరిగిందా అంటే లేదు. ఒకవేళ జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా 160 పైగా ఉన్న ఆటోనగర్‌లు, పారిశ్రామిక వాడల్లో కాలుష్య తీవ్రత ఒకే విధంగా ఉందా? అన్నింటిని మరో ప్రాంతాలకు తరలించి తీరాల్సిందేనా? కాలుష్యం మీదా, ప్రజారోగ్యం మీద అంత చిత్తశుద్ధి ఉంటే కొన్ని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటోందని, వాటిని అక్కడి నుండి తరలించాలని రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ కనీస చర్యలు తీసుకోకుండా, ఇక్కడ మాత్రం మార్కెట్ విలువలో సగమో లేకపోతే సగం స్థలమో ఇచ్చి ఊరి బయటకెళ్లాలని ఆదేశాలు జారీ చేయడమేమిటి? దీంతో ప్రభుత్వ చిత్తం కాలుష్యంపై కాదని, కాసులపైనే అని స్పష్టమౌతోంది.
పోనీ, ఇవేమన్నా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్థలాలా అంటే అటువంటిదేమీ కాదు. ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం అప్పటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు వీటిని కొనుక్కున్నారు. అప్పట్లో జనావాసాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో నానా తిప్పలు పడి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఆ యూనిట్లు ఇప్పుడు పట్టణాలు, నగరాల మధ్యకు చేరాయి. భూమి విలువ అనూహ్యంగా పెరిగింది. ఇంత కష్టపడి, ఇంత చేసిన తరువాత ఇప్పుడు తరలించడమంటే నిజానికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. అదేమి లేకుండా సగం స్థలం ఇచ్చి ఊరి బయటకు వెళ్లాలంటూ జారీ చేసిన ఆదేశాలకు ప్రభుత్వం ఏంపేరు పెట్టినప్పటికీ ఆచరణలో సర్కారీ భూ దాహానికి నిదర్శనంగానే మిగులుతుంది. ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసి, అదే సమన్వయం, అదే అభివృద్ధి అంటే ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఆటోనగర్‌లు, పారిశ్రామిక వాడల్లో లక్షలాదిమంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులే! రోజువారీ వేతనాలపై ఆధారపడి పొట్టపోసుకునే వారే! వారందరీకి ఈ తరలింపు జీవన్మరణ సమస్యగా మారుతుంది. ప్రభుత్వ దృష్టిలో వీరసలు ఉన్నారా? ఉంటే వీరి కష్టనష్టాలపై ఏం ఆలోచించారు? ఏం చర్యలు తీసుకుంటారు? అంతా అగమ్యగోచరం. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీవో ల్లోనూ కార్మికుల ప్రస్తావన మాటమాత్రం కూడా లేదు.
ఉపాధి కల్పనలో చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఇ)లు పోషించే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్ట కాలంలో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో ఇవి కూడా ఉన్నాయి. వీటిని ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజిలు ఇస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే ప్రకటించినప్పటికీ ఆచరణ అంతంతమాత్రమే! సర్కారీ ప్యాకేజీలను అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్లు తన్నుకుపోతే నామమాత్రపు సాయం కూడా అందకుండా కునారిల్లుతున్న ఎంఎస్‌ఎంఇ లు ఉన్నాయి. వీటిని ఆదుకోవడానికి బదులుగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆ పరిశ్రమలపై గొడ్డలివేటుగా మారే ప్రమాదం ఉంది. ఉన్న స్థలాన్ని కోల్పోవడంతో పాటు, కొత్తగా ప్రభుత్వం ఇవ్వజూపే చోట కొనుక్కోవాల్సిరావడమే దీనికి కారణం. రాష్ట్రంలో ఇప్పటికే భూముల ధరలు ఆకాశానికి దగ్గరగా ఉన్నాయి. కొత్త స్థలాలకు ప్రభుత్వం ఎంత ధర నిర్ణయిస్తుందో తెలియదు. అక్కడ కొనుక్కొని కొత్తగా యూనిట్లు పెట్టే సామర్ధ్యం ఎందరికి ఉంటుందో తెలియదు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రాభివృద్ధిని ప్రశ్నార్ధకంగా మార్చడంతో పాటు, ఉపాధి కల్పన లక్ష్యాలను నీరుగారుస్తుంది. అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ బలవంతపు ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆచరణాత్మకమైన ప్రణాళికను రూపొందించాలి.










