Nov 09,2022 00:00

మృతదేహం వద్ద రోధిస్తున్న తోటి స్నేహితులు

ప్రజాశక్తి- దేవరాపల్లి
మండలంలోని వాలాబు పంచాయితీ సమీపంలో ఉన్న సరియా జలపాతంలో కాలుజారి పడి విశాఖకు చెందిన బిబిఎం విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మరో విద్యార్థిని తోటి స్నేహితులు కాపాడారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... కార్తీక మాసం సందర్భంగా విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఐఐఎం కాలేజీలో బిబిఎం కోర్సు చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మంగళవారం ఉదయం సరియా జలపాతానికి వచ్చారు. స్నేహితులంతా కలిసి ఆనందంగా గడుపుతున్న సమయంలో పోతుల పవన్‌ కుమార్‌ (20) ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన మరో యువకుడు కౌశిక్‌ తన స్నేహితుడిని రక్షించడానికి జలపాతంలోకి దిగాడు. ఆ యువకుడు కూడా ప్రమాదంలో చిక్కుకోవడంతో తోటి స్నేహితులు ప్రాణాలకు తెగించి కౌశిక్‌ను కాపాడారు. అప్పటికే పవన్‌ జలపాతంలో మునిగి అదృశ్యం కావడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయానికి పవన్‌ మృతదేహాన్ని బయటికి తీశారు. దేవరాపల్లి పోలీసులకు సమాచారం అందించి, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమతో కలిసి వచ్చిన స్నేహితుడు కళ్ళముందే మృత్యువాత పడడంతో మిగతా స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు పవన్‌కు తల్లిదండ్రులు వెంకటస్వామి, కుమారి, చెల్లెలు గాయత్రి ఉన్నారు. వీరు విశాఖ గురుద్వార్‌లో నివాసముంటున్నారు. ప్రమాదం జరిగిన స్థలం అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండటంతో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని ఎస్‌.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.